ఖమ్మం పార్లమెంట్ మాజీ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పార్టీ పరంగా ‘ఇంటి పొగ’ ప్రారంభమైందా? ‘పొమ్మనలేక పొగ పెడుతున్నారు..’ అనే సామెతను అన్వయించే విధంగా పార్టీ నుంచి బయటకు సాగనంపేందుకు అధికార పార్టీలో అంతర్గత కుట్రలు ప్రారంభమయ్యాయనే ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారంలో నిజానిజాల సంగతి ఎలా ఉన్నప్పటికీ, తాజా రాజకీయ పరిణామాలు, పరిస్థితులు అందుకు ఊతం కల్పిస్తున్నాయనే వాదనలు రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.

రాజకీయంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రస్థానం గురించి పెద్దగా పరిచయం కూడా అక్కర లేదు. కేవలం ఖమ్మం జిల్లాకే కాదు రాష్ట్ర స్థాయిలోనూ తనదైన రాజకీయ అడుగులతో తిరుగులేని ప్రాచుర్యం పొందిన నాయకుడు పొంగులేటి. గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పటికీ టికెట్ లభించని రాజకీయ పరిణామాలను పొంగులేటి సంయమనంతో ఎదుర్కున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని గౌరవిస్తూనే, పార్టీకి విధేయునిగా ఉన్నారు.

అయినప్పటికీ పొంగులేటిని పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు మళ్లీ ప్రారంభమైనట్లు ఆయన అనుయాయులు భావిస్తున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల ఓట్లు ఖమ్మం జిల్లాలో భారీ ఎత్తున ‘క్రాస్’ అయిన ఉదంతాన్ని కూడా పొంగులేటి మెడకు చుట్టేందుకు సొంత పార్టీకే చెందిన కొందరు నేతలు విఫలయత్నం చేసినట్లు సమాచారం.

ఇందులో భాగంగానే ‘క్రాస్ ఓటింగ్’కు పొంగులేటి ప్రాబల్యమే కారణమని సీఎం కేసీఆర్ కు కొందరు నాయకులు, ముఖ్యంగా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఫిర్యాదుల వెనుక ముఖ్య నాయకుడు ఒకరు చక్రం తిప్పినట్లు కూడా ఆయా ప్రచారపు సారాంశం. భవిష్యత్ రాజకీయాలను అంచనా వేసి, పొంగులేటిని పార్టీ నుంచి శాశ్వతంగా పంపించేందుకు వ్యూహాత్మకంగా ఫిర్యాదు చేయించారనే వ్యాఖ్యలు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి. తాజాగా శుక్రవారం సీఎం కేసీఆర్ ను కలిసిన సందర్భంగానూ పొంగులేటి టార్గెట్ గా ఫిర్యాదుల పరంపరను కొనసాగించినట్లు తెలుస్తోంది.

అయితే గత కొంత కాలంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ గా చేసుకుని పార్టీ నేతల నుంచి వచ్చి పడుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో సీఎం కేసీఆర్ కూడా స్పందించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జరిగిన క్రాస్ ఓటింగ్ లో పొంగులేటి కదలికలు, వ్యవహార శైలి, ప్రభావం, ప్రాబల్యంపై ఇంటలిజెన్స్ విభాగం ద్వారా సీఎం కేసీఆర్ నివేదికలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. అయితే క్రాస్ ఓటింగ్ వ్యవహారాల్లో పొంగులేటి ఎక్కడా ఇన్వాల్వ్ కాలేదని ఇంటలిజెన్స్ విభాగం నివేదించినట్లు తెలిసింది.

అయినప్పటికీ పొంగులేటిపై చర్య తీసుకోవలసిందేనని, అది పార్టీ నుంచి పంపించేంత స్థాయిలో చర్య ఉండాలని శుక్రవారం కొందరు నాయకులు సీఎం కేసీఆర్ కు మరోసారి ఫిర్యాదు చేశారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పొంగులేటి విషయంలో సీఎం కేసీఆర్ అనుసరించే వైఖరిపై సహజంగానే పార్టీ వర్గీయుల్లో, ముఖ్యంగా పొంగులేటి అనుచరగణంలో చర్చ జరుగుతోంది. తప్పుడు ఫిర్యాదులపై, కుట్ర పూరిత వైఖరి, వ్యవహారాలకు స్పందించి పొంగులేటిని పొమ్మనలేక ‘పొగ’ పెడితే ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎవరికి నష్టం కలగిస్తాయనే అంశంపైనా రాజకీయ చర్చ జరుగుతోంది. ఏం జరుగుతుందన్నది వేచి చూడాల్సిందే!

Comments are closed.

Exit mobile version