ఓ ట్రిపుల్ కార్డ్ సీక్వెన్స్… మరో రెండు ట్రిప్లెట్లు… ఫోర్త్ కార్డ్ లైఫ్ కోసం వెయిటింగ్… మొత్తంగా లైఫ్ అండ్ షో. పదమూడు ముక్కల రమ్మీ పేకాటలో చాలా మంది ఆడే రిస్క్ గేమ్ ఇది. చివరాఖరులో లైఫ్ కార్డు వస్తే షో… లేదంటే ఫుల్ కౌంట్… దీన్నే రమ్మీలో ‘లైఫ్ అండ్ షో’ అంటుంటారనేది ‘జూదరాజు’ వారసులందరికీ తెలిసిందే. కాకపోతే ‘లైఫ్’కోసం కాసేపు కొన్ని రౌండ్లపాటు వేచి చూసి, ఇక లైఫ్ కార్డు రాదనే అంచనాతో కొందరు మిడిల్ డ్రాప్ చేసి గేమ్ లో బతికిపోతుంటారు.

కానీ కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా టైంపాస్ కావడం లేదని పేక ముక్కలు పట్టుకుంటే మాత్రం జూదరుల జీవితం రిస్కులో పడ్డట్లే. కనీసం మిడిల్ డ్రాపునకు కూడా ఇక్కడ అవకాశం ఉండకపోవచ్చు. ‘లైఫ్’లేని రిస్క్ చవి చూడాల్సి రావచ్చు. వాణిజ్య నగరం బెజవాడలో జరిగిన సంఘటనల వివరాలే ఇందుకు ప్రబల నిదర్శనం. రెండు వేర్వేరు ఘటనల్లో మొత్తం 39 మందికి కరోనా సోకడానికి పేకాటతోపాటు హౌసీ గేమ్ కారణమని అధికార యంత్రాంగం వెల్లడించడం గమనార్హం.

కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ఈ ఘటన పూర్వాపరాలను వివరించారు. కృష్ణలంకకు చెందిన ఓ లారీ డ్రైవర్ లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి టైంపాస్ కోసం ఇరుగు, పొరుగువారిని పిలిచి మరీ పేకాట ఆడాడు. ఫలితంగా 24 మందికి కరోనా సోకింది. అదేవిధంగా కార్మికనగర్ కు చెందిన మరో లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల 15 మంది కరోనా బారిన పడినట్లు కలెక్టర్ ఇంతియాజ్ పేర్కొన్నారు. పేకాటతోపాటు లారీ డ్రైవర్ కుటుంబ సభ్యులు హౌసీ గేమ్ ఆట కూడా మరికొందరికి కరోనా సోకడానికి దారి తీసినట్లు చెప్పారు. మొత్తం 39 మంది కరోనా బారిన పడడానికి పేకాటతోపాటు హౌసీ గేమ్ కారణమయ్యాయని ఆయన చెప్పారు.

Comments are closed.

Exit mobile version