తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ అంశానికి ఎక్కువగా ప్రచారం కల్పించరాదని, ఎన్నికల ప్రచారాస్త్రంగా అస్సలు వాడుకోరాదని పేర్కొంది. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో పీఆర్సీ ప్రకటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిని కోరింది. ఈమేరకు ప్రభుత్వ వినతికి సీఈసీ సానుకూలంగా స్పందించింది. సాగర్ ఉప ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున షరతులతో పీఆర్సీ ప్రకటనకు అనుమతి ఇస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అవినాష్ కుమార్ వెల్లడించారు. తాము ఇచ్చిన వెసులుబాటును రాజకీయ ప్రయోజనాలకు వినిగించుకోరాదన్నారు. ఇటీవలి బడ్జెట్ లో 8 వేల కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం ఆర్థికశాఖ కేటాయింపుల్లో ప్రత్యేకంగా పేర్కొంది. ఈ నేపథ్యంలో సోమవారం పీఆర్సీపై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటిస్తారని, ఇది 30 శాతం వరకు ఉండవచ్చని వార్తలు వస్తున్నాయి.