అధికార పార్టీ నేతలకు చెందిన న్యూస్ ఛానల్ జర్నలిస్టు ఒకరు భారీ వివాదంలో చిక్కుకున్నారు. అయితే ఈ ఛానల్ లో అతను ఇంకా పనిచేస్తున్నాడా? లేదా? అనే అంశంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయా జర్నలిస్టు సదరు ఛానల్ లో పనిచేయడం లేదని, చాలా నెలల క్రితమే అతన్ని తొలగించారని, కాదు… కాదు సంస్థ ఐడీ కార్డు మాత్రమే ఉందని, వేతనం చెల్లింపు లేకుండా మాత్రమే విలేకరిగా వ్యవహరిస్తున్నారని, అతను సంస్థలో పనిచేయడం లేదనే భిన్న కథనాలతో ప్రచారం సాగుతోంది. ఇంతకీ ఈ జర్నలిస్టు ఆయా ఛానల్ లో పనిచేస్తున్నాడా? లేదా? అనే అంశాన్ని పక్కనబెడితే, పచ్చని ఆదివాసీ పల్లెల్లో ఏర్పడిన భారీ వివాదానికి అతనే కేంద్ర బిందువుగా ఆరోపణలు వస్తుండడం చర్చకు దారి తీసింది. టీఆర్ఎస్ ప్రభుత్వ ఆశయానికి గండికొట్టి హరితహారం కింద నాటిన మొక్కలను నాశనం చేసి, ఏజెన్సీలోని ఆదివాసీలకు చెందిన పోడు భూములను హస్తగతం చేసుకున్నారనేది ఆరోపణ. ఈ వివాదంలో ‘పింక్ మీడియా’కు చెందినట్లు భావిస్తున్న ఈ జర్నలిస్టు పాత్రనే ప్రధానంగా చేసుకుని ‘తుడుందెబ్బ’ నాయకులు పోరాటం చేస్తుండడం గమనార్హం. సాక్షాత్తూ ముగ్గురు మంత్రులు, ఓ రాజ్యసభ సభ్యుడు పాల్గొని నాటిన లక్ష మొక్కల కార్యక్రమానికి ఈ జర్నలిస్టు నాయకత్వంలోనే తీవ్ర విఘాతం ఏర్పడిందనేది ప్రధాన ఆరోపణ. ఇదంతా ఆయా మీడియా ప్రతినిధి వ్యాపార దురాగతంగా ఆరోపిస్తూ తుడుందెబ్బ నేతలు పోరాటం చేస్తున్నారు. గిరిజనుల పోరాటానికి బీజేపీ సైతం మద్ధతు తెలుపుతోంది. ఈ వివాదం సంగతేమిటో చూడడానికి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు నేరుగా రంగంలోకి దిగుతున్నారు. ఈనెల 9వ తేదీన వివాదానికి కేంద్రబిందువైన భూములను సందర్శించనున్నారు.

చిలికి, చిలికి గాలివానగా మారుతున్న ఈ వివాదం పూర్వాపరాల్లోకి వెడితే… టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హరితహారం పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమానికి పెద్దపీట వేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం లచ్చగూడెం గ్రామంలో పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘లచ్చగూడెం-లక్ష మొక్కలు’ పేరుతో 2017లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అప్పటి మంత్రులు జోగు రామన్న, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరావులతోపాటు ప్రస్తుత ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, అప్పటి ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తదితర ముఖ్య నేతలు ‘లచ్చగూడెం-లక్ష మొక్కలు’ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన హరితహారం మొక్కలు ఇప్పుడు అక్కడ మాయమయ్యాయని, గిరిజనుల పోడు భూముల్లో నాటిన హరిత హారం మొక్కలను మాయం చేసి ఏజెన్సీ నిబంధనలకు విరుద్ధంగా భారీ ఎత్తున ఇటుకల ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారని ఆదివాసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

దీక్షలతో పోరాటం చేస్తున్న ఆదివాసీలు

ఆదివాసీలకు చెందిన మొత్తం ఆరెకరాల భూమిలో నాటిన హరితహారం మొక్కలను ధ్వసం చేసి, రూ. 2.00 కోట్ల వ్యయంతో పెద్ద ఎత్తున ఇటుకల ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారనేది ఆరోపణ. ప్రభుత్వ నిధులతో నిర్వహించిన హరితహారం మొక్కలను ధ్వంసం చేసి ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడమేంటనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తం 10 ఎకరాల విస్తీర్ణాన్ని చదును చేసి ఇటుకల ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారంటున్నారు. ఏజెన్సీలోని భూ బదలాయింపు చట్టాన్ని, పెసా చట్టాన్ని ఉల్లంఘించి ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారని తుడుందెబ్బ నేతలు ఆరోపిస్తూ చాలా రోజులుగా పోరాటం చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీకి ఇల్లెందు పట్టణానికి చెందిన ఓ ప్రజాప్రతినిధితోపాటు, అతని బావమరిది, మీడియా ప్రతినిధి భాగస్వాములుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తీవ్ర వివాదాస్పదమైన ఫ్యాక్టరీ స్థాపించిన స్థలాన్ని పరిశీలించేందుకు ఆదిలాబాద్ ఎంపీ, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావు ఈనెల9న లచ్చగూడెం పర్యటనకు వస్తున్నారు.

ఈ భారీ వివాదంలో తాజా పరిణామం ఏమిటంటే… లచ్చగూడెం గ్రామస్తులను కూడా ఇందులోకి లాగడం. ఈ విషయంలో జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని, పోరాటం చేస్తున్నవారి ప్రయత్నాలు నెరవేరవని, బహిరంగ విచారణకు సిద్ధమంటూ ‘లచ్చగూడెం గ్రామ ప్రజలు’ పేరుతో సోషల్ మీడియా పోస్టును వదలడం గమనార్హం. మొత్తంగా లచ్చగూడెం ఇటుకల ఫ్యాక్టరీ వ్యవహారం రాష్ట్ర స్థాయిలో వివాదంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. సోయం బాపురావు పర్యటన సందర్భంగా ఆయనను అడ్డుకోవడానికి వివాదంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కుంటున్న జర్నలిస్టు పథక రచన చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇదిలా ఉండగా ఈ జర్నలిస్టు మరికొన్ని వివాదాల్లోనూ ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఖమ్మం నగరానికి చెందిన ఓ విద్యా సంస్థ నిర్వాహకునితో దాదాపు రూ. 2.00 కోట్ల మొత్తానికి సంబంధించి వివాదం ఏర్పడిందనే తదితర అంశాలపై మరో కథనంలో సవివరంగా చెప్పుకుందాం.

Comments are closed.

Exit mobile version