ఇచ్చిన అప్పును రాబట్టుకునేందుకు బాలికను పనిలో కుదిర్చినట్లు అందిన ఫిర్యాదుపై ఖమ్మం రూరల్ పోలీసులు నిందితునిపై కేసు నమోదు చేశారు. ఖమ్మం అమానుష ఘటనలో 13 ఏళ్ల మైనర్ బాలిక మోతె నర్సమ్మ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే.
అయితే ఇచ్చిన అప్పును వసూలు చేసుకునేందుకు గ్రామంలో పెద్దమనిషిగా చెలామణి అవుతున్న వ్యక్తి ఒకరు తమ కూతురు నర్సమ్మను తమ అభీష్టానికి వ్యతిరేకంగా పనిలో కుదిర్చాడని మైనర్ బాలిక తల్లిదండ్రులు మోతె ఉప్పలయ్య, వెంకటమ్మలు ఖమ్మం రూరల్ పోలీసులను ఆశ్రయించారు.
ఈ ఫిర్యాదుకు సంబంధించి నిందితునిపై కేసు నమోదు చేసినట్లు ఖమ్మం రూరల్ సీఐ సత్యనారాయణరెడ్డి చెప్పారు. ఆరోపణలు వచ్చిన వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ 374, జువైనల్ యాక్ట్ 79 కింద కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా మైనర్ బాలిక అమానుష ఉదంతాన్ని, ఆ తర్వాత పరిణామాలను ts29 మాత్రమే తొలుత వెలుగులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.