ఖమ్మం నగరానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మున్సిపల్ కార్పొరేటర్ భర్తపై పోలీసులు పీడీ (ప్రివెంటివ్ డిటెన్షన్) యాక్టును అమలు చేస్తూ నిర్బంధించారు. మహ్మద్ ముస్తఫా (39) అనే వ్యక్తిపై పీడీ యాక్టును అమలు చేస్తూ అతని భార్య, కాంగ్రెస్ పార్టీకి చెందిన 57వ డివిజన్ మున్సిపల్ కార్పొరేటర్ రబీదా బేగానికి ఖమ్మం టూ టౌన్ పోలీసులు లిఖిత పూర్వక సమాచారం అందించారు. ఈనెల 19వ తేదీన ఈ ఘటన జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ముస్తఫా తన భార్య రబీదా బేగాన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపి 57వ డివిజన్ కార్పొరేటర్ గా గెలిపించుకున్నారు. ఆ తర్వాత కొద్దిరోజులకు డివిజన్ లో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం సందర్భంగా అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు కొందరితో ‘ప్రొటోకాల్’ వివాదం ఏర్పడింది. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో పోలీసులు ముస్తఫా తదితరుపై ఐపీసీ 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండుకు పంపారు.
అయితే ఆయా కేసులో బెయిల్ మంజూరైనట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్న నేపథ్యంలోనే ముస్తఫాపై ఖమ్మం టూటౌన్ పోలీసులు పీడీ యాక్టు అమలు చేయడం గమనార్హం. ప్రస్తుతం ముస్తఫాను ఖమ్మం జిల్లా జైలు నుంచి చంచల్ గూడ సెంట్రల్ జైలుకు తరలించారు. ముస్తఫాపై పీడీ యాక్టును అమలు చేస్తూ అతని భార్యకు పోలీసులు అందించిన ప్రతిని దిగువన చూడవచ్చు.