శ్రీ కోట మైసమ్మ తల్లి జాతర నేపథ్యంలో ఈ నెల 12వ తేదీ నుండి ట్రాఫిక్ మళ్ళింపు ఉంటుందని ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి తెలిపారు. ముఖ్యంగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రయాణం సజావుగా కొనసాగేందుకు ప్రతి ఒక్కరూ సహకారించాలని కోరారు.
ఖమ్మం నుంచి ఇల్లందు వెళ్లే సాధారణ ప్రజల వాహనాలు రఘునాథపాలెం, కామేపల్లి, కారేపల్లి క్రాస్ గాంధీనగర్ , సీతారాంపురం లలితాపురం మీదుగా వెళ్ళాలని సూచించారు.
అదేవిధంగా ఇల్లందు నుండి ఖమ్మం వెళ్లే వాహనదారులు లలితాపురం, గాంధీనగర్, సీతారాంపురం, కారేపల్లి క్రాస్, కామేపల్లి, రఘునాధపాలెం మీదుగా ఖమ్మం వెళ్లాలన్నారు.
కేటాయించబడిన పార్కింగ్ ప్రాంతాలలో మాత్రమే తమ వాహనాలను పార్కింగ్ చేయాలని, నిబంధనలు అతిక్రమించిన వాహనదారులకు రూ. 1000/- జరిమాన విధించడం జరుగుతుందని తెలిపారు.
శ్రీ కోట మైసమ్మ తల్లి జాతరకు వచ్చే భక్తులకు, వాహనదారులకు కూడా పోలీసుల పలు సూచనలు చేశారు. కారేపల్లి, ఇల్లందు మీదుగా శ్రీ కోట మైసమ్మ తల్లి జాతరకు వచ్చే వాహనదారులు పోలంపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన A బ్లాక్ పార్కింగ్ వద్ద లారీలు, ట్రాక్టర్లు, బస్సులు, కార్లను పార్కింగ్ చేసుకోవాలన్నారు
గాదెపాడు, గాంధీనగర్ సీతారాంపురం నుండి వచ్చే భక్తులు ఇల్లందు నుంచి లలితాపురం, ఓపెన్ కాస్ట్ రోడ్డు మీదుగా పోలంపల్లి పార్కింగ్ స్థలానికి చేరుకొని వాహనాలను పార్కింగ్ చేసుకోవాలన్నారు.
ఆటోల పార్కింగ్ కోసం B బ్లాక్ పార్కింగ్ ను కేటాయించామని, ఆటోలు B బ్లాక్ లోనే పార్కింగ్ చేయాలన్నారు.
C బ్లాక్ పార్కింగ్ స్థలం ద్విచక్ర వాహనాలకు మాత్రమే కేటాయించినట్లు చెప్పారు.
తిరుగు ప్రయాణంలో ఏ బ్లాక్, బి బ్లాక్ పార్కింగ్ వాహనాలు వెళ్లడానికి సోలార్ ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద దారి ఉంటుందన్నారు. అదేవిధంగా సోలార్ ప్లాంట్ నుండి భాగ్యనగర్ తండా వరకు రోడ్డును డివైడర్ గా ఏర్పాటు చేశామని, డివైడర్ దాటి వెళ్లిన వాహనాలపై జరిమానా విధించనున్నట్లు పోలీసులు తెలిపారు.