‘పోగొట్టుకున్నచోటే వెతుక్కోవాలి’ అనేది సామెత. కానీ దొరికిన చోటే కాపాడుకోలేక వెతుక్కునే పరిస్థితి ఏర్పడితే? తమకు లభించిందేమిటో? కాపాడుకోలేకపోయిందేమిటో? ప్రస్తుతం వెతుకుతున్నదేమిటో? తెలియని అయోమయ స్థితిని ఎదుర్కుంటే…? ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇంచుమించు ఇదే. కాంగ్రెస్ పార్టీ కంచుకోట ఉమ్మడి ఖమ్మం జిల్లా. ఇందులో ఎటువంటి సందేహం లేదు. చరిత్ర చెబుతున్న నిజం కూడా ఇదే. రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఓటర్లు ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు కూడా. ఒకటి కాదు, రెండూ కాదు ఏకంగా ఎనిమిది సీట్లలో ‘మహాకూటమి’ తరపున కాంగ్రెస్ కు ప్రజలు పట్టం గట్టారు. అందులో ఆరు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. వైరా స్థానంలో అప్పటి కాంగ్రెస్ నాయకుడినే ‘ఇండిపెండెంట్’గా గెలిపించారు. ఖమ్మం ఫలితాలను చూసి టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సైతం నివ్వెరపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభంజనపు ఫలితాలతో రెండోసారి అధికారంలోకి వచ్చిన తమ పార్టీకి ఖమ్మం జిల్లాలో దక్కిన ఒకే ఒక్క సీటు ఫలితాన్ని చూసి గులాబీ బాస్ కంగుతిన్నారు. ఉమ్మడి ఖమ్మం ఫలితాలే మరో రెండు జిల్లాల్లో వచ్చి ఉంటే…? తమ సారు సీఎం సీటు ఏమయ్యేదనే భావన గులాబీ పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో తీవ్ర గుబులు పుట్టించింది.
ఇంతటి ఘన విజయాన్ని సాధించిన కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను ఆ తర్వాత ఎందుకు నిలుపుకోలేకపోయింది? పాలేరు, ఇల్లెందు, కొత్తగూడెం, పినపాక స్థానాల్లో గెల్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటు వేసిన ప్రజల చేతిపై సిరా గుర్తు ఆరకముందే గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి సంసిద్ధమైన పరిస్థితులను, పరిణామాలను నాయకత్వం ఎందుకు నిలువరించలేకపోయింది? ఇవీ అసలు ప్రశ్నలు. కారణాలు ఏవైనా కావచ్చు. ప్రజలు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ కాపాడుకోలేకపోయిందనే భావన రాజకీయ పరిశీలకుల్లోనేకాదు, కాంగ్రెస్ కేడర్ లోనూ బలంగా నెలకొంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు అక్కడ సంతోషంగా ఉన్నారా? లేదా? అనే విషయాలు అప్రస్తుతం. కానీ గడచిన రెండేళ్లలో పార్టీ నేతలు కాంగ్రెస్ కార్యకర్తల్లో కనీస ధైర్యాన్ని నింపగలిగారా? అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం వారికి ఏర్పడిన కష్ట, నష్టాల్లో తామున్నామంటూ భరోసా కల్పించగలిగారా? పార్టీని ప్రాణప్రదంగా ప్రేమించే కార్యకర్తను కాపాడుకుంటామనే ధైర్యాన్ని ఇవ్వగలిగారా? రెండేళ్ల క్రితంనాటి మనోధైర్యం కాంగ్రెస్ పార్టీ కేడర్ లో ఇప్పుడు ఉందా? అందుకు దారి తీసిన పరిస్థితులేమిటి? ఇవీ సందేహాలు. ఇప్పుడీ ప్రశ్నలన్నీ దేనికంటే…?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు, ఖమ్మం, వరంగల్ నగరపాలక సంస్థల ఎన్నికలు తరుముకొస్తున్నాయి కదా? కాంగ్రెస్ కార్యకర్తల్లో ‘జోష్’ నింపడంతోపాటు వచ్చే ఆయా ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు పీసీసీ సమావేశాన్ని ఆదివారం నిర్వహిస్తున్నారు. ఇందుకు ‘గ్రేటర్ వరంగల్’ కాకుండా ఖమ్మం నగరాన్నే వేదికగా ఎంచుకోవడం గమనార్హం. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ ఇప్పటికే ఖమ్మం నగరానికి చేరుకున్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీలు రేణుకాచౌదరి, పొన్నం ప్రభాకర్, వి. హనుమంతరావు వంటి అగ్రనేతలు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను, ఎత్తుగడలను ఖమ్మంలో నిర్వహిస్తున్న పీసీసీ సమావేశంలో ఖరారు చేస్తారట. పార్టీని విజయ తీరానికి నడిపించేందుకు కేడర్ కు దిశా, నిర్దేశం చేస్తారట. మొత్తంగా అటు నాగార్జునసాగర్ ఉప ఎన్నిక సహా త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ, కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించే విధానాల రూపకల్పనకు ఖమ్మం నగరాన్ని కాంగ్రెస్ పార్టీ వేదికగా ఎంచుకోవడం విశేషం.
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నిన్న మీడియాతో మాట్లాడుతూ, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. భూముల క్రమబద్ధీకరణ, సొంత కాంట్రాక్టు సంస్థ పనులు, అవినీతి, అరాచకం అంటూ ఆరోపణలు గుప్పించారు. గమనించాల్సిన అంశమేమిటంటే కొద్ది రోజుల క్రితం బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ఆరోపణలనే భట్టి కూడా చేయడం. వాస్తవానికి భట్టి విక్రమార్క మధిర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానిక ఎమ్మెల్యేనే. కానీ బీజేపీ బండి సంజయ్ మంత్రిపై ఆలపించిన ఆరోపణలకే భట్టి సైతం శ్రుతి కలపడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. పీసీసీ సమావేశం నిర్వహణకు ఓరోజు ముందుగా ఆయన మంత్రి అజయ్ పై ఆరోపణలు గుప్పించడం గమనార్హం. రాజకీయ విమర్శలు, ఆరోపణల అంశాలను కాసేపు పక్కనబెడితే, మంత్రిని టార్గెట్ చేయడమే ఎజెండాగా కాంగ్రెస్ కు ఓట్లు రాలుతాయా? అనేది ఆ పార్టీ కేడర్ లో నెలకొన్న అసలు సందేహం. ఎందుకంటే గట్టి ఓటుబ్యాంకు గల ఖమ్మం కాంగ్రెస్ పార్టీలో కేడర్ కు దక్కుతున్న భరోసాపై భిన్నాభిప్రాయాలున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేల జంపింగ్ పరిణామాలు అనేక సందేహాలకు దోహదం చేస్తున్నాయి. అందుకే అసలు ఖమ్మంలో కాంగ్రెస్ నాయకత్వం కోల్పోయిందేమిటి? ప్రస్తుతం వెతుకున్నదేమిటి? అనే సంశయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దిశగా సరైన మథనం జరిగితే తప్ప వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఆశించిన ఫలితం లభించకపోవచ్చు. అదీ అసలు సంగతి.