ఇప్పుడు మీరు చూస్తున్న సీన్ లోని ఈ లొకేషన్ గుర్తుందా..? ఎస్ఆర్ కన్వెన్షన్ అనే బోర్డు గల ఈ భవనపు స్థలంలోనే సరిగ్గా పదేళ్ల క్రితం ఓ పార్టీ ఆఫీసు ఉండేది. ఆ పార్టీ పేరు వైఎస్ఆర్ సీపీ.. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం వైసీపీగా వాడుకలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి పార్టీకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణా అధ్యక్షునిగా ఉండేవారు. దాదాపు పదేళ్ల క్రితం… అంటే ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ప్రకటించిన అనంతరం 2014 ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇదే ప్రదేశంలో వైఎస్ఆర్ సీపీ క్యాంపు ఆఫీసును నిర్మించారు. అప్పటి ఎన్నికల్లో ఖమ్మం నుంచి తాను ఎంపీగా విజయం సాధించడంతోపాటు వైరా, అశ్వారావుపేట, పినపాక అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా గెలిపించారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర రాజకీయాల్లో అప్పట్లో అదో రికార్డ్. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో వైఎస్ఆర్ సీపీ తెలంగాణా శాఖను టీఆర్ఎస్ లో విలీనం చేస్తూ తానూ గులాబీ కండువా కప్పుకుని కేసీఆర్ పంచన చేరిన సంగతి తెలిసిందే. అనంతరం గత ఎన్నికల సందర్భంగా సిట్టింగ్ ఎంపీగా టికెట్ దక్కని దైన్యస్థితి నుంచి చివరికి పార్టీ నుంచి సస్పెన్షన్ వరకు అనేక అనుభవాలను చవి చూసిన పొంగులేటి ఇప్పుడు తనకు కలిసొచ్చిన ప్రదేశంలోనే అత్యంత కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ సెగ్మెంట్లలోని ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని శుక్రవారం అత్యవసరంగా ఏర్పాటు చేశారు. ఉదయం ఏడున్నర గంటలకు బ్రేక్ ఫాస్ట్ తో ప్రారంభమయ్యే అభిమానుల, ముఖ్య కార్యకర్తల సమావేశంలో పొంగులేటి రాజకీయంగా అత్యంత కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నిజానికి ఎస్ఆర్ కన్వెన్షన్ కన్నా విశాలమైన ఎస్ఆర్ గార్డెన్స్ కూడా దీనికి సమీపంలోనే ఉంది. ఈ రెండు భవనాలూ పొంగులేటి వ్యాపార సామ్రాజ్యంలోని భాగాలే. కానీ సెంటిమెంట్ కోణంలో పరిశీలించినపుడు ఒకప్పటి వైఎస్ఆర్ సీపీ క్యాంపు ఆఫీసు ప్రాంతంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ లోనే పొంగులేటి ఈ ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారని ఆయన అనుచరగణం చెబుతోంది. ఇక్కడ ఆయన తీసుకునే కీలక నిర్ణయం వైఎస్ఆర్ సీపీ లో లభించిన విజయంకన్నా రెట్టింపు రాజకీయ గెలుపును సిద్ధింపజేస్తుందనే విశ్వాసాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకీ పొంగులేటి ఇక్కడ జరిగే సమావేశంలో ముఖ్య కార్యకర్తలకు ఏం చెప్పబోతున్నారు. కాంగ్రెస్ లో చేరుతున్నారా? లేక కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారా? ఇవేవీ కాకుండా సొంతంగానే పార్టీ ఏర్పాటు చేస్తారనే వార్తలను నిజం చేయబోతున్నారా? అనే ప్రశ్నలకు ఇప్పటికీ క్లారిటీ లేకపోవడమే పొంగులేటి రాజకీయ అడుగుల్లో అసలు ట్విస్ట్. దాదాపు వెయ్యి, 1100 మంది ముఖ్య కార్యకర్తల సమావేశంలో పొంగులేటి తీసుకుంటారని భావిస్తున్న కీలక నిర్ణయంపై ఆయన అభిమానులే కాదు, రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి. చూద్దాం పొంగులేటి రేపు ఏం చెబుతారో…?