ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం సహా ముగ్గురు మంత్రుల భద్రతపై పోలీసు శాఖ మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఏర్పడిందా? ఈ ముగ్గురు ప్రజా నాయకుల రక్షణకు భద్రతను మరింత పెంచాల్సిన అవశ్యకత ఏర్పడిందా? అనే ప్రశ్నలకు ఔననే విధంగా మావోయిస్టుల ప్రకటన ఉన్నట్లు ప్రభుత్వ నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ముగ్గురు మంత్రులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో, ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించే సందర్భంగా పోలీసులు అత్యంత జాగరుకతతో తమ విధులు నిర్వహించాల్సిన పరిస్థితులు నెలకొన్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మావోయిస్టు పార్టీ నేత ఆజాద్ జారీ చేసిన ఓ పత్రికా ప్రకటన మంత్రుల భద్రతపై మరింత అప్రమత్తతను గుర్తు చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు అత్యంత ప్రజాదరణ ఉన్న నేతలుగా ప్రాచుర్యం పొందారు. ఈ ముగ్గురు నేతల రాజకీయ నేపథ్యం కూడా ఇదే అంశాన్ని చెబుతోంది. ఖమ్మం జిల్లాలో గతంలో అధికార దర్పం ప్రదర్శించిన ఒకరిద్దరు నాయకులు తమ వ్యవహార శైలితో ప్రజావ్యతిరేక నాయకులుగా పేరు తెచ్చుకున్నప్పటికీ, ఈ ముగ్గురు మంత్రులు మాత్రం ప్రజాభిమాన లీడర్లుగానే ఖ్యాతి గడించారు. తమ తమ నియోజకవర్గాల్లోనే కాదు ఉమ్మడి జిల్లాలో ఏ ప్రాంతంలో పర్యటించినా, ముగ్గురూ ప్రజల్లో కలివిడిగా తిరుగుతుంటారు. ప్రొటోకాల్ భద్రత మినహా ప్రత్యేక భద్రతను ఆశించి హడావిడి చేసే నాయకులు వీళ్లు కాకపోవడం గమనార్హం. ఇటువంటి ప్రజా నాయకుల భద్రతపై భద్రాద్రి జిల్లాలో జరిగిన తాజా ఘటన మరింత అప్రమత్తతను సూచిస్తుండడం గమనార్హం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రాఘునాథపాలెం సమీపంలోని మోతె అడవుల్లో గురువారం భారీ ఎన్కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతంలో మావోయిస్టు పార్టీకి చెందిన దళనేత లచ్చన్న సహా ఆరుగురు నక్సలైట్లు మరణించారు. ఉదయం జరిగిన ఎన్కౌంటర్ ఘటనపై మావోయిస్టు పార్టీ వెంటనే సాయంత్రానికి స్పందించింది. విప్లవ ద్రోహులు అందించిన సమాచారం వల్లే ఎన్కౌంటర్ జరిగిందని ఆ పార్టీ నేత ఆజాద్ ప్రకటన విడుదల చేశారు. అయితే ఇదే దశలో ఎన్కౌంటర్ కు రాష్ట్ర ప్రభుత్వం, అధికార కాంగ్రెస్ పార్టీ పూర్తి బాధ్యత వహించాలని ఆజాద్ పేర్కొన్నారు. అంతేకాదు… జిల్లాకు చెందిన మంత్రులు ప్రధాన బాధ్యత వహించాల్సి ఉంటుందని, నెత్తుటి బాకీని త్వరలోనే తీర్చుకుంటామని మావోయిస్టు పార్టీ లీడర్ తన ప్రకటనలో ఉటంకించిన పదాలపై పోలీసులు అలర్టయ్యారు.
ఈ పరిణామాల్లోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించినట్లు సమాచారం. అంతేగాక మంత్రులను ఉటంకిస్తూ మావోయిస్టు పార్టీ చేసిన వ్యాఖ్యలను కూడా పోలీస్ వర్గాలు సీరియస్ గానే తీసుకుంటున్నాయి. మంత్రుల భద్రత విషయంలో ఏమాత్రం ఏమరుపాటు తగదని, మరింత భద్రత పెంచాల్సిన అవసరముందని నిఘా వర్గాలు సూచించినట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో మావోయిస్టు కార్యకలాపాలకు, కదలికలకు పెద్దగా అవకాశం లేకపోయినా, భద్రాద్రి జిల్లాలో మంత్రుల పర్యటనల సందర్భంగా తీసుకోవలసిన గట్టి బందోబస్తు చర్యలపై పోలీసు శాఖను నిఘా వర్గాలు అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది.