పోడు భూముల పోరాట ఘటనలో నమోదు చేసిన కేసులో ఖమ్మం జిల్లా పోలీసులు ‘యూ టర్న్’ తీసుకున్నట్లు తెలుస్తోంది. కొణిజర్ల మండలం ఎల్లన్న నగర్ గ్రామం వద్ద అటవీ అధికారులకు, స్థానిక గిరిజనులకు మధ్య జరిగిన పోడు భూముల వివాదపు కేసు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించింది. ఈ ఘటనలో అటవీ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేసిన కేసులో నమోదు చేసిన సెక్షన్లపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
ముఖ్యంగా కేసులో నిందితులుగా పేర్కొన్న 18 మంది మహిళల్లో ముగ్గురు పసి పిల్లల తల్లులు కూడా ఉన్నారు. ముగ్గురిలో ఒకరు మూడు నెలల బాలింత కూడా. కేసులో నిందితులుగా పేర్కొన్న మహిళలపై ఐపీసీ 353, 307, 148 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కొణిజర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 21 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు పంపిన సంగతి తెలిసిందే
అయితే భూమి కోసం జరుగుతున్న పోడు పోరులో బాలింతలు అనే కనీస కనికరం కూడా లేకుండా ఐపీసీ 307 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రభుత్వ పెద్దల ఆదేశాలో, ఉన్నతాధికారుల జోక్యమో, మరే ఇతర కారణాలో తెలియదుగాని పోలీసులు కేసులోని ఓ సెక్షన్ పై వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఈ కేసులో నిందితులుపై మోపిన 307 సెక్షన్ ను ఉపసంహరించుకుంటున్నట్లు కొణిజర్ల పోలీసులు శనివారం మూడవ అదనపు మేజిస్ట్రేట్ కోర్టులో మెమో దాఖలు చేసినట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాల్లో కేసులో మిగిలింది ఐపీసీ 353 సెక్షన్ మాత్రమేనని న్యాయవాద వర్గాలు చెప్పాయి. జైల్లో గల మహిళల తరపున బెయిల్ పిటిసన్ దాఖలు చేసినట్లు కూడా సమాచారం. అయితే పోలీసులు దాఖలు చేసినట్లు తెలుస్తున్న ‘మెమో’ను న్యాయమూర్తి ఆమోదించారా? లేదా? అనే సమాచారం తెలియాల్సి ఉంది.