తెలంగాణా రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకోబోతున్నదా? బీఆర్ఎస్ పార్టీని, దాని చీఫ్, సీఎం కేసీఆర్ ను నేరుగానే టార్గెట్ చేస్తూ ఘాటైన విమర్శలు చేస్తున్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏమిటి? ఆయన బీజేపీలో చేరుతారా? కాంగ్రెస్ లో చేరుతారా? మరేదైనా వ్యూహం ఉందా? అనే ప్రశ్నలకు సమాధానం చేరువలోనే ఉందా? అంటే.. ఔననే సమాచారం వస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలన నిర్ణయం దిశగా పొంగులేటి అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ఖమ్మంలోని తన నివాసంలో పొంగులేటి చేసిన వ్యాఖ్యలు అధికార బీఆర్ఎస్ పార్టీలో పెను సంచలనానికి దారి తీసిన సంగతి తెలిసిందే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనను నమ్ముకున్న, ప్రజల ఆశీస్సులు గల నాయకులు ఖచ్చితంగా పోటీ చేస్తారని పొంగులేటి ప్రకటించడం అనేక పరిణామాలకు దారి తీసింది. మాజీ ఎంపీ ప్రకటనతో ఒక్కసారిగా అలర్టయిన బీఆర్ఎస్ నాయకత్వం అత్యంత వేగంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే ఎక్కడో ఢిల్లీలో నిర్వహించాల్సిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ వేదికను ఖమ్మానికి మార్చి, గత జనవరి 18న ఓ బహిరంగ సభను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పొంగులేటి కదలికలను నిశితంగా పరిశీలిస్తున్న బీఆర్ఎస్ నాయకత్వం ఆయన వెంట వెళ్లే నాయకులపై దృష్టి సారించింది. పొంగులేటి వెంట వెడుతున్న నాయకులనుగాని, కేడర్ ను గాని నిలువరించడంలో బీఆర్ఎస్ నేతలు పెద్దగా సక్సెస్ కాలేదనే కామెంట్లు ఉండనే ఉన్నాయి.
ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జెడ్పీ చైర్మెన్ కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, వైరా మున్సిపల్ చైర్మెన్ సూతకాని జైపాల్, మార్క్ ఫెడ్ వైస్ చైర్మెన్ బొర్రా రాజశేఖర్ వంటి ముఖ్య నేతలతోపాటు ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అనేక మంది పొంగులేటి వెంటే నడుస్తున్నారు. వైరా నియోజకవర్గంలో కొందరిపై బీఆర్ఎస్ నాయకత్వం సస్పెన్షన్ వేటు వేసినప్పటికీ, పొంగులేటి అనుచరులు బేఖాతర్ చేయడం గమనార్హం. తాము పొంగులేటి వెంటే నడుస్తామని అనేక మంది నాయకులు, బీఆర్ఎస్ కేడర్ వర్గాలు కూడా పదే పదే స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిణామాల్లోనే నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన స్వరాన్ని పెంచారు. పినపాక ఆత్మీయ సమ్మేళనం నుంచి నేరుగా సీఎం కేసీఆర్ నే టార్గెట్ చేస్తూ విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్నారు. మొత్తంగా కేసీఆర్ సర్కారు పనితీరునే ఆయన వేలెత్తి చూపుతున్నారు. అనేక ప్రశ్నలు కూడా సంధిస్తున్నారు. దమ్ముంటే తనను సస్పెండ్ చేయాలని పొంగులేటి సవాల్ విసురుతుండగా, తానే రాజీనామా చేసి వెళ్లపోవాలని బీఆర్ఎస్ జిల్లా నాయకులు ప్రతిగా జవాబిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే పినపాక, వైరా, ఇల్లెందు, అశ్వారావుపేట, మధిర నియోజకవర్గాలకు పొంగులేటి తన అభ్యర్థులను ప్రకటించారు. ఇంకోవైపు వివిధ నియోజకవర్గాల్లో ‘పొంగులేటి శీనన్న క్యాంపు ఆఫీసు’ల పేరుతో కార్యాలయాలు ఓపెన్ చేస్తున్నారు. ఓకే.. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతివిమర్శల సంగతి ఎలా ఉన్నప్పటికీ, ఇంతకీ పొంగులేటి రాజకీయ పయనమెటు..? ఇదీ తాజా ప్రశ్న.
పొంగులేటి ఏ ధైర్యంతో తన అభ్యర్థులను ప్రకటిస్తున్నారు? అటు బీజేపీగాని, ఇటు కాంగ్రెస్ పార్టీ గాని టికెట్ల విషయంలో ఆయనకు ఇచ్చిన హామీలు ఏమిటి? ఈ ప్రశ్నలకు అశ్వారావుపేట ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి ఘాటైన సమాధానమే ఇచ్చారు. తనకు లేని ఆందోళన ఇతరులకు ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. తన ధైర్యం, తన లెక్కలు తనకు ఉన్నాయని వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే రెండు నెలలు గడిచింది. మార్చి నెలలో పొంగులేటి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారనే సారాంశంతో భిన్న కథనాలు కూడా వ్యాప్తిలో ఉన్నాయి. ఇంతకీ పొంగులేటి బీజేపీలో చేరుతున్నారా? కాంగ్రెస్ వైపు చూస్తున్నారా? బీజేపీలో చేరితే కమ్యూనిస్టు భావజాలం గల ఖమ్మం జిల్లాలో పొంగులేటి నెగ్గుకురావడం అంత ఈజీ ఏమీ కాదనే వాదనలూ ఉన్నాయి. కాంగ్రెస్ లో చేరితే తాను ఆశించిన సంఖ్యలో తన వాళ్లకు టికెట్లు ఇప్పించుకునే సంగతి ఎలా ఉన్నా, చివరికి ఆయనకు టికెట్ దక్కడం కూడా గగనమనే వ్యాఖ్యలు ఉండనే ఉన్నాయి. ఇందుకు ఆ పార్టీలో గల విపరీత ప్రజాస్వామ్యమే కారణమనే విశ్లేషణలు ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో పొంగులేటి తీసుకునే నిర్ణయం ఏమిటి?
విశ్వసనీయ సమాచారం ప్రకారం… పొంగులేటి శ్రీనివాసరెడ్డి అటు బీజేపీలోగాని, ఇటు కాంగ్రెస్ లోగాని చేరకపోవచ్చు. తెలంగాణా రాజకీయాల్లో ఆయన పెను సంచలన నిర్ణయం తీసుకునే అవకాశమే ఉంది. ‘కొడితే కుంభ స్థలాన్నే కొట్టాలి’ అనే సామెతకు అనుగుణంగా అడుగులు వేయవచ్చు. ఏమిటా అడుగులు? ఏమా సంచలన నిర్ణయం? అనుకుంటున్నారా? ఓసారి ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంటున్న పరిణామాలను రివైండ్ చేసుకోండి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లోని ఐదు స్థానాల్లో పొంగులేటి అభ్యర్థులను ప్రకటించారు. మరో ఐదు సెగ్మెంట్లలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాల్సి ఉంది. కానీ మిగిలిన ఈ ఐదు నియోజకవర్గాలకు ఇప్పుడే అభ్యర్థులను ప్రకటించకూదడని పొంగులేటి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పొంగులేటి ఏదిశగా పొలిటికల్ అడుగులు వేయనున్నారు? ఎస్.. అనేక మంది అంచనాలు కార్యరూపం దాల్చే రోజు త్వరలోనే ఉంది. పొంగులేటి ఓ ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయినట్లు సమాచారం. కేంద్ర ఎన్నికల కమిషన్ వద్ద పార్టీ పేరును కూడా రిజిస్టర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ పేరు ‘తెలంగాణా రైతు సమితి’గా పొంగులేటి అనుచర, అభిమానగణంలో చర్చ జరుగుతోంది. తెలంగాణా రైతు సమితి అంటే.. షార్ట్ కట్ లో టీఆర్ఎస్ గా పిల్చుకోవచ్చు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఆవిర్భవించిన టీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ గా మారిన నేపథ్యంలో తెలంగాణా రైతు సమితి (టీఆర్ఎస్) పేరును రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది.
ఇదే పేరుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనేగాక, ఈ ఖిల్లాకు లెఫ్ట్, రైట్ దిశల్లో గల వరంగల్, నల్లగొండ జిల్లాల్లో కూడా పొంగులేటి పార్టీ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. మూడు జిల్లాల్లో మొత్తం 30కిపైగా నియోజకవర్గాల్లో పోటీ చేయడం ద్వారా కనీసం 25 సీట్లలో గెలుపొంది రాష్ట్ర రాజకీయాల్లో కింగ్ మేకర్ లేదంటే కింగ్ గానే చక్రం తిప్పేందుకు పొంగులేటి భారీ కసరత్తు చేస్తున్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ అంశంలో కేంద్రంలో అధికారంలో గల బీజేపీ పొంగులేటికి వెన్నుదన్నుగా నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు. నేరుగా బీజేపీలో చేరడం వల్ల ఖమ్మం జిల్లాలో లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుందని, కాంగ్రెస్ వల్ల ఫాయిదా లేదనే నిర్ణయానికి ఆత్మీయ సమ్మేళనాల ద్వారా సేకరించిన ఫీడ్ బ్యాక్ ద్వారా పొంగులేటి భావిస్తున్నట్లు సమాచారం. అయితే పొంగులేటి నిర్ణయానికి, ఆయన వేస్తున్న తాజా అడుగులకు బీజేపీ ఎందుకు సహకరిస్తుంది..? అనే ప్రశ్నకు కూడా నిర్వచనం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో కేసీఆర్ పార్టీని గద్దె దించేందుకు అవసరమైన అన్ని శక్తులను కూడదీసుకునే దిశగా బీజేపీ నిర్ణయాలు ఉండడంలో ఆశ్చర్యం లేదంటున్నారు. ఎన్నికల అనంతరం పొంగులేటి తీసుకునే నిర్ణయం ఇప్పటికైతే అప్రస్తుతమంటున్నారు. మొత్తంగా పొంగులేటి ధైర్యంగా ప్రకటిస్తున్న అభ్యర్థుల అంశం, వివిధ నియోజకవర్గాల్లో ప్రారంభిస్తున్న క్యాంపు ఆఫీసుల సీన్లు శీనన్న కొత్త పార్టీ ప్రచారానికి బలం చేకూరుస్తున్నట్లుగానే ఉంది కదూ! నమ్మశక్యం కాకుంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కదలికలను, ఆయన వేస్తున్న అడుగులను మరింత నిశితంగా పరిశీలిస్తూ మరోసారి రివైండ్ చేసుకోండి.