సంత వేలం పాటలో ఇదో సంచలనం. బహుషా తెలంగాణా రాష్ట్రంలోనే ఇది రికార్డు కాబోలు. ఏడాది కాల పరిమితికి ఓ సంతను రూ. 2.16 కోట్లకు