రాష్ట్రంలోని వ్యవసాయ భూములకు డిజిటల్ సర్వే నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందులో భాగంగా జూన్ 11 నుంచి పైలట్ డిజిటల్ సర్వేను చేపట్టాలన్నారు. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 27 గ్రామాలను ఎంపిక చేయాలని, అందులో 3 గ్రామాలను గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎంపిక చేయాలని, మిగతా 24 గ్రామాలను రాష్ట్రంలోని ఇరవై నాలుగు జిల్లాలనుంచి ఎంపిక చేయాలని సిఎస్ సోమేశ్ కుమార్ ను సిఎం కేసీఆర్ ఆదేశించారు. డిజిటల్ సర్వే నిర్వహణ అంశాన్ని చర్చించేందుకు, ప్రగతి భవన్ లో బుధవారం సిఎం కేసీఆర్ డిజిటల్ సర్వే ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, ‘‘ రాష్ట్రంలోని పేదల భూమి హక్కుల రక్షణకోసమే ధరణి పోర్టల్ ను అమలులోకి తెచ్చినం. భూ తగాదాలు లేని భవిష్య తెలంగాణను నిర్మించే లక్ష్యంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ సర్వే చేయిస్తున్నది. రాష్ట్రంలోని వ్యవసాయ భూములను డిజిటల్ సర్వే చేసి, వాటికి ఆక్షాంశ రేఖాంశాలను ( కో ఆర్డినేట్స్) గుర్తించి తద్వారా పట్టాదారుల భూములకు శాశ్వత ప్రాతిపదికన రక్షణ చర్యలు చేపట్టాలనేదే ప్రభుత్వ ఉద్దేశ్యం. ప్రజల భూమి హక్కులను కాపాడాలనే ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా చేపట్టిన డిజిటల్ సర్వేను సమర్ధవంతంగా నిర్వహించి తెలంగాణ ప్రభుత్వ సదుద్దేశ్యాన్ని అర్థం చేసుకొని, వ్యాపారం కోణం లోంచి మాత్రమే కాకుండా సర్వేను రైతులకు సేవ చేసే ఉద్దేశ్యంతో సామాజిక సేవగా భావించి సర్వే నిర్వహించండి…’’ అని సర్వే ఏజెన్సీలకు సీఎం పిలుపునిచ్చారు. పైలట్ సర్వేలో భాగంగా ముందుగా తగాదాలు లేని గ్రామాల్లో సర్వే నిర్వహించాలని తర్వాత అటవీ భూములు ప్రభుత్వ భూములు కలిసి వున్న గ్రామాలల్లో, అంటే సమస్యలు లేని సమస్యలున్న గ్రామాల్లో మిశ్రమంగా సర్వే నిర్వహించి క్షేత్రస్థాయిలో అనుభవాన్ని గ్రహించాలన్నారు. తద్వారా పూర్తి స్తాయి సర్వేకు విధి విధానాలను ఖరారు చేసుకోవాలని సీఎం సూచించారు. ముందుగా వ్యవసాయ భూముల సర్వే చేపట్టాలని, అవి పూర్తయిన అనంతరం పట్టణ భూముల సర్వే చేపట్టే అవకాశమున్నదని సీఎం అన్నారు.
‘‘ తెలంగాణను సాధించుకుని అన్ని రంగాలను తీర్చి దిద్దుకుంటున్నం. సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి నీళ్లందిస్తున్నం. తెలంగాణ ఇవ్వాళ పంజాబ్ ను మించి ధాన్యాన్ని పండించే పరిస్థితికి చేరుకున్నది. ఈ నేపథ్యంలో భూములకు ధరలు కూడా పెరుగుతున్నవి. ప్రజల భూములకు రక్షణ కల్పించే చర్యలను ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగా మధ్య దళారీలు లేకుండా సామాన్య రైతును పీడించే వ్యవస్థలను తొలగించి పూర్తి పారదర్శకంగా వుండే విధంగా ధరణి పోర్టల్ ను ప్రభుత్వం రూపొందించింది. అన్ని అవాంతరాలను అధిగమించి ధరణి పోర్టల్ అద్భుతంగా పనిచేస్తున్నది. తమకు పీడింపులు లేకుండా రిజిష్ట్రేషన్ తదితర భూ లావాదేవీలు జరుగుతున్నాయని, ప్రజల నుంచి ప్రభుత్వం ప్రశంసలు అందు కుంటున్నది ’’ అని సీఎం తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, శాసన సభ మాజీ స్పీకర్ మదుసూధనాచారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సిఎం కార్యదర్శి భూపాల్ రెడ్డి, సిఎం కార్యదర్శి (రెవిన్యూ) వి.శేషాద్రి, ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, డిజిపి మహేందర్ రెడ్డి, ట్రాన్స్ కో జెన్ కో సిఎండీ ప్రభాకర్ రావు, సర్వే లాండ్ రికార్డ్స్ కమీషనర్ శశిధర్, టిఎస్ టిఎస్ ఎండీ పలువురు డిజిటల్ సర్వే సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.