కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటన ఎందుకు రద్దయింది? ఖమ్మం సభ ఎందుకు వాయిదా పడింది? గుజరాత్ తదితర రాష్ట్రాలను వణికిస్తున్న బిపోర్ జాయ్ తుపాను మాత్రమే అందుకు కారణమా? మరేదైనా ఇతరత్రా పొలిటికల్ తుపాను అమిత్ షా పర్యటన రద్దు వెనుక దాగి ఉందా? ఖమ్మంలో అమిత్ షా సభను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారు? తెలంగాణా బీజేపీ వర్గాల్లోనే కాదు రాష్ట్రంలోని రాజకీయ పార్టీల్లో జరుగుతున్న భిన్న చర్చలలో తలెత్తుతున్న అనేక ప్రశ్నల్లో ఇవీ కొన్ని.
వాస్తవానికి ఖమ్మంలో గురువారం సాయంత్రం నిర్వహించతలపెట్టిన అమిత్ షా సభను తెలంగాణా బీజేపీ సవాల్ గా తీసుకుందనే చెప్పాలి. ప్రస్తుత కాంగ్రెస్, గతంలో కమ్యూనిస్టుల కంచుకోటగా భావిస్తున్న ఖమ్మంలో కాషాయ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహణకు పూనుకోవడమే అసలైన పొలిటికల్ చర్చ. లక్ష మందితో ఖమ్మంలో సభ నిర్వహించి తమ సత్తా చాటుతామని బీజేపీ నాయకులు ధీమాను వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లు దాదాపుగా పూర్తి చేస్తున్న క్రమంలోనే నిన్న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అమిత్ షా పర్యటన రద్దయిందనే సమాచారం బీజేపీ శ్రేణుల్లో కలవరాన్ని కలిగించింది. అప్పటికే దాదాపు రెండు కోట్ల రూపాయలను సభ ఏర్పాట్లకు ఖర్చు చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ పరిస్థితుల్లోనే బిపోర్ జాయ్ తుపాను కారణంగానే అమిత్ షా రాష్ట్ర పర్యటన రద్దయిందనే వార్తలు వచ్చాయి. నిజానికి గుజరాత్ తీరాన్ని తాకిన తుపాను వల్లే అమిత్ షా పర్యటన రద్దయిందా? ఇదీ తాజాగా జరుగుతున్న చర్చ.
కర్నాటక ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తెలంగాణాలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల్లో అసలు బీజేపీ ఖమ్మం లాంటి చోట అమిత్ షాను రప్పించి భారీ సభకు ఎందుకు ప్లాన్ చేసినట్లు? ఈ ప్రశ్నపైనే భిన్న చర్చలు సాగుతున్నాయి. తెలంగాణా బీజేపీలో నెలకున్న వర్గపోరుకు కౌంటర్ గా ఖమ్మంలో అసందర్భంగా అమిత్ షా సభను ఏర్పాటు చేశారనే వాదన బీజేపీ వర్గాల నుంచే వినిపిస్తోంది. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పార్టీలో చేర్పించే విషయంలో ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఖమ్మం లో అమిత్ షా సభకు దారి తీసినట్లు బీజేపీ వర్గాలు చెప్పకుంటున్నాయి. ‘ఖమ్మంలో కాంగ్రెస్ బలంగా ఉంది.. అక్కడ కమ్యూనిస్టుల భావజాలం కూడా ఉంది. పొంగులేటి, జూపల్లి నాకే రివర్స్ కౌన్సెలింగ్ ఇస్తున్నారు..’ అంటూ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ వర్గీయులకు అస్సలు నచ్చ లేదంటున్నారు. ఖమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహించి, అశేష సంఖ్యలో జనాన్ని తరలించి ఈటెల వ్యాఖ్యల్లో వాస్తవం లేదని పార్టీ అధిష్టానం వద్ద నిరూపించడానికే బండి సంజయ్ వర్గం ఖమ్మంలో అసందర్భ సభకు పూనుకుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఈ పరిణామాల్లోనే 125 మందితో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుల జాబితాను బండి సంజయ్ విడుదల చేశారు. ఈనెల 13న విడుదల చేసిన ఈ జాబితాలో దాదాపు 70-80 మంది బండి సంజయ్ అనుకూల వర్గీయులుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు బీఆర్ఎస్ నాయకుల వెంట తిరుగుతున్న కొందరు గులాబీ పార్టీ నాయకులను కూడా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమించారనే బీజేపీ వర్గాల్లో జరుగుతున్న సంచలన ప్రచారంలో నిజానిజాల నిగ్గు తేలాల్సి ఉంది. ఆయా అంశాలపై బండి సంజయ్ వ్యతిరేకులు ఇప్పటికే పార్టీ పెద్దలకు ఫిర్యాదులు చేసినట్లు కూడా సమాచారం.
ఇటువంటి అనేక పరిణామాల్లోనే అమిత్ షా రాష్ట్ర పర్యటన రద్దయిందని బీజేపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అంతేగాక ఈనెల 15 సాయంత్రం నుంచి 16వ తేదీ రాత్రిలోపు రాష్ట్ర బీజేపీలో సంస్థాగతంగా సంచలనాత్మక మార్పులు ఉండవచ్చనే ప్రచారం కూడా బీజేపీ వర్గీయుల్లో జరుగుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని మార్పు ఉండబోదని ఆ పార్టీ రాష్ట్ర ఇంచార్జి తరుణ్ చుగ్ తాజాగా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ రానున్న 40 గంటల్లో బీజేపీలో సంస్థాగత మార్పు తుపాను ఉండే అవకాశాలు లేకపోలేదనే విశ్వాసంతో బండి సంజయ్ వ్యతిరేక వర్గీయులు ఉన్నాయి. అదే జరిగితే బండి సంజయ్ లేకుండా మాత్రమే ఖమ్మంలో అమిత్ షా సభ పెద్ద ఎత్తున జరిగే అవకాశాలు ఉన్నాయనే వ్యాఖ్యలు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి. మొత్తంగా అమిత్ షా రాష్ట్ర పర్యటన రద్దు, ఖమ్మం సభ వాయిదాకు బిపోర్ జాయ్ తుపాను అసలు కారణం కానేకాదని, రాష్ట్ర బీజేపీలో ఏర్పడే పొలిటికల్ తుపాను మాత్రమేనని కాషాయ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. చూడాలి ఏం జరుగుతుందో మరి..