సాధారణంగా ఇటువంటి సన్నివేశాలు సినిమాల్లో చూస్తుంటాం. సినిమా చూస్తున్న ప్రేక్షకులను ఈ తరహా సీన్లు కట్టిపడేస్తుంటాయి. చప్పట్లు, ఈలలు కొట్టిస్తాయి. కర్తవ్యం ముందు కన్న కొడుకైనా, కట్టుకున్న భార్య అయినా, ఇతర రక్తసంబంధీకులైనా సినిమా పాత్రల్లోని నటులు వదిలిపెట్టరు. కానీ ఇటువంటి సంఘటనలు నిజ జీవితంలో జరిగితే…? ఈ రోజుల్లో అంత సిన్సియర్ పోలీసు అధికారులు ఉన్నారా…? అనే సందేహం అక్కర్లేదు. కన్నకొడుకును చట్టానికి పట్టించిన ఈ సిన్సియర్ పోలీస్ అధికారి కూడా ఇదే కోవలోకి వస్తారు. చట్టం ముందు కన్న కొడుకైనా సరే వదిలే ప్రసక్తే లేదని నిరూపించారు ఈ పోలీస్ అధికారి.
ఇంతకీ విషయమేమిటంటే… చైనాకు చెందిన కంపెనీలు రుణాల పేరుతో దారుణాలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కంపెనీలు కేవలం ఆరు నెలల వ్యవధిలోనే తెలుగు రాష్ట్రాల్లో రూ. 21 వేల కోట్ల మొత్తాన్ని కొల్లగొట్టినట్లు పోలీసులు కనుగొన్నారు. చైనా రుణ యాప్ నిర్వాహకుల వేధింపుల కారణంగా పలువురు బలవన్మరణానికి కూడా పాల్పడుతున్నారు. ఇటువంటి చైనా కంపెనీలకు చెందిన ఫైనాన్స్ వ్యవహారాలను కర్నూలుకు చెందిన నాగరాజు అనే వ్యక్తి పర్యవేక్షిస్తున్నాడు. అతని సోదరుడు ఈశ్వర్ కుమార్ కూడా ఈ తరహా చైన్ యాప్ కంపెనీలోనే పనిచేస్తున్నాడు.
ఈ నేపథ్యంలోనే చైనాకు చెందిన రుణ యాప్ ల దారుణాలపై పోలీస్ శాఖ సీరియస్ చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగానే పోలీసులు కర్నూలుకు చెందిన నాగరాజును మూడు రోజుల క్రితం అరెస్ట్ చేశారు. అయితే ఈ అరెస్ట్ వెనుక నాగారాజు కన్నతండ్రి, పోలీసు అధికారి సిన్సియర్ పాత్ర ఉండడమే అసలు విశేషం. చైనా యాప్ ల దారుణ వ్యవహారాల్లో తన కుమారుడు నాగరాజు పరోక్షంగా లక్షలాది మందిని మోసగించాడని, ఇంతటి ఘోరానికి పాల్పడింది తన కుమారుడేనని తెలసి ఆ కన్నతండ్రి అయిన పోలీస్ అధికారి ఏ మాత్రం కుంగిపోలేదు. తన కర్తవ్యాన్ని గుర్తు చేసుకుని మరీ చట్టానికి అప్పగించారు.
అసలు విషయాన్ని తన కుమారుడు నాగరాజుకు ఏమాత్రం తెలియనివ్వకుండా అతన్ని ఇంటికి పిలిపించాడు. తండ్రి కోరిక మేరకు నాగరాజు నాలుగు రోజుల క్రితం కర్నూలులోని తమ నివాసానికి చేరుకున్నాడు. వెంటనే ఆయా పోలీసు అధికారి హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు సమాచారమిచ్చి అప్రమత్తం చేశాడు. పోలీసులు కర్నూలు వచ్చేంత వరకు నాగరాజు ఇల్లు కదలకుండా ఆయా అధికారి జాగ్రత్తలు తీసుకున్నారు. ఈలోగా కర్నలుకు చేరుకున్న పోలీసులు నాగరాజును అరెస్ట్ చేశారు. కన్న బంధం కన్నా పోలీస్ బాధ్యత గొప్పదని చాటిన ఆయా పోలీసు అధికారికి హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ధన్యవాదాలు తెలిపారు. ఇంతకీఈ పోలీస్ అధికారి ఎవరో తెలుసా? కర్నూలు జిల్లాలోనే ఓ పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. అయితే తన వివరాలేవీ వెల్లడించవద్దని ఆయా అధికారి సైబర్ క్రైం పోలీసులను కోరారు. నాగరాజు అరెస్ట్ అనంతరం అతని సోదరుడు ఈశ్వర్ కుమార్ కూడా పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.