అధికార వర్గాల్లోనూ పొలిటికల్ లీడర్లకు శాశ్వత శత్రుత్వ, శాశ్వత మిత్రుత్వ బంధం ఉండకపోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు ఏలూరి శ్రీనివాసరావు. సర్కారీ కొలువులో ఆయన ఓ ఎంపీడీవో. తెలంగాణా గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ కు రాష్ట్ర జనరల్ సెక్రెటరీగానే కాదు, ఖమ్మం టీఎన్జీవో యూనియన్ కు కార్యదర్శిగా, ఖమ్మం టీఎన్జీవోల హౌజింగ్ సొసైటీ అధ్యక్షునిగానూ ఏలూరి పనిచేశారు. అంతేకాదు తెలంగాణా ఉద్యమంలో పొలిటికల్ జేఏసీ జాయింట్ సెక్రెటరీగా కూడా పనిచేశారు.
ఇన్ని పదవుల్లో గల ఏలూరి శ్రీనివాసరావుపై గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం అనేక ఆరోపణలు వచ్చాయి. అప్పటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏలూరి పోటీ చేస్తారని, ఖమ్మం కాంగ్రెస్ టికెట్ ను ఆశించారని, ఆ తర్వాత మహాకూటమి తరపున పోటీచేసిన నామా నాగేశ్వర్ రావుకు మద్ధతుగా నిలిచారని ప్రచారం జరిగింది. ఈ పరిణామాల్లోనే ఆయనపై భారీ ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా టీఎన్జీవో సంఘం హౌజింగ్ సొసైటీ స్థలాల్లో అక్రమాలు జరిగాయని, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేశారని తదితర ఆరోపణలు వచ్చాయి. ఆయా ఆరోపణలకు సంబంధించి డజనుకు పైగా కేసులు ఏలూరిపై శాఖాపరంగా నమోదయ్యాయి. ఇందులో కొన్ని పోలీసు కేసులు కూడా ఉన్నాయి. అనంతర పరిణామాల్లో ఏలూరి శ్రీనివాసరావు ఖమ్మం జిల్లా నుంచి నారాయణపేట, ఆదిలాబాద్ వంటి జిల్లాలకు బదిలీ అయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను కలిసిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. సీన్ కట్ చేస్తే…
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఓ ప్రజాప్రతినిధి తనను వేధిస్తున్నారని, తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, హౌజింగ్ సొసైటీకి చెందిన 3,772 ప్రాథమిక సభ్యులను, సంఘం మేనేజింగ్ కమిటీ కుటుంబాలను ఆయా ప్రజాప్రతినిధి వేధింపుల నుంచి రక్షించాలని కోరుతూ ఏలూరి శ్రీనివాసరావు 2021 సెప్టెంబర్ 9వ తేదీన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు కూడా చేశారు. ప్రజాప్రతినిధి వేధింపుల నుంచి తమకు రక్షణ కల్పిస్తూ విచారణ జరిపి న్యాయం చేయాలని ఆయన అభ్యర్థించారు. రాష్ట్ర గవర్నర్ కు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తదితరులకు కూడా ఫిర్యాదు ప్రతులను పంపారు. మళ్లీ సీన్ కట్ చేస్తే…
ఏలూరి శ్రీనివాసరావు దాదాపు ఏడాది క్రితం మళ్లీ ఖమ్మం జిల్లాకు బదిలీపై వచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు ఎంపీడీవోగా పనిచేస్తున్న ఏలూరిని జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేయడం విశేషం. అవినీతి, అక్రమాల ఆరోపణలతో అనేక కేసులు నమోదై విచారణను ఎదుర్కుంటున్న ఏలూరి శ్రీనివాసరావుకు దళిత బంధు వంటి ప్రతిష్టాత్మక ప్రభుత్వ పథకాన్ని అమలు చేసే ఎస్సీ కార్పొరేషన్ నిర్వహణా బాధ్యతల ఉత్తర్వును అధికార పార్టీ నేతలే స్వయంగా అప్పగించడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మళ్లీ తాజా సీన్ ఏమిటంటే..?
ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాధ్యతల నుంచి ఏలూరిని ప్రభుత్వం తప్పించింది. మళ్లీ ఆయనను సొంత శాఖకు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కు రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఈ పరిణామాల్లోనే ఏలూరి శ్రీనివాసరావు రాజకీయ అరంగేట్రంపై మళ్లీ వార్తలు వస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఖమ్మం నుంచి పోటీ చేస్తారని, కాంగ్రెస్ టికెట్ ను ఆశిస్తున్నట్లు ఆయా వార్తల సారాంశం. ఈమేరకు ఏలూరి తన అధికార పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. కేసుల్లో విచారణను ఎదుర్కుంటున్న తన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించకుంటే కోర్టును ఆశ్రయించే యోచనలో ఏలూరి ఉన్నట్లు సమాచారం. అంతా అనుకున్నట్లు జరిగితే మంత్రి అజయ్ పై వచ్చే ఎన్నికల్లో ఏలూరి తలపడే అవకాశాలున్నట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.