పుడమి కాసిన వెన్నెల పూలు
దోరపండిన
పున్నమి వెలుగుల చల్లని మబ్బులు.
పిల్ల గాలులకు
మల్లెల్లా వికసించిన లేత పైరులు.
అరిగిన పాదాల కర్రు దున్నిన
సాల్లల్లో
ఎదురెక్కిన కలుపు మొక్కల పెకిలించిన మొరటు గుంటుకలు.
కొడవళ్ళెత్తిన
పల్లెతల్లి మట్టిచేతులు ఎత్తి పారేసిన ముళ్లపొదలు.
చిందిన చిక్కటి నెత్తుటి ధారలు
పంట కంకులకు
పారిన పసులేసిన ఎరువులు.
కారిన చెమట చుక్కలు
చీడ పురుగులపై
చిమ్మిన తిరుగులేని క్రిమిసంహారాలు.
గుత్తులు గుత్తులు
ఒత్తుగా రెమ్మలేసిన కొమ్మల పూల నవ్వులు.
నడిరేయి
అమాస చీకట్లలో
పక్కున పలిగిన పండిన చేలు.
కుదుటపడిన పుడమి ఎదల దాగిన గుబులు.
గలగలలాడే గరుకు
చేతుల్లో
ఏరి ఆరబోసిన పెంచిన తల్లులు.
కూర్చిన ఆశల నిండా పంట రాశులు.
అమ్మబోయిన
అంగడిలోనే కమ్ముకున్న చీకట్లు
కళ్లు బైర్లుగమ్మి సొమ్మసిల్లిన నల్లరేగళ్లు.
అన్నంబెట్టే
నోట్లో మట్టి గొడుతున్న ఏలికలు.
నాగల్ని నమ్ముకున్నందుకు దక్కిందీ చారెడు మట్టే.
కడకు కలిసేదీ దోసెడు మట్టిలోననేమో!?
✍️ రవి ® సంగోజు