‘‘మళ్లీ లాక్ డౌన్ విధిస్తే ప్రజలు ఉపాధి కోల్పోతారు. జీవితం, జీవనోపాధి ముఖ్యం, కరోనాతో సహజీవనం చేస్తూనే ఉపాధి, అభివృద్ధి సాధించాలి.’’ మంత్రి కేటీఆర్ ఇటీవల చేసిన కీలక వ్యాఖ్యలు గుర్తున్నాయ్ కదా? ఆ తర్వాత మరో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ గత గురువారం మాట్లాడుతూ, హైదరాబాద్ లో ‘లాక్ డౌన్’తో ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. కరోనా వస్తుంది, పోతుంది, కాబట్టి ప్రజలే జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ ను ఆపగలరని మంత్రి వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీలో మళ్లీ లాక్ డౌన్ విధిస్తారనే ప్రచారం నేపథ్యంలో ఇద్దరు మంత్రుల కీలక వ్యాఖ్యలతో విషయం తేటతెల్లమైంది. రాజధానిలో మళ్లీ లాక్ డౌన్ విధించకపోవచ్చని స్పష్టమైంది.
కానీ తెలంగాణాలోని పలు జిల్లా కేంద్రాల్లో పరిస్థితి తారుమారవుతున్నట్లు కనిపిస్తోంది. కరోనా తీవ్రరూపం దాలుస్తున్న పరిస్థితుల్లో అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలే స్వచ్ఛంద లాక్ డౌన్ కు పిలుపునిస్తుండడం గమనార్హం. వివరాల్లోకి వెడితే…
పెద్దపల్లిలో పది రోజుల స్వచ్ఛంద ‘లాక్ డౌన్’కు అక్కడి స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ పది రోజులపాటు ప్రజలందరూ స్వచ్ఛంద లాక్ డౌన్ పాటించాలని ఆయన కోరారు. ఆదివారం కౌన్సిలర్లతో నిర్వహించిన సమావేశంలో ‘లాక్ డౌన్’పై ఎమ్మెల్యే చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వారం రోజులుగా పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందని, ఆదివారం ఒకరు మృతి చెందారని పేర్కొన్నారు. వ్యాపారులు స్వచ్ఛంద లాక్ డౌన్ కచ్చితంగా పాటించాలని, నిత్యవసర వస్తువులు, కూరగాయలు మాత్రమే కొద్ది సమయం పాటు విక్రయించాలని, ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలన్నారు. కోవిడ్ బారిన పడకుండా ఉండాలంటే స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. ఈనెల 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పది రోజులపాటు ప్రజలు ‘లాక్ డౌన్’కు సహకరించాలని కూడా ఆయన కోరినట్లు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేరు మీద సోషల్ మీడియాలో పోస్టు తిరుగుతోంది.