కల్వకుంట్ల కవిత… తెలంగాణా సీఎం కేసీఆర్ తనయ. తెలంగాణా ఉద్యమం నుంచి నిజామాబాద్ స్థానం నుంచి పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికయ్యేవరకు ఆమె రాజకీయంగా వేసిన అడుగులకు ఎదురేలేదు. కానీ గడచిన ఏడాదిన్నర కాలంగా కవిత రాజకీయ అడుగులను కాస్త దురదృష్టం వెంటాడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అన్నిరకాల బలం, బలగం ఉన్నప్పటికీ, అనూహ్యంగా ఎదురవుతున్న ప్రతిబంధక పరిణామాలపై ఆమె అభిమానులు ఒకింత అశ్చర్యానికి గురవుతున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ ఉద్దండుడు, కాంగ్రెస్ సీనియర్ నేత తాటిపర్తి జీవన్ రెడ్డిని జగిత్యాలలో ఓటమిపాలు చేయడంలో కవిత కీలకపాత్ర పోషించినట్లు వార్తలు వచ్చాయి. అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థిగా డాక్టర్ సంజయ్ కుమార్ పోటీలో ఉన్నప్పటికీ, తానే అభ్యర్థి అనే తరహాలో కవిత జీవన్ రెడ్డి ఓటమికి పావులు కదిపారనేది అప్పటి వార్తల సారాంశం. మొత్తంగా ఇక్కడ కవిత పంతం నెగ్గింది. జగిత్యాలలో జీవన్ రెడ్డి ఓటమి చెందారు. పరోక్షంగా కవిత, ప్రత్యక్షంగా డాక్టర్ సంజయ్ కుమార్ విజయం సాధించారు. అనంతర పరిణామాల్లో జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారనేది వేరే విషయం.
కానీ ఆ తర్వాతే కవితకు రాజకీయంగా ప్రతిబంధక పరిస్థితులు పరిణమించాయనే వాదన కూడా ఉంది. తన ఓటమి లక్ష్యంగా పనిచేసిన కవితను పార్లమెంట్ ఎన్నికల్లో పరాజయం బాట పట్టించేందుకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సైతం వ్యూహం పన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోకి వచ్చే జగిత్యాల జిల్లాలోని పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో జీవన్ రెడ్డి తనదైన శైలిలో పథకరచన చేశారు. నిజామాబాద్ లో సిట్టింగ్ ఎంపీగా కవిత అనూహ్య ఓటమికి గల పలు కారణాల్లో జీవన్ రెడ్డి పన్నిన రాజకీయ ప్రతివ్యూహం కూడా ఉందనే వాదన ఉంది.
అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ చేతిలో ఓటమి పాలైన కవిత రాజకీయ భవితపై భిన్నకథనాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇదే దశలో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక రావడం, అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ తన కూతురు కవితకు సీఎం కేసీఆర్ టికెట్ కేటాయించడం వంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కవిత ఓటమికి అధికార పార్టీలోని కొందరు నేతలు కూడా కారణమనే విమర్శలు వచ్చాయి. అయితే ఎమ్మెల్సీగా కవితను గెలిపించాల్సిన బాధ్యతను అదే స్థానిక నాయకులు భుజాన వేసుకోవలసిన పరిస్థితులు కూడా అనివార్యమయ్యాని కూడా ప్రచారం జరిగింది.
వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు గత ఏప్రిల్ 7వ తేదీన జరగాల్సి ఉంది. నామినేషన్ల పర్వం ముగిసి, పోలింగ్ తేదీ సమీపించిన తరుణంలో కరోనా మహమ్మారి వ్యాపించింది. ఎమ్మెల్సీ ఎన్నికలను వాయిదా వేయాలని కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘానికి వినతి పత్రం సమర్పించారు. నలభై అయిదు రోజులపాటు ఎమ్మెల్సీ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం ఎన్నిక జరిగితే ఎమ్మెల్సీగా కవిత ఆరునెలల పదవీ కాలాన్ని కూడా ఇప్పటికే పూర్తి చేసుకునేవారు. అభిమానుల కోరిక ప్రకారం ఏదేని ప్రాధాన్యత గల పదవిని సైతం ఆమె అధిష్టించేవారేమో! కానీ కరోనా తదితర కారణాల వల్ల ఆరు నెలల అనంతరం ఎట్టకేలకు ఎమ్మెల్సీ ఎన్నిక ఈనెల 9వ తేదీన జరిగింది.
భారీ ఆధిక్యతతో కవిత ఎమ్మెల్సీగా విజయం సాధించారు. వాస్తవానికి ఈరోజు మండలిలో ఆమె ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించి అధికారిక వార్తలు కూడా వెలువడ్డాయి. కానీ పరిస్థితి మరోసారి కవితకు ప్రతిబంధకమైంది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ నిన్న కరోనా వైరస్ బారిన పడ్డారు. అంతకు ఒకరోజు ముందే సంజయ్ కుమార్ కవితను కలిశారు. దీంతో ముందు జాగ్రత్తగా తాను ఐదు రోజులపాటు క్వారంటైన్ కు వెడుతున్నానని, పార్టీ శ్రేణులెవరూ తన ఆఫీసుకు రావద్దని కవిత తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. దీంతో బుధవారం జరగాల్సిన కవిత ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా వాయిదా పడింది. గడచిన ఏడాదిన్నర కాలంగా తమ నాయకురాలు కవితకు రాజకీయంగా, ఇలా అడుగడుగునా ఎదురువుతున్న ప్రతిబంధకాలపై ఆమె అభిమానులే కాదు, టీఆర్ఎస్ శ్రేణులు కూడా అంతర్మథనం చెందుతున్నాయి.