ఫొటో గుర్తుంది కదా? సరిగ్గా ఏడాది క్రితం కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం సార్సాల గ్రామంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనితపై దాడి జరిగినప్పటి దృశ్యమిది. నిరుడు సరిగ్గా ఇదే జూన్ నెలాఖరులో నిర్వహించిన అయిదో విడత హరిత హారం కార్యక్రమంలో భాగంగా ప్లాంటేషన్ కోసం అటవీ భూములను చదును చేసేందుకు వెళ్లిన అటవీ అధికారులపై దారుణమైన రీతిలో దాడి జరిగిన సంగతి తెలిసిందే. కర్రలతో అటవీ అధికారులపై విచక్షణారహితంగా జరిగిన దాడిలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనిత తల పగిలి ఆసుపత్రి పాలయ్యారు. ఇంకా పలువురు అటవీ అధికారులు, సిబ్బంది కూడా ఈ దాడిలో గాయపడ్డారు. తమపై స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోణప్ప సోదరుడు, జెడ్పీ వైస్ చైర్మెన్ కోనేరు కృష్ణారావు తన అనుచరులతో దాడి చేశారని అటవీ అధికారులు ఘటన సందర్భంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందనే అంశాల్లోకి వెడితే తమపై రాజకీయ నేతల ఆధ్వర్యంలో జరిగిన దాడికి నిరసన వ్యక్తం చేసిన అనేక మంది అటవీ అధికారులు బదిలీల పేరుతో చెట్టుకొకరు, పుట్టకొకరు స్థానభ్రంశం చెందారు. ఏడాది క్రితం జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడీ ప్రస్తావన దేనికంటే…?
ఆరోవిడత హరితహారం నిర్వహణ సందర్భంగా తెలంగాణా సీఎం కేసీఆర్ నిన్న చేసిన వినతి, హెచ్చరికలు హత్తుకునేవిధంగా ఉన్నాయి. కలప స్మగ్లర్ల వెన్నులో వణుకు పుట్టించే విధంగా ఉన్నాయి. అడవుల పరిరక్షణకు సంబంధించి సీఎం చెబుతున్నదేమిటి?
‘‘మీకు దండం పెడుతున్నా, సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, జడ్పీ చైర్మెన్లు, మున్సిపల్ ఛైర్పర్సన్లు, మేయర్లు కీలకంగా మారి హరితహారంలో కదం తొక్కాలి. ప్రజలే కాపలాదారులుగా మారి అక్రమ కలప రవాణాకు అడ్డుకట్ట వేయాలి. కలప అక్రమ రవాణాకు ఊతం ఇచ్చే అధికారులపై చర్యలు తప్పవు. పోయిన అడవిని తిరిగి తెచ్చుకోవాలంటే మనం మేల్కోవాలి. మన ఇల్లు మనం శుభ్రం చేసుకోకుంటే పక్కింటి వారు వచ్చి చేస్తారా? అడవుల పునరుద్ధరణకు అమెరికావారో, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల వారో వచ్చి ఏమైనా సాయం చేస్తారా? ఈ పని ఫారెస్టు వాళ్లదని అనుకుంటే… మన బతుకు అడవి అవుతుంది. ఇది మన పని అని సోయి రావాలె.’’ ఇదీ సీఎం చేసిన వినతి సారాంశం.
