ఆధిపత్య వర్గాల నుండి శూద్ర, పీడితుల సంపూర్ణ విమోచన కోసం 19-20 శతాబ్దాల మధ్య అపూర్వ కృషి సల్పిన వారిలో మహాత్మ జ్యోతిరావు పూలే, బి.ఆర్. అంబేడ్కర్, పెరియార్ ఇ.వి. రామసామి ప్రసిద్ధులు. ఈ ముగ్గురి లక్ష్యం ఒక్కటే. ముగ్గురి ఆలోచనలో, గత చారిత్రక అవగాహనలో భావసారుప్యత ఉంది. కానీ మారుతున్న సామాజిక, ఆర్ధిక, రాజకీయ పరిస్థితులను బట్టి వారి కార్యాచరణలో వైవిధ్యముంది. తెలుగువారికి బాబాసాహెబ్ గురుంచి తెలిసినంతగా పూలే గురించి తెలియదు పూలే గురించి తెలిసినంతగా పెరియార్ గురించి తెలియదు. ఈ వెలితిని తొలిగించడానికి గత 15 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. బా.నా.స వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ జయగోపాల్ పెరియార్ జీవిత చరిత్రపై ఎన్నో పుస్తకాలు రాయడమే కాకుండా విశాఖపట్నం బీచ్ రోడ్డులో పెరియార్ విగ్రహాన్ని ఆవిష్కరణ చేశారు.

ఏ వ్యవస్థ అయినా తన పీడిత ప్రజల్ని ఎంత క్రూరంగా అవమానించి, హింసించి, అణచివేస్తుందో అంతగా ఆ వ్యవస్థ పట్ల కోపాన్ని, ద్వేషాన్ని, కసిని పెంచుకోనిదే పీడితులకు ఎన్నడూ, ఎక్కడా న్యాయం జరగలేదన్నది చారిత్రక సత్యం. అలాంటి సామాజిక స్ఫూర్తిని, ప్రేరణని కల్పించిన సమరశీల మార్గదర్శకుడు పెరియార్.

సాంస్కృతిక విప్లవం ద్వారా అపూర్వమైన రీతిలో తమిళనాట పీడిత వర్గాలను చైతన్య పరచిన నిరుపమాన సమరశీలి పెరియార్. ఆయన సామాజిక సందేశం దక్షిణాది రాష్ట్రాలైన తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ జాతీయులందరికి ఉద్దేశించినది. ఆయన మాటలు, రాతలూ అక్షరాల్లో ముద్రించగలిగితే కనీసం 50 పెద్ద సంపుటాలవుతాయి. కేవలం “అంటరానితనం – కులం” అనే అంశంపైనే ఇప్పటికి తమిళంలో 15 సంపుటాలు వెలువడ్డాయి. ‘స్త్రీ బానిస ఎందుకైంది’ అన్న చిరు పుస్తకం తెలుగులో వెలువడింది. ఫ్రెంచి భాషలోనూ వెలువడింది. దేశభక్తుల రూపములో ఉన్న మనువాదుల చాణక్య నీతిని బయటపెట్టిన పెరియార్ ఒకజాతి, ఒక వర్గం వెనుకబాటుతనానికి ఇతరుల అణచివేతతో పాటు ఆ జాతి ప్రజల్లో ఉన్న బానిసత్వ లక్షణం కూడా కారణమవుతుందన్నారు. పెరియార్ బ్రాహ్మణ అగ్రవర్ణాలపై పోరు చేస్తూనే బహుజన ప్రజల చైతన్యం కోసం సామాజిక విప్లవంతో పాటు సాంస్కృతిక విప్లవ పోరాటం చేశారు. అగ్రకుల ఆధిపత్యం ఎంత ప్రమాదకరమో, బహుజనుల బానిసత్వం కూడా అంతే ప్రమాదకరమని చాటిచెప్పిన పెరియార్ అందుకు అనుకూలంగా తన పోరాట రూపాలను ఎంచుకొని పీడిత ప్రజల విముక్తి కోసం పోరు చేసిన మాహానుబావుడు.

అందరూ గొప్పగా చెప్పుకునే గాంధీకి ఎలాంటి చరిత్ర అధ్యయనం, జ్ఞానం లేదని, సామాజిక దృక్పథం లేని ఒక పామరుడుగా వర్ణించిన పెరియార్, గాంధీ మద్దతిస్తున్న వర్ణ వ్యవస్థను ధ్వంసం చేయకుండా బహుజనులకు విముక్తి జరగదని తెలిపారు. ఆ వర్ణ వ్యవస్థకు మూలమైన హిందూ మతం పోయి కులాలు అంతమైనప్పుడే పీడిత ప్రజలు మానసిక బానిస సంకెళ్లను తెంచుకోగలరని భోధించారు. అంటరానితనాన్ని పాటించిన ప్రముఖ దేశభక్తులందిరినీ ప్రశ్నించిన ధైర్యశీలి పెరియార్. అంటరానితనం నిర్మూలనకు, దళిత బాలికలకు విద్యనందించడం, చెరువులు, నూతుల నుండి దళితులు నీరు తీసుకునే హక్కు కోసం పోరాడారు. బ్రిటిష్ కాలంలోనే ” నేటి రాజ్యం ఎందుకు నశించాలి” అని సంపాదకీయం రాసి న్యాయమూర్తి ముందు సైతం అంతే ధైర్యంగా వాదించి బహుజన ప్రజల ఆశాజ్యోతిగా నిలిచారు. దళిత హక్కుల కోసం పోరాడుతున్న అంబేడ్కర్ కు వ్యతిరేకంగా గాంధీ నిరాహార దీక్షకు పూనుకోవడాన్ని వ్యతిరేకించాడు.

విశాఖ బీచ్ రోడ్డులోని పెరియార్ విగ్రహం

తొలి మానవ హక్కుల పోరాట కేంద్రం వైక్కోమ్:
కేరళ రాష్ట్రం కొట్టాయం జిల్లాలో “వైక్కోమ్” అనే చిన్న పట్టణములో ఉన్న పురాతన శివాలయం ముందు నాలుగు వీధుల గుండా అంటరాని కులస్తులు నడవకూడదని, కనిపించకూడదని నిషేధించబడింది. ఈ నిషేధాన్ని ఎత్తి వేయాలని కేరళ రాష్ట్రంలోని సంఘ సేవకులు సత్యాగ్రహం ప్రారంభించారు. సత్యాగ్రహంలో పాల్గొన్న నాయకులందరిని అక్కడి ప్రభుత్వం చెరసాలలో వేయగా, అక్కడి మిగతా నాయకులు పెరియార్ ను ఆహ్వానించి సత్యాగ్రహం కొనసాగించాలని కోరగా, పెరియార్ కేరళకు వెళ్లి సత్యాగ్రహం కొనసాగించారు. ఆయన సత్యాగ్రహానికి దేశవ్యాప్తంగా మద్దతు రావడమే కాక విరాళాలు కూడా ఇచ్చారు. పెరియార్ పట్టుదలను చూసిన అక్కడి పాలకులు సత్యాగ్రహంలో జోక్యం చేసుకోవాలని గాంధీని కోరారు. 1925 మార్చి 9న వైక్కోమ్ చేరుకున్న గాంధీ పెరియార్ ను కలిసి సత్యాగ్రహాన్ని విడనాడాలని కోరారు. దానికి పెరియార్ ఇలా బదులిచ్చారు. “గాంధీ గారూ… సత్యాగ్రహాన్ని నిలిపి వేయమంటున్నారు సరే. వైక్కతప్పన్ వీధిలో కుక్క వెళుతుంది, పంది వెళ్తుంది, పశువులు, గాడిదలు నడుస్తాయి. ఇవన్నీ సత్యాగ్రహం చేసే వాటి హక్కుల్ని సాధించుకున్నాయా? కానీ సాటి మనుషులు మాత్రం వీధుల్లో నడవడానికి సత్యాగ్రహాలు చేస్తుంటే వాటిని విరమించుకోమని అంటున్నారే మీరు… బాగుందా?” అని ప్రశ్నించారు. గాంధీ కాసేపు మౌనం వహించి వీధుల్లో ప్రవేశం ఇస్తే గుడిలోకి ప్రవేశం కోసం పోరాటం చేస్తే ఎట్లా? అని అడిగాడు. అంతిమంగా వైక్కోమ్ వీధుల గుండా శూద్రులు నడిచే హక్కు సాధించి మానవ హక్కుల తొలి విజయాన్ని పెరియార్ సాధించారు.

దేశంలో అత్యధిక సంఖ్యాకులైన బహుజనుల పట్ల కాంగ్రెస్ విధానంపై విసుగు చెందిన పెరియార్ ఆ పార్టీ నుండి బయటకు వచ్చి ప్రారంభించిన స్వాభిమాన ఉద్యమంలో దళితులను, స్త్రీలను పాత్రధారులను చేసి వేలల్లో కులాంతర వివాహాలు జరిపించారు. స్వాభిమాన (self respect) ఉద్యమం విజయం సాధించాలంటే స్త్రీల పాత్ర అవసరమని గుర్తించిన పెరియార్ సమాజములో సగభాగమైన స్త్రీలకు అంతే స్థాయిలో అవకాశాలు ఉండాలన్నారు. స్త్రీల స్వాభిమానం – స్వేచ్ఛ గూర్చి, స్త్రీల అణచివేతకు గురికావడానికి ప్రధాన కారణమైన మత విశ్వాసాలు, దైవ భావాలు, పురుషాహంకారం పట్ల స్త్రీలను చైతన్యం చేయడంలో పెరియార్ కృషి చాలా గొప్పది. స్త్రీలు మానసిక బానిసత్వాని వీడిననాడే సమానత్వాన్ని సాధిస్తారని కుటుంబ సభ్యులతో కలిసి ఆచరణాత్మక ఉద్యమం చేసిన పెరియార్ వివరణాత్మకత చూస్తే అర్ధమవుతుంది.

మనకు. “ఎక్కడైనా పిల్లి నుండి ఎలుకకు స్వాతంత్య్రం దొరుకుతుందా? ఎక్కడైనా కోడి పిల్లలకు, గొర్రె పిల్లలకు నక్క నుండి స్వతంత్రం లభిస్తుందా? యజమాని నుండి కార్మికులకు స్వాతంత్య్రం దొరుకుతుందా? విదేశీయుల నుండి ఇండియన్లకు ఎక్కడైనా సుఖ సంపదలు దొరుకుతాయా? ఒకవేళ ఈ అద్భుతాలన్నీ వాస్తవంగా జరిగినప్పటికీ స్త్రీలకు పురుషుల నుండి ఎన్నటికీ స్వాతంత్రం దొరకాబోదు అన్న పెరియార్ ” పురుషుడు లేకుండా స్త్రీ బ్రతకలేదని ప్రతి స్త్రీ అనుకుంటోంది. అదే సమయములో స్త్రీ లేకుండా పురుషుడు జీవించగలడని ఆమె అనుకుంటోంది. తరతరాలుగా ఇలాంటి బానిస భావాలు లోతుగా పాతుకుపోయిన మత వ్యవస్థలో పెరిగిన స్త్రీలు తమ సంకెళ్లను తామే తెంచుకోవాలని పిలుపునిచ్చారు.

“పెరియార్” అని పిలవండి:
స్త్రీ సమానత్వం, చైతన్యం కోసం ఈ.వి. రామసామి చేసిన పోరాటానికి 1938 నవంబర్ 12 న మద్రాసులో 5000 మంది మహిళలు నల్ల చీరలు ధరించి రామసామిని పెద్ద ఊరేగింపులో తీసుకెళ్లి సభ పెట్టి “పెరియార్ వర్ధిల్లాలి” అని నినాదాలు చేసి, ఆరోజు నుండి ఈ.వి. రామసామిని పెరియార్ (మహాత్మ, గొప్పవారు) అని పిలవాలని తీర్మానించారు.పెరియార్ ఉద్యమ కృషి ఫలితంగా 1967లో తమిళనాడులో బహుజన రాజ్యం ఏర్పడింది. స్వాభిమాన పెళ్లి చట్టం అమలు జరిగింది. “దేవుడు లేడు – దేవుడు లేనే లేడు” అని తమిళనాడు అంతటా రాయడం, సభల ముందు ఈ నినాదాన్ని వివరించే సాంప్రదాయం పెట్టారు. దీన్ని బట్టి బహుజనుల విముక్తి కోసం పెరియార్ ఎంత బలమైన ఉద్యమం చేశారో అర్ధమవుతుంది. పెరియార్ నిరాడంబర, నిస్వార్థ సేవలను గుర్తించిన ఐక్యరాజ్యసమితి యొక్క విద్య, సైన్స్, సాంస్కృతిక ప్రచార సంస్థ (UNESCO) భారత ప్రభుత్వం ద్వారా ఒక ప్రశంసా పత్రాన్ని పెరియార్ కు బహుకరించించి.

“నూతన యుగం ప్రవక్త, ఆగ్నేయాసియా దేశాల సోక్రటీస్, సంఘ సంస్కరణోద్యమానికి తండ్రి, అజ్ఞానానికి,మూఢనమ్మకాలకి, అర్ధరహిత సాంప్రదాయాలకి, ఆధారంలేని ఆచారాలకు బద్ధ శత్రువు.” అని ప్రశంసించారంటే పెరియార్ ఉద్యమ గొప్పదనాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించడం చూడవచ్చు.

21 వ శతాబ్దంలో జీవిస్తున్న మనం నాస్తిక ఉద్యమాలు, అంబేడ్కర్, పూలే భావాల విప్లవాల స్పూర్తితో జీవిస్తూ సామాజిక చైతన్యం కోసం, సామాజికన్యాయం కోసం, సామాజిక సమత కోసం తపిస్తోన్న మనం ఒక అడుగు ముందుకేసి తెగించి లక్ష్యాన్ని సాధించాల్సిన అవసరమున్నది. స్వాతంత్య్రం వచ్చి 70 ఏండ్లు దాటినప్పటికీ మనువాద వారసులు రాజ్యాంగ యంత్రాంగాన్ని ఇంకా తమ గుప్పిట్లో ఉంచుకొని వ్యవస్థను శాసిస్తూ దుష్ట నీతులతో బహుజనులను ఏవిధంగా పీడించి పిప్పి చేస్తున్నదో ఆలోచించాలి. అవమానాలు, అక్రమాలు సహిస్తూ, భరిస్తూ బాంచలకన్న హీనంగా, దీనంగా అల్లాడిపోతున్న ఘోర దృశ్యాలను, మారణకాండను విజ్ఞులూ, విద్యావంతులూ, మేధావులూ, సామాజిక ఉద్యమకారులూ, మంచివారు ఒక్కసారంటే ఒక్కసారి కళ్లముందు చిత్రించి చూడాలన్నది నా భావన. ఈ దుష్ట వ్యవస్థను పూలే, అంబేడ్కర్, పెరియార్ లాంటి మహానుభావులు ప్రాణాలకు తెగించి ఎదిరించి పోరాడకుంటే బహుజనులు నేడు ఎలాగుండేవారో మనం ఊహించలేరు.

1879 సెప్టెంబర్ 17 న మద్రాస్ ఈరోడ్ లో జన్మించిన వెంకట రామసామికి ఈరోడ్ ఇంటి పేరుగా మారింది. ఉద్యమ క్రమంలో ఉద్యమశక్తులు పెరియార్ గా నామకరణం చేశారు. 94 సంవత్సరాలు జీవించిన పెరియార్ 1973 డిసెంబర్ 24 న సమావేశ వేదికపైన కుప్పకూలి తన తుది శ్వాస విడిచారు.

✍️ సాయిని నరేందర్
9701916091

(సెప్టెంబర్ 17, పెరియార్ 141 వ జయంతి సందర్బంగా…)

Comments are closed.

Exit mobile version