ఏదేని వైద్య చికిత్స కోసం వెళ్లినపుడు ప్రయివేట్ ఆసుపత్రుల నిర్వాహకులు ఏవేవో కాగితాలపై సంతకాలు తీసుకుంటారు తెలుసు కదా? పేషెంట్ పరిస్థితి క్లిష్టంగా ఉన్నపుడు, శస్త్ర చికిత్స చేస్తే, ఒకవేళ ప్రాణాపాయం కలిగితే తమకు ‘రిస్క్’ లేకుండా ప్రయివేట్ ఆసుపత్రుల వాళ్లు పేషెంట్ సంబంధీకుల నుంచి కొన్ని కాగితాలపై సంతకాలు తీసుకుంటారు. ఒకవేళ చికిత్సలో ఏదేని జరగరానిది జరిగితే చట్టపరంగా ఇరుక్కోకుండా ఉండేందుకు ‘ముందస్తు’ చర్యల్లో భాగంగా ఆసుపత్రుల నిర్వాహకులు పలు పత్రాలపై ఇటువంటి సంతకాలు తీసుకుంటారు. తమ వారిని దక్కించుకోవాలనే తపనలో గల పేషెంట్ సంబంధీకులు ఆయా పత్రాల్లో ఏముందో చూడకుండానే సంతకాలు చేసేస్తుంటారు. ఇప్పుడీ విషయ ప్రస్తావన ఎందుకంటే…
ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఓ అంగీకార పత్రాన్ని జాగ్రత్తగా చదవండి. ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఈనెల 21వ తేదీ నుంచి ప్రభుత్వ బడులను తెరవాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈమేరకు ఆన్ లైన్ క్లాసులు కూడా జరుగుతున్నాయి. అయితే 9, 10వ తరగతి విద్యార్థులకు మాత్రం స్కూళ్లలో ‘అవగాహన’ తరగతులు సైతం నిర్వహిస్తున్నారు. ఆన్ లైన్ క్లాసుల్లో ఏవేని సందేహాలు కలిగిన విద్యార్థులు వాటిని నివృత్తి చేసుకోవడానికి సర్కార్ బడులకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ గల టీచర్లు విద్యార్థుల సందేహాలను తీర్చడానికి సిద్ధంగా ఉంటారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు కరోనా సోకితే తమకు బాధ్యత లేదనే భావనతో కాబోలు ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో తల్లిదండ్రుల నుంచి అంగీకార పత్రాన్ని తీసుకుంటున్నారు. స్వచ్ఛందంగానే తమ పిల్లలను పాఠశాలకు పంపిస్తున్నామని, కోవిడ్-19 నిబంధనల మేరకు తగిన జాగ్రత్తలతో, ప్రభుత్వ సూచనల ప్రకారం పంపగలమని అంగీకరిస్తూ ఓ పత్రంపై తల్లిదండ్రులు సంతకం చేయాలన్నమాట. ప్రభుత్వ బడుల్లో చదువులు కాావాలంటే ఈ అంగీకార పత్రం విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తప్సనిసరి అట.
ఇదంతా ఎందుకంటే కరోనా మహమ్మారి కోరలు చాచి కరాళ నృత్యం చేస్తున్న పరిస్థితుల్లో, స్కూళ్లకు వచ్చిన విద్యార్థుల్లో ఎవరికైనా కరోనా సోకితే, అవాంఛనీయ ఘటన జరిగితే, అక్కడి టీచర్లకుగాని, ప్రభుత్వానికిగాని ఏమాత్రం సంబంధం లేదన్నమాట. పరోక్షంగా ఈ అంగీకార పత్రం చెబుతున్న సారాంశం ఇదేనంటున్నారు పలువురు తల్లిదండ్రులు. అటు టీచర్లు, ఇటు ప్రభుత్వం ఈ విషయంలో బద్నాం కాకుండా, పిల్లల బాధ్యత తమ భుజాన వేసుకోకుండా ఉండడానికే అంగీకార పత్రాలను విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తప్సనిసరి చేసినట్లు సమాచారం. ఇప్పుడు చెప్పండి… ఆసుపత్రుల్లో తీసుకునే సంతకాలకు, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీసుకుంటున్న అంగీకార పత్రానికి ఏదో సారూప్యత ఉన్నట్లు గోచరించడం లేదూ!