ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ చేసే అసెంబ్లీ సీటు ఖరారైనట్టేనా? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా తలపడడం ఖాయమైనట్టేనా? ఇందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ అత్యంత రహస్యంగా చకచకా జరుగుతున్నాయా? అనే ప్రశ్నలకు తాజా పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైన తర్వాత శ్రీనివాసరెడ్డి ఏ పార్టీలో చేరుతారనే అంశంపై ఇప్పటికీ క్లారిటీ లేకపోయినా, తాను బరిలోకి దిగే సీటు విషయంలో మాత్రం క్లియర్ గానే ఉన్నట్లు పొంగులేటి అనుయాయులు చర్చించుకుంటున్నారు. సీఎం కేసీఆర్ ను గద్దె దించుతానని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఏ ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థినీ అసెంబ్లీ గేట్ తాకనివ్వనని పొంగులేటి పదే పదే శపథం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఇంతకీ పొంగులేటి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై ఆయన అనుచరగణంలోనేగాక, సామాన్య ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. గత నెల 21న జరిగిన ఖమ్మం ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి ఖమ్మంలోనే పోటీ చేయాలని ఆయన వెంట తిరిగే కార్యకర్తలు కోరుకుంటున్న పరిణామాల్లో శ్రీనివాసరెడ్డి ఈ సభలో చేసిన కీలక వ్యాఖ్యలు చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. మంత్రి పువ్వాడ అజయ్ పై పోటీ చేసేందుకు తన వంటి పెద్ద నాయకులు అవసరం లేదని, ఓ ‘బచ్చాగాడి’ని పెట్టి మంత్రిని ఓడిస్తానని పొంగులేటి వ్యాఖ్యానించారు. అనంతర పరిణామాల్లో మంత్రి అజయ్ పై పోటీ చేసే ‘బచ్చగాడి’ని తానేనని ఖమ్మం నగరానికి చెందిన మున్సిపల్ కార్పొరేటర్ దొడ్డా నగేష్ మీడియా ముందు ప్రకటించారు.
ఈ పరిణామాల్లోనే ఇంతకీ పొంగులేటి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై అన్ని వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో ఐదు ఎస్టీలకు, రెండు ఎస్సీలకు రిజర్వుడు సెగ్మెంట్లు కాగా, మిగిలిన ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం మాత్రమే జనరల్ స్థానాలు. ఈ మూడింట్లో ఏదో ఒక స్థానం నుంచి పొంగులేటి పోటీ చేస్తారని ఆయన అనుచరులు అంచనా వేస్తున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం పొంగులేటి పోటీ చేసే స్థానం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. కొత్తగూడెం జిల్లా కేంద్ర నియోజకవర్గం నుంచే పొంగులేటి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలున్నట్లు ఆయన అనుచరులు భావిస్తున్నారు. ఇందుకు బలం చేకూర్చే విధంగా కొత్తగూడెంలోని విద్యానగర్ లో భారీ ఎత్తున క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
స్థానిక నేత జూకంటి గోపాలరావు ఆధ్వర్యంలో పొంగులేటి క్యాంపు కార్యాలయ నిర్మాణపు పనులు పూర్తయి, ప్రస్తుతం పెయింటింగ్ వర్క్ జరుగుతోంది. ఖమ్మంలోని పొంగులేటి క్యాంపు కార్యాలయంలోని వసతులకు ఏమాత్రం తీసిపోని విధంగా కొత్తగూడెం క్యాంపు కార్యాలయంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కొత్తగూడెం నుంచే పొంగులేటి పోటీ చేస్తారని, అందుకు తగినట్లుగానే క్యాంపు కార్యాలయం రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇల్లెందు, అశ్వారావుపేట, మధిర తదితర ప్రాంతాలలో స్థానిక నేతల, పొంగులేటి పేర్లతో క్యాంపు ఆఫీసులు ఏర్పాటైనప్పటికీ, కొత్తగూడెం క్యాంపు ఆఫీసు నిర్మాణం, ఏర్పాట్లు అందుకు భిన్నంగా ఉండడంతో పొంగులేటి పోటీ స్థానం కొత్తగూడెంగా ఆయన అనుయాయులు విశ్వసిస్తున్నారు. అయితే ఈ క్యాంపు కార్యాలయ నిర్మాణపు పనులు, ఏర్పాట్లు తదితర అంశాలన్నీ ఇప్పటి వరకు అత్యంత రహస్యగా ఉంచడమే అసలు విశేషం కాగా, రాజకీయా పరిణామాల్లో అనివార్య మార్పులు చోటు చేసుకుంటే తప్ప పొంగులేటి ఖచ్చితంగా కొత్తగూడెం నుంచే పోటీ చేస్తారనే వ్యాఖ్యలు వినిపిస్తుండడం కొసమెరుపు.