బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాలకు చెందిన ఫాం హౌజ్ పై సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. ఈ ఫాం హౌజ్ లో డ్రగ్స్ పార్టీ నిర్వహించినట్లు వార్తలు వస్తున్నాయి. ఫాం హౌజ్ లో భారీ శబ్ధాలతో పార్టీ నిర్వహిస్తున్నట్లు పరిసర ప్రాంత ప్రజలు సమాచారం అందించడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. జన్వాడలోని రిజర్వు కాలనీలో గల ఈ ఫాం హౌజ్ కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాలదిగా పోలీసులు గుర్తించారు.
ఎస్వోటీ పోలీసుల దాడుల్లో విదేశీ మద్యం బాటిళ్లతోపాటు డ్రగ్స్ కూడా లభ్యమైనట్లు తెలుస్తోంది. ఫాం హౌజ్ పార్టీలో పాల్గొన్న 24 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా, విజయ్ అనే వ్యక్తికి పాజిటివ్ గా తేలింది. దీంతో అతనిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఎక్సైజ్ యాక్టు 34 కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల ఫాం హౌజ్ లో డ్రగ్స్ పార్టీ బాగోతంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. కేటీఆర్ ఇప్పుడేమంటారని, డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా బుక్కయినా బుకాయిస్తాడేమోనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని, నిందితులు ఎంత బడా బాబులైనా అరెస్టు చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు.