పాట గుర్తుంది కదా.. ‘స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్’ అని పాడుతుంది ఆకలిరాజ్యం సినిమాలో కమల్ హాసన్ పాత్ర. బహుషా బాగా బలిసినవాళ్ల ఇంట్లో జరిగే విషాద ఘటనలు సైతం పెళ్లి వేడుకలను తలపిస్తాయన్నది పాట రాసిన కవి భావన కాబోలు.
కానీ ఇక్కడ మాత్రం ఓ ఉరి ఘటన మరో ఇంట్లో పెళ్లి బాజాలను మోగించడానికి ఉపకరిస్తుండడమే అసలు విషాదం. పవన్ జల్లాద్ గుర్తున్నాడు కదా? నిర్భయ దోషులను ఉరితీసేందుకు తీహార్ జైల్లో తలారి లేడనే జైలు అధికారుల టెన్షన్ కు ఫుల్ స్టాప్ పెడుతూ, నేనున్నాను అంటూ ముందుకొచ్చిన తలారి పవన్. నిర్భయ దోషులను ఉరి తీసే బాధ్యతను జైలు అధికారులు పవన్ జల్లాద్ కు అప్పగించారు. ఈ ఉరి తీసే తలారి పని చేసినందుకుగాను పవన్ కు లక్ష రూపాయల మొత్తం ముడుతుందట. ఈ లక్ష రూపాయలను పవన్ ఏం చేస్తారనేగా మీ ప్రశ్న? తన కూతురు పెళ్లి చేయడానికి పవన్ నిర్ణయించుకున్నారు. తన కూతురు పెళ్లీడుకొచ్చిందని, సంబంధాలు చూస్తున్నానని, డబ్బు ఎలా సమకూరుతుందని మధనపడుతున్న సమయంలో తన వృత్తే తనకు దారి చూపింది అంటున్నాడు పవన్.
పవన్ ఉండేది మీరట్ లోని చిన్న ఇంట్లో. భార్య, ఏడుగురు పిల్లలు అతని కుటుంబం. ప్రస్తుతం పవన్ నివసిస్తున్న ఇల్లు కూడా కన్షీరామ్ ఆవాస్ యోజన కింద ప్రభుత్వం మంజూరు చేసిందే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో నిర్భయ దోషుల ఉరి వల్ల లభించే లక్ష రూపాయలే పవన్ కూతురు పెళ్లికి ఉపకరిస్తుండం కలచివేసే అంశం.