తెలంగాణా పోలీసులకు మళ్లీ ‘పవర్’ వచ్చిందా? లేక కష్టం మొదలైందా? ఇవి తాజా సందేహాలు. ఎందుకంటే చాలా కాలం తర్వాత రాజకీయ ప్రమేయం లేకుండా పోలీసు అధికారుల బదిలీలు, పోస్టింగులు జరిగాయనే వార్తలు ఆయా ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి. పొలిటికల్ లీడర్ల సిఫారసు లేఖలు, ఆమోదం లేకుండానే తాజాగా కొందరు పోలీసు అధికారుల బదిలీలు జరిగాయనే వార్తలు తీవ్ర చర్చకు దారి తీశాయి. అయితే ఈ బదిలీలకు మావోయిస్టు నక్సలైట్ల కదలికలే కారణమనే వార్తల సారాంశమే అసలు విశేషం.
దాదాపు పదేళ్ల క్రితం వరకు కూడా ఉమ్మడి రాష్ట్రంలో నక్సల్ కార్యకలాపాల గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. తీవ్రవాద ప్రభావాన్ని అరికట్టేందుకు, నక్సల్ కార్యకలాపాలను అణచివేసేందుకు ‘దూకుడు’గా వ్యవహరించే పోలీసు అధికారులకు అప్పట్లో కీలక పోస్టింగ్ లు లభించేవి. నక్సలైట్ల ప్రాబల్యం కారణంగా రాజకీయ నేతలు ఈ విషయంలో జోక్యం చేసుకునేవారు కాదనే అభిప్రాయాలు ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా రాజకీయ నేత సిఫారసు చేసినా ఐపీఎస్ అధికారులు వాటిని బుట్టదాఖలు చేసేవారు.
పద్ధతి ప్రకారం ఎస్ఐ బదిలీల ప్రతిపాదన సంబంధిత ఎస్పీలు చేస్తే డీఐజీలు ఆమోద ముద్ర వేసేవారు. సీఐల బదిలీలు డీఐజీ కార్యాలయం నుంచే జరగాల్సి ఉన్నప్పటికీ, ఈ విషయంలోనూ ఎస్పీల అభిప్రాయాలకు, ప్రతిపాదనలకే డీఐజీ అధికారులు విలువనిచ్చి ఆమోద ముద్ర వేసేవారు. ఎందుకంటే ఏదేని ప్రాంతంలో నక్సల్ యాక్టివిటీ పెరిగితే డీఐజీలు ఎస్పీలను ప్రశ్నించేవారు. తాము అడిగిన అధికారిని ఇవ్వలేదని, ఇప్పుడు తమను ప్రశ్నిస్తే ఫలితమేంటని కొందరు ఎస్పీలు వారితో వాదించేవారు. దీంతో ఎస్ఐ, సీఐల బదిలీల అంశంలో అప్పట్లో ఎస్పీల ‘లిస్ట్’కే డీఐజీ కార్యాలయ రాజముద్ర పడేది.
కాలం మారింది. దశాబ్ధ కాలంగా తీవ్రవాద కార్యకలాపాలు పూర్తిగా తగ్గాయని, అసలు తెలంగాణాలో నక్సలైట్ల ఉనికి కూడా లేదని పాలకులు ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసు అధికారుల బదిలీల్లో రాజకీయ జోక్యం తీవ్రమైందనే వాదనలు ఉన్నాయి. తమ సామాజికవర్గం అధికారులు మాత్రమే తమ జిల్లాల్లో, నియోజకవర్గాల్లో పనిచేయాలనే భావనకు పలువురు రాజకీయ నాయకులు వచ్చినట్లు ప్రచారం ఉంది. అందుకోసం నెలల తరబడి ఎస్ఐ, సీఐ స్థాయి పోస్టులే కాదు, సబ్ డివిజనల్ స్థాయి (డీఎస్పీ/ఏసీపీ) అధికారుల సీట్లు నెలల తరబడి ఖాళీగా ఉన్న ఘటనలు అనేకం. తమకు ఫలానా అధికారి మాత్రమే కావాలని పోలీస్ ఉన్నతాధికారులపై తీవ్ర ఒత్తడి చేసిన రాజకీయ నాయకుల గురించి వార్తలు కూడా వచ్చాయి.
కానీ మళ్లీ పరిస్థితులు తిరగబడ్డాయి. తెలంగాణాలో మావోయిస్టు నక్సల్ కార్యకలాపాలు తిరిగి వేళ్లూనుకున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో నక్సల్ కదలికలు ముమ్మరమైనట్లు తాజా ఘటనలు చెప్పకనే చెబుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాలలో జరిగిన ఎన్కౌంటర్ ఘటనతోపాటు రాష్ట్ర పోలీస్ బాస్, డీజీపీ మహేందర్ రెడ్డి రోజుల తరబడి ఆసిఫాబాద్ జిల్లాలోనే మకాం వేయడాన్ని ఇందుకు ఉదాహరణలుగా విప్లవ కార్యకలాపాల పరిశీలకులు ఉటంకిస్తున్నారు.
ఇటువంటి పరిణామాల్లో తాజాగా కీలక ప్రాంతాల్లో సీఐ స్థాయి పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అనేక మంది సీఐలను, ఎస్ఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అంతకు ముందే ములుగు, కొత్తగూడెం జిల్లాల అదనపు ఎస్పీ(ఆపరేషన్స్)ల బదిలీలు కూడా జరిగాయి. నక్సల్స్ అణచివేతలో పూర్వానుభవం మెండుగా ఉన్నటువంటి అధికారులను ఆయా కేంద్రాల్లో ఓఎస్డీలుగా నియమించడం గమనార్హం. అయితే ఈసారి అధికార పార్టీ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు లేకుండానే ఈ బదిలీలు జరిగినట్లు చెబుతున్నారు. దీంతో అనేక మంది నాయకులు కంగు తిన్నారనే వార్తలు కూడా వస్తున్నాయి.
రాజకీయ నేతల ప్రమేయం లేని పోస్టింగులు పోలీసు అధికారులకు మళ్లీ శక్తినిచ్చినట్లా? లేక కష్టాలను తీసుకువచ్చినట్లా? అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే, ఓ కోణంలో చూసినపుడు ఈ పరిణామాలు పోస్టింగుల కోసం పోలీసు అధికారులు రాజకీయ నేతల చుట్టూ పరిభ్రమణం చేయాల్సిన అవసరం లేకుండా చేశాయనే చెప్పాలి. నక్సల్స్ అణచివేతలో తమ ప్రతిభను చూపితే చాలు మంచి పోస్టింగులు లభిస్తాయనేది వాదన మళ్లీ వినిపిస్తోంది. కాకపోతే అడవుల్లో కష్టపడాలి. ఇన్ఫార్మర్ వ్యవస్థను పెంపొందించుకోవాలి. డ్యూటీ పరంగా నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఉన్నతాధికారుల నుంచి అక్షింతలు తప్పకపోవచ్చు.
మొత్తంగా చెప్పాలంటే విధినిర్వహణలో ప్రతిభ చూపే అధికారులు పోస్టింగ్ ల కోసం రాజకీయ నేతల చుట్టూ తిరగాల్సిన అవసరంలేని పరిణామాలు ఏర్పడ్డాయంటున్నారు. అందుకు మావోయిస్టుల కదలికలే కారణం కావడమే గమనించాల్సిన అంశంగా పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు రాజకీయ నేతలు చెప్పినట్లు పోలీసు అధికారులు వినడం కాదు, వాళ్ల సూచన మేరకే అధికార పార్టీ నేతలు నడుచుకోవాలి. ఫలానా కార్యక్రమానికి హాజరు కావాలా? వద్దా? అనే అంశంపై తీవ్రవాద కదలికలు గల ప్రాంతాల్లో విధులు నిర్వహించే పోలీసు అధికారుల సూచన మేరకే మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా అడుగు కదపాలి. అదీ తెలంగాణాలోని గోదావరి పరీవాహక ప్రాంతంలోని జిల్లాల్లో తాజా దృశ్యం.