అంతేకాదు కలప స్మగ్లర్లకు సీఎం కేసీఆర్ తీవ్ర హెచ్చరిక కూడా జారీ చేశారు. ఖబడ్డార్ అంటూ కలప స్మగ్లర్లను కఠినంగా హెచ్చరిస్తూనే, అడవుల్లో చీమ చిటుక్కుమన్నా సర్కారుకు తెలిసిపోతుందని, ఇందుకు స్పెషల్ ఇంటలిజెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేశామని కూడా కేసీఆర్ వెల్లడించారు. కానీ..,
అడవుల్లో వాస్తవంగా జరుగుతున్నదేమిటి? పచ్చని చెట్లను కబలిస్తున్నదెవరు? ‘పోడు’ భూములుగా మారుస్తున్న గిరిజనేతరులెవరు? ఎక్కువ సోదిలోకి వెళ్లకుండా క్లుప్తంగా చర్చించుకుంటే… దశాబ్దాల క్రితం అడవుల్లో నివసించే ఆదివాసీ గిరిజనులకే పరిమితమైన ‘పోడు’ వ్యవసాయం గత కొంత కాలంగా గిరిజనేతరులకు కాసులు కురిపించే ఆదాయ మార్గంగా మారింది. గిరిజనుల ప్రయోజనాల పరిరక్షణ కోసం రూపొందించిన అటవీ హక్కుల యాజమాన్య పత్రం తాలూకు పథకం కొన్ని దుష్ఫలితాలకూ దారి చూపింది. ఈ పథకానికి ముందు, తర్వాత అంతర్థానమైన అటవీ విస్తీర్ణపు గణాంక వివరాలు అధికార గణం వద్ద ఉన్నాయి. అటవీ హక్కుల యాజమాన్యపు పథకం అనంతరం ఎప్పటికైనా ప్రభుత్వం పట్టాలిస్తుందనే ధీమా పలువురిలో ఏర్పడింది. దీంతో దినసరి కూలీలను ఏర్పాటు చేసి మరీ అడవులను నరికించిన గిరిజనేతరుల చరిత్ర రికార్డెడ్ గా నిక్షిప్తమై ఉంది.
ఇటువంటి సందర్భాల్లోనే అడవులను పరిరక్షించేందుకు వెళ్లిన అటవీ అధికారులపై అనేక దాడులు జరుగుతున్నాయి. స్థానిక రాజకీయ నేతల అండదండలతో కలప స్మగ్లర్లు పేట్రేగిపోతుండగా, ‘పోడు’ పేరుతో అడవుల నరికివేత విచక్షణారహితంగా సాగుతూనే ఉంది. ఒకప్పుడు 1980 దశకంలో తమ ప్రాబల్యం కోసం తీవ్రవాద గ్రూపులు ‘పోడు’ వ్యవసాయాన్ని ప్రోత్సహించాయి. భద్రాచలం నుంచి ఆదిలాబాద్ వరకు అటవీ ప్రాంతాల్లో ‘పోడు’ భూముల చరిత్ర ఇందుకు ఓ ఉదాహరణ.
ప్రస్తుతం తీవ్రవాద ప్రాబల్యం పెద్దగా లేదు. ప్రభుత్వ వాదన ప్రకారం తెలంగాణాలో నక్సలిజమే లేదు. పోడు వ్యవసాయాన్ని ప్రోత్సహించేవారు లేరు. మరి అడవులెలా మాయమవుతున్నాయి? అడవులపై స్థానిక రాజకీయ నేతలు పట్టు బిగించారు. అడవులనూ తమ ఆదాయానికి మార్గంగా ఎంచుకున్నారు. నక్సలైట్ల ప్రభావం కూడా లేకపోవంతో ఏ జంకూ లేకుండా అడవుల, అందులోని భూముల విధ్వంసానికి పాల్పడుతున్నారు. తెలంగాణాలో హరితహారం పేరుతో ఏటా నాటే మొక్కలు వృక్షాలుగా మారడానికి ఏళ్లు పట్టవచ్చు. కానీ అడవులపై రాజకీయ పెత్తనాన్ని, జోక్యాన్ని తక్షణం నియంత్రించకపోతే, ఏజెన్సీ ప్రాంతాల్లో ఏపుగా పెరిగిన ప్రస్తుత అరణ్యం కూడా క్రమేణా కనుమరుగయ్యే ప్రమాదం లేకపోలేదు. అందువల్ల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇంలిజెన్స్ వ్యవస్థ ద్వారా అడవులను మింగుతున్న ‘రాజకీయ’ నేతలను నిలువరించాల్సిన అవశ్యకత అత్యవసరనేది నిర్వివాదం.