తనను లక్ష్యంగా చేసుకుని ఓ పత్రిక రాసిన వార్తా కథనంపై పినపాక తహశీల్దార్ విక్రమ్ కుమార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కు ఇచ్చిన వివరణాత్మక నివేదిక అధికార పార్టీ నేతల్లో ప్రకంపనలు రేపుతోంది. తనను టార్గెట్ గా చేసుకుని ఆ పత్రిక రాసిన వార్తా కథనం సంగతేమోగాని, అధికార పార్టీకి చెందిన కొందరు స్థానిక నేతల ‘దందా’లను మాత్రం తహశీల్దార్ విక్రమ్ కుమార్ పూసగుచ్చినట్లు వివరించడమే అసలు విశేషం. తనపై ఓ పత్రికలో అభూతకల్పన వార్తా కథనం రావడానికి ప్రభుత్వ భూముల కబ్జాకు పాల్పడుతున్న, ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులే కారణమని కూడా తహశీల్దార్ కలెక్టర్ కు నివేదించడం గమనార్హం.
అధికార పార్టీకి చెందిన ఓ మండల స్థాయి నాయకుడి పేరును తన నివేదికలో ప్రస్తావిస్తూ, పదేళ్లుగా ఇతను ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నట్లు తహశీల్దార్ పేర్కొన్నారు. దశాబ్ధకాలంగా ప్రభుత్వ నియమ, నిబంధనలకు విరుద్ధంగా ఇతను ఇసుక ‘దందా’కు పాల్పడుతున్నట్లు ఉటంకించారు. పినపాక మండలంలో ప్రస్తుతం ఇటువంటి అక్రమ ఇసుక రవాణా దందాను అడ్డుకున్నందుకే తనపై ఓ పత్రికలో వార్తా కథనం రాయించారని పేర్కొన్నారు. తహశీల్దార్ తన నివేదికలో స్పష్టంగా ప్రస్తావించిన ఈ వ్యక్తి అధికార పార్టీ తరపున ఓ ముఖ్య పదవిలోనూ ఉండడం విశేషం. తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్ లోకి వలస వచ్చిన ఈ నాయకుడి పేరు తహశీల్దార్ నివేదికలో ఉండడం అధికార పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.
ఫొటో: ప్రతీకాత్మక చిత్రం