పై ఫొటోలోని బైక్ ను ఓసారి నిశితంగా పరిశీలించండి. హెడ్ లైట్ ఉండాల్సిన చోట పుర్రె గుర్తు, నంబర్ ప్లేట్ స్థానంలో డేంజర్ అనే అక్షరాలు. ముందు టైరు మడ్గర్ పై భీతావహ చిత్రం. సైలెన్సర్ తీసేసి పెద్ద శబ్ధంతో వీధుల్లో జులాయిగా తిరిగే విధానం. ఓ సాధారణ బైక్ నే స్పోర్ట్స్ బైక్ లా మార్చుకున్న తీరు. ఇటువంటి బైక్, దాన్ని నడిపే వ్యక్తి మనస్తత్వానికి గీటురాయిగా నిలుస్తుందా? ఔనంటున్నారు నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల వాసులు. ఈ భయానక చిత్రాల బైక్ కు, గుడిగండ్ల గ్రామ ప్రజలకు ఏంటి సంబంధమని అనుకుంటున్నారు కదూ? డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్యలో పోలీసులు అరెస్ట్ చేసిన నలుగురు నిందితుల్లో నవీన్ అనే యువకుడు కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఈ బైక్ నవీన్ నడిపేవాడట. దాని యజమాని కూడా అతనేననట. నవీన్ హెయిర్ స్టైల్, అతను నడిపే బైక్ రూపురేఖలు అతని మనస్తత్వానికి అద్దం పడుతున్నాయని స్థానిక ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. యువకులు నడిపే బైక్ ల రూపు రేఖలపై కూడా పోలీసులు దృష్టి సారించాల్సిన అవసరముందని ప్రజలు ఈ సందర్భంగా అభిప్రాయపడుతున్నారట. సహజత్వానికి భిన్నంగా, విపరీత పోకడలను అనుసరించే యువకుల విషయంలో వారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మమ్మీ, డాడీలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని కూడా సూచిస్తున్నారు.