సాక్షి దినపత్రిక ఎడిటర్ వర్ధెల్లి మురళిపై విజయవాడ నగర పోలీసులు కేసు నమోదు చేశారు. హైకోర్టు అడ్వకేట్ ఒకరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీ హైకోర్టు అడ్వకేట్ గూడపాటి లక్ష్మినారాయణ సాక్షి పత్రిక ప్రచురించిన ఓ వార్తా కథనంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాక్షి పత్రికలో ప్రచురించిన వార్తా కథనం ప్రజల మధ్య ద్వేషం పెంచే విధంగా ఉందని, అందువల్ల సాక్షి పత్రికపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ లో ఈనెల 10వ తేదీన ఫిర్యాదు చేశారు. అక్టోబర్ 8వ తేదీన ‘బాబు జమానా అవినీతి ఖజానా – ముంపులోనూ మేసేశారు’ శీర్షికన సాక్షి పత్రిక ప్రచురించిన వార్తా కథనాన్ని ఫిర్యాదులో ఉటంకించారు. ఇందుకు బాధ్యులైన ఎడిటర్ మురళిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ ఫిర్యాదుపై న్యాయసలహా తీసుకున్న తర్వాత పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పత్రిక ఎడిటర్ వర్ధెల్లి మురళితోపాటు మరికొందరిపై బీఎన్ఎస్ 196 (ఎ), 353(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసును సాక్షి పత్రిక నిరసించింది. దీన్ని అక్రమ కేసుగా ఆరోపిస్తూ సాక్షి పత్రిక వార్తా కథనాన్ని ప్రచురించింది. ఈ ఘటనను జగన్ ప్రభుత్వ హయాంలో సలహాదారుగా పనిచేసిన దేవులపల్లి అమర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు తదితరులు ఖండించారు.