వెనకటి రోజుల్లో… అంటే భూస్వామ్య వ్వవస్థ రాజ్యమేలిన కాలంలోనే కాదు… వర్తమానంలోనూ ‘బుల్లి దొర’ పదం ఇంకా అక్కడక్కడా వాడుకలోనే ఇంకా ఉంది. ఈ బుల్లి దొర పదం వెనుక కథ పాతదే. కాకపోతే ఇప్పటి తరంలో చాలా మందికి తెలియని నిగూఢార్థం ఇందులో దాగి ఉంది. వాళ్లకోసమైనా బుల్లి దొర పదం… అది వాడుకలోకి వచ్చిన విధం, కథ గురించి క్లుప్తంగానే…
గ్రామీణ ప్రాంతాల్లో భూస్వాముల, పెత్తందార్ల, దొరల రాజ్యం సాగిన కాలంలో సామాన్యులెవరైనా వారి ఇళ్లకు వెడితే… ఆసక్తికరమైన కొన్ని పదాలు అచేతనంగానే వారి చెవుల్లోకి దూరేవి. కాదు కాదు… వచ్చినవారి చెవుల్లోకి బలవంతంగా ఆయా పదాలను జొప్పించే ఓ ప్రక్రియ అన్నమాట. ‘ఒచ్చినావుర ఎల్లయ్య? బుల్లి దొర యాడున్నడుర? నిద్ర లేసినప్పటినుంచి కనిపిస్తలేడు’ అని తన కుమారుని గురించి దొరగా అభివర్ణించుకునే వ్యక్తి ఆరా తీసేవాడు. ‘అరేయ్ మల్లిగా…? బుల్లి దొర కొత్త అంగీ ఎట్లున్నదిర? మొన్ననే పట్నం నుంచి కొనుక్కొచ్చిన..’ అని పెద్ద దొర ప్రశ్నించే సన్నివేశాల గురించి కథలు కథలుగా ఇప్పటికీ గ్రామాల్లో చెబుతుంటారు.
వాస్తవానికి బుల్లి దొర ఎక్కడున్నడో పెద్ద దొరకు ఎరుకే. చిన్నారి బుల్లి దొర ఏం చేస్తున్నాడో కూడా పెద్ద దొరకు తెలియని విషయమేమీ కాదు. అయినప్పటికీ ఎల్లయ్యను, మల్లయ్యను దొరలు అనబడే పెత్తందార్లు తమ వారసుల గురించి ఎందుకని అలా ప్రశ్నించేవారు? పసిప్రాయంలో ఉన్నప్పటికీ తమ వారసులు కూడా దొరలే… అని చెప్పకనే చెప్పేవారన్నమాట. ఓ రకంగా చెప్పాలంటే బుడిబుడి నడకల చిన్నారులను సైతం దొరలుగానే భావించాలని, వ్యవహరించాలని పరోక్షంగా ప్రజలకు బోధించేవారన్నమాట. ఇంకా సూటిగా చెప్పాలంటే తరాలు మారినా, తమ వారసులను దొరలుగానే పిలవాలని మానసికంగా ప్రజలను సిద్ధం చేసేవారన్నమాట.
ఇదంతా ఎందుకంటే…? ఒక్కసారి దిగువన గల ఈ వ్యాఖ్యలను గుర్తు చేసుకోండి. కరోనా వైరస్ అంశంలో మానసికంగా మనం ఎలా సిద్ధం కావాలో తేలిగ్గానే అర్థమవుతుంది.
– కరోనా జ్వరం లాంటిదే… పారసిటామోల్ టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది.
– బ్లీచింగ్ పౌడర్ చల్లినా కారోనా కట్టడి అవుతుంది.
– విదేశీయుల నుంచే కరోనా వస్తోంది. స్థానికుల నుంచి వ్యాధి వ్యాప్తి చెందడం లేదు.
– ప్రార్థనలకు వెళ్లివచ్చినవారి వల్లే కరోనా సోకుతోంది. ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారి ద్వారానే మన ఏరియాలో కరోనా వచ్చింది.
– కరోనా ఎవరికైనా సోకవచ్చు. భవిష్యత్తులో బహుషా కరోనా రానివారు ఎవరూ ఉండరేమో?
– కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవాలి. తద్వారా ప్రజలు తమ బతుకును కొనసాగించాలి.
బస్సులు నడుస్తున్నాయ్… ఆటోలు తిరుగుతున్నాయ్… వైన్ షాపులు ఓపెన్ చేసే ఉన్నాయ్… రేపో, మాపో కొన్ని రైళ్లను కూడా ప్రారంభిస్తారనే వార్తలూ వస్తున్నాయ్. మరోవైపు కరోనా ఇంకా ఆబగా వేచి చూస్తూనే ఉంది. పెరుగుతున్న కేసులు, మరణాలు వైరస్ తీవ్రత గురించి హెచ్చరిస్తూనే ఉన్నాయ్. కరోనా సవాల్ నుంచి సమాజం పూర్తిగా తేరుకోనేలేదు. అయినప్పటికీ మనం కరోనాతో కలిసే జీవించాలి. ఢిల్లీ నుంచి గల్లీ లీడర్ వరకు వల్లిస్తున్న తాజా నినాదమిదే. తప్పదు కరోనాతో మనం కలిసి నడవాల్సిందే. సహజీవనమూ చేయాల్సిందే.. అది చావైనా, బతుకైనా… ఇందుకు మానసికంగా మీరూ సిద్ధపడినట్లే కదా?
అందుకే… బుల్లి దొర ‘కత’ను మరోసారి చెప్పుకోవలసి వచ్చింది. విషయం మీకు అర్థమైనట్లే కదా? అర్థం కాలేందంటే కరోనాతో కలిసి జీవించేందుకు మానసికంగా మిమ్మల్ని మీరు ఇంకా సిద్ధం చేసుకోలేదన్నమాట. ‘కరోనాతో సహజీవనం’ అనే ఫార్ములా ఇంకా మీ బుర్రలోకి ఎక్కలేదన్నమాటే!