ఇక్కడ మీరు చూస్తున్నది క్రికెట్ బ్యాటింగ్ సీనే కావచ్చు. బ్యాటింగ్ చేస్తున్నది ఎవరో తెలుసు కదా..? రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాదరెడ్డి. ఖమ్మం జిల్లాలోని ఓ ప్రాంతంలో యువకులు నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రసాదరెడ్డి సరదాగానే బ్యాటింగ్ చేసి ఉండవచ్చు.. కానీ ఈ దృశ్యమే ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఔను కాంగ్రెస్ నాయకుడు పొంగులేటి ప్రసాదరెడ్డి చేస్తున్నది క్రికెట్ బ్యాటింగ్ కాదు… పొలిటికల్ బ్యాటింగ్ ప్రారంభించారు. క్రికెట్ లో పొలిటికల్ బ్యాటింగ్ ఏమిటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ పూర్తిగా చదవాల్సిందే..

బైక్ పై తిరుగుతూ పర్యటిస్తున్న ప్రసాదరెడ్డి

రాష్ట్ర రాజకీయాల్లోనే ఖమ్మం జిల్లాది ప్రత్యేక స్థానం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీసుకున్న కీలకనిర్ణయం పెనుమార్పునకు దారి తీసిందనే చెప్పాలి. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పై పొంగులేటి తిరుగుబాటు చేసిన ఘటన రాజకీయంగా పెనుమార్పులకు దారి తీసిన పరిణామాలు తెలిసిందే. పొంగులేటి మార్గంలోనే తుమ్మల నాగేశ్వర్ రావు పయనం. వీరిద్దరి వెంట జూపల్లి క్రిష్ణారావు.. ఆ తర్వాత మరికొందరు… మొత్తంగా కేసీఆర్ సీఎం సీటుకు ఎసరు తీసుకురావడంలో గంట మోగించిన ఘనతను పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంతం చేసుకున్నారనేది నిర్వివాదాంశం. అయితే ఇప్పుడేంటీ అంటే.. ప్రస్తుతం కూడా ఖమ్మం రాజకీయాలు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాదరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కుమారుడు యుగంధర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఖమ్మం ఎంపీ టికెట్ ను ఆశిస్తున్నారు. ఈ ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులతోపాటు మరికొందరు కూడా టికెట్ కోసం దరఖాస్తు చేశారు. మధ్యలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ కుమార్, సీనియర్ నేత వి. హనుమంతరావులు కూడా ఖమ్మం ఎంపీ టికెట్ అడిగే హక్కు తమకూ ఉందంటూ  కర్చీఫ్ వేస్తున్నారు. ఇంకోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని తెలంగాణా నుంచి పోటీ చేయాలని పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి కోరారు. రాహుల్ నిర్ణయం ఏమిటో ఇంకా తెలియదు.. నల్లగొండ, భువనగిరి, ఖమ్మం కాంగ్రెస్ నాయకులు ఈ విషయంలో తీవ్ర ఉత్కంఠను ఎదుర్కంటున్నారు. రాహుల్ తెలంగాణా నుంచి పోటీకి అంగీకరిస్తే ఆయా మూడు స్థానాల్లో ఎక్కడినుంచైనా పోటీ చేసే అవకాశం ఉంది.

పార్టీ నాయకులు, కార్యకర్తలతో మమేకం

ఇటువంటి ఉత్కంఠ రాజకీయ పరిణామాల్లో పొంగులేటి ప్రసాదరెడ్డి రాజకీయంగా ఓ అడుగు ముందుకేశారు. తన అన్న ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరులో ప్రసాదరెడ్డి పర్యటిస్తే పెద్ద విశేషం కాకపోవచ్చు. మంత్రిగా శ్రీనివాసరెడ్డి బిజీగా ఉండడంతో ప్రసాదరెడ్డి తన అన్న తరపున ప్రజాసేవ చేస్తున్నారని భావించవచ్చు. కానీ ప్రసాదరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సుడిగాలిలా పర్యటిస్తున్నారు. ఇటీవల ఈ పర్యటనలను మరింత విస్తృతం చేశారు. తరచుగా పాలేరు. నిన్న కొత్తగూడెం సెగ్మెంట్లలో పర్యటించారు. తాజాగా సత్తుపల్లి, వైరా.. వరుసలో అశ్వారావుపేట తదితర అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ పర్యటించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ పర్యటనలో ప్రసాదరెడ్డి శుభకార్యాలకు హాజరవుతున్నారు. దేవాలయాలను సందర్శిస్తున్నారు. అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. యువకులతో సరదాగా, ఉల్లాసంగా ఆటల్లో పాల్గొంటున్నారు. వివిధ అవసరాల కోసం ఎదురుచూస్తున్నవారికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేస్తున్న సభల్లో పాల్గొని ప్రసంగిస్తున్నారు. పార్టీ కార్యకర్తలను ఉత్తేజపరుస్తున్నారు.

దైవదర్శనాల్లో ప్రసాదరెడ్డి దంపతులు

అంతేకాదు.. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులుగా కృషి చేద్దామని ప్రసాదరెడ్డి పిలుపునిస్తున్నారు. బీఆర్ఎస్ ను భూస్థాపితం చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలను కోరుతున్నారు. పార్టీని నమ్ముకుని, కష్టపడి పనిచేసిన వారందరికీ సమచిత స్థానం దక్కుతుందని కాంగ్రెస్ కార్యకర్తలకు భరోసానిస్తున్నారు… అచ్చం తన సోదరుడు శ్రీనివాసరెడ్డి తరహాలోనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా, ముఖ్యంగా ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రసాదరెడ్డి రాజకీయంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఖమ్మం ఎంపీ టికెట్ ను ఆశిస్తున్న పలువురు నాయకులకు భిన్నంగా ప్రసాదరెడ్డి అడుగులు రాజకీయంగా ముందున్నాయని చెప్పేందుకు ఆయా దృశ్యాలు నిదర్శనం. ప్రసాదరెడ్డి పొలిటికల్ స్టెప్పుల్లో విషయం ఈపాటికి అర్థమయ్యే ఉంటుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అర్థం కానివారికి అర్థం కావలసిందేమిటంటే… ఎంపీ టికెట్ విషయంలో పొంగులేటి బ్రదర్ కు క్లియర్ ఇండికేషన్స్ ఉన్నాయనేది సుస్పష్టం. అదీ అసలు సంగతి.

Comments are closed.

Exit mobile version