ఎన్ ఎస్ యూ ఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ను గాయపర్చిన ఘటనపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడించారు. అంతేగాక రాష్ట్ర డీజీపీకి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. పెగాసస్ స్పై వేర్ తో మోడీ ప్రభుత్వం నిఘా పెట్టడాన్ని నిరసిస్తూ ఈనెల 22న కాంగ్రెస్ పార్టీ ఛలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. రాజభవన్ ముట్టడి సందర్భంగా పోలీసుల లాఠీ ఛార్జిలో తీవ్రంగా గాయపడిన ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ను రేవంత్ రెడ్డి శనివారం పరామర్శించారు.
వెంకట్ ఆరోగ్య పరిస్థితి గురించి, డాక్టర్లు అందించిన వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, బల్మూరి వెంకట్ ను పోలీసులు టార్గెట్ చేసి మరీ పక్కటెముకలు విరిగేలా కొట్టారని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టే పలు కార్యక్రమాల్లో వెంకట్ చురుగ్గా పాల్గొంటున్నారని, అందువల్లే పోలీసులు ఆయనను లక్ష్యంగా చేసుకుని గాయపర్చారని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని, ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.