తోటి జర్నలిస్టుల మీద అలా రాస్తావా? ఇదేనా నీ పద్ధతి? అని విలువల వలువలూడిన వ్యక్తులు బజారుకెక్కి ఎంతగా ఆక్రోశించినా సరే… కొన్ని ఘటనలను కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్న దృశ్యంగా చూశాక నిర్మొహమాటంగా ప్రశ్నించని అనివార్య స్థితి. జర్నలిస్టు అంటే ఎలా ఉండాలి? నీతి, అవినీతి, అక్రమం, సక్రమం వ్యవహారాల ప్రస్తావన కాసేపు వదిలేయండి. అదంతా వేరే సబ్జెక్టు. కానీ ఏదేని ప్రాంతంలో మరేదైనా ఘటన జరిగిన సందర్భంలో జర్నలిస్టు విధి ఏమిటి? వాళ్లు ప్రవర్తించాల్సిన పద్ధతేమిటి? రిపోర్ట్ చేయాల్సిన తీరు ఎలా ఉండాలి? పక్కా పాత్రికేయానికి లోబడి ఉండాలి కదా?
ఘటనా స్థలానికి వెళ్లడం, ‘సీన్ ఆఫ్ అఫెన్స్’ను నిశితంగా పరిశీలించడం, అధికారిక సమాచారం సేకరించడం, చేతనైనే మరింత లోతుగా అధ్యయనం చేయడం, ఇంకా సత్తా ఉంటే పరిశోధన జరిపి వార్తా కథనంగా నివేదించడం జర్నలిస్టు డ్యూటీ. నిన్న గాక మొన్ననే అంటే ఈనెల 13న అర్థరాత్రి దాటాక, 14న తెల్లవారు జామున ఖమ్మం జిల్లా మధిర రెవెన్యూ గెస్ట్ హౌస్ లో ‘మందు-విందు’ ఘటన సంగతి తెలిసిందే. ప్రభుత్వాధికారులైన ఎమ్మర్వో, డాక్టర్, సబ్ జైలర్ తదితర అధికార గణంపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఈ సంఘటనపై సబ్ జైలర్ ప్రభాకర్ ను సస్పెండ్ చేస్తూ జైళ్ల శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వు జారీ చేశారు.
ఈ నేపథ్యంలోనే మధిర సంఘటన మరో మలుపు తిరిగింది. తహశీల్దార్ గెస్ట్ హౌజ్ లోకి దూసుకువెళ్లి, అధికారులను అడ్డుకున్నారనే అభియోగంపై మధిరకు చెందిన ఎనిమిది మంది విలేకరులపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో ప్రధాన, చిన్న తరహా మీడియా విలేకరులు ఉన్నారు. ఘటనా స్థలంలో విలేకరులు ప్రవర్తించిన తీరు ఎలా ఉందో దిగువన వీడియోలో చూడవచ్చు. ఆ తర్వాత దీన్ని జర్నలిజమే అంటారా? వీళ్ల ప్రవర్తన పాత్రికేయానికి తగిన విధంగానే ఉందా? అనే అంశాన్ని మీరే నిర్ణయించండి.