రెవెన్యూ అధికారుల, సిబ్బంది భద్రతను తెలంగాణా ప్రభుత్వం పోలీసుల చేతికి అప్పగించింది. అబ్ధుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి సజీవదహనం కేసు పోలీసులకు అదనపు విధులను కల్పించింది. రెవెన్యూ అధికారుల భద్రతను తెలంగాణా ప్రభుత్వం పోలీసులకు అప్పగించింది. దాదాపు వారం క్రితం జరిగిన విజయారెడ్డి హత్యోదంతం తెలంగాణాలోనేగాక పొరుగున గల ఆంధ్రప్రదేశ్ లోనూ కలకలం కలిగించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనానంతరం తమ భద్రతపై రెవెన్యూ అధికారులు, సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మర్వో ఉమమాహేశ్వరి ఏకంగా తన ఛాంబర్ లో తాడును అడ్డుగా కట్టుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో రెవెన్యూ అధికారుల తీరును ప్రశ్నిస్తూ పలువురు బెదిరింపులకు కూడా పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తమ భద్రతకు ప్రభుత్వం భరోసా కల్పిస్తే తప్ప విధులు నిర్వహించే పరిస్థితి లేదని తెలంగాణాలోని రెవెన్యూ అధికారులు భీష్మించారు. వారం పాటు విధులు నిర్వహించకుండా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వం నుంచి తమకు పలు అంశాలపై హామీ లభించిందని, బుధవారం నుంచి విధులకు హాజరు కానున్నట్లు రెవెన్యూ ఉద్యోగవర్గాలు ప్రకటించాయి.
ఈ నేపథ్యంలోనే రెవెన్యూ ఉద్యోగుల భద్రతపై ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. వారికి పోలీసు బందోబస్తు కల్పిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. రెవెన్యూ ఉద్యోగులకు ఎటువంటి హాని జరగకుండా తీసుకోవలసిన చర్యలపై మొత్తం ఆరు అంశాలతో కూడిన మెమోను జిల్లా పోలీస్ సూపరింటెండెంట్లు జారీ చేస్తున్నారు. గ్రీవెన్స్ డే రోజైన ప్రతి సోమవారం ఇద్దరు పోలీసులతో రక్షణ, బందోబస్తు కల్పించాలని, రోజుకు రెండుసార్లు పెట్రోలింగ్ వాహనం రెవెన్యూ కార్యాలయాల వద్ద సంచరించాలని, రెవెన్యూ ఉద్యోగుల విధులకు ఎవరైనా ఆటంకం కలిగించినా, వారిపై దాడులకు యత్నించినా వెంటనే సంబంధిత వ్యక్తులను అరెస్ట్ చేయాలని ఎస్పీలు జారీ చేసిన మెమో ఆదేశాల్లో పేర్కొన్నారు. అదేవిధంగా ప్రతి ఎమ్మార్వో ఆఫీసు వద్ద పాయింట్ బుక్కును ఏర్పాటు చేసి బ్లూ కోట్ పోలీసులతోపాటు పెట్రోలింగ్ వాహనాల్లో విధుల్లో గల పోలీసులు అందులో సంతకం చేయాలని కూడా అదేశించారు. సంబంధిత డిఎస్పీ లేదా ఏసీపీలు, సీఐలు రెవెన్యూ అధికారుల భద్రతపై క్లోజ్డ్ మానిటరింగ్ చేస్తుండాలని కూడా ఆదేశించారు. డీజీపీ అదేశాలకు అనుగుణంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీలు తమ మెమోల్లో స్పష్టం చేశారు.