గతంలో నిర్మించిన స్టీల్ బ్రిడ్జి విషయంలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశపు ఉత్తర్వును అమలు చేయాలని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాదరెడ్డి తరపున నీటిపారుదల శాఖకు చెందిన అధికారులకు న్యాయవాదులు లీగల్ నోటీసులు జారీ అందజేశారు. ఈమేరకు పొంగులేటి ప్రసాదరెడ్డి తరపున ఎం. నిరంజన్ రెడ్డి సహా పలువురు న్యాయవాదులు ఇంజనీరింగ్ అధికారులను కలిసి స్వయంగా లీగల్ నోటీసులను అందజేశారు.
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి కుటుంబం నిర్మించిన తాత్కాలిక స్టీల్ బ్రిడ్జి విషయంలో తెలంగాణా హైకోర్టు ఈనెల 28న కీలక ఉత్తర్వును జారీ చేసిన సంగతి తెలిసిందే. ఖమ్మం – వైరా మార్గంలోని ఎస్ఆర్ గార్డెన్స్ పక్కనే గల ఎన్నెస్పీ కెనాల్ డీప్ కట్ పై దాదాపు ఏడాది క్రితం పొంగులేటి కుటుంబం రూ.కోటి సొంత నిధులతో ఓ వంతెనను నిర్మించింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూతురు రిసెప్షన్ సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడకుండా నిర్మించిన ఈ వంతెనను మరో మూడు రోజుల్లో నిర్వహించనున్న తెలంగాణా జన గర్జన సభకు హాజరయ్యేవారి కోసం మళ్లీ వినియోగించుకోవాలని పొంగులేటి అనుచరులు, అభిమానులు భావించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవుతున్న ఈ సభలోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
అయితే ఈ వంతెనను తొలగించాలని పొంగులేటి ప్రసాదరెడ్డికి ఈనెల 24వ తేదీన జిల్లా నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఓ నోటీసును జారీ చేసిన సంగతి తెలిసిందే. కేవలం మూడు రోజుల వ్యవధిలో వంతెనను తొలగించడం సాధ్యం కాదని, తమకు వ్యవధి కావాలని పొంగులేటి సోదరుడు ప్రసాదరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు రిట్ పిటిషన్ పూర్వాపరాలను పరిశీలించిన హైకోర్టు వంతెన తొలగింపుపై కీలక ఆదేశాలను జారీ చేసింది. వంతెనను తొలగించేందుకు పొంగులేటి ప్రసాదరెడ్డికి మూడు వారాల వ్యవధిని ఇస్తూ, అప్పటి వరకు ఇచ్చిన నోటీసుపై ఎటువంటి చర్యలు తీసుకోరాదని నీటిపారుదల శాఖ అధికారులను హైకోర్టు ఆదేశించింది.
కాగా కోర్టు ఆదేశాల మేరకు తన క్లయింట్ వ్యవహరిస్తుండగా, వంతెన వద్దకు వెళ్లకుండా అధికారులు అడ్డుకుంటున్నారని, ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని పేర్కొంటూ ప్రసాదరెడ్డి తరపున ఆయన న్యాయవాది పి. సాత్విక్ రెడ్డి సంబంధిత అధికార వర్గాలకు గురువారం లీగల్ నోటీసు జారీ చేశారు. ఈ లీగల్ నోటీసు ప్రతులను ఇంజనీరింగ్ అధికారులకు స్వయంగా అందజేసిన న్యాయవాదులు హైకోర్టు ఉత్తర్వును అమలు చేయాలని కోరారు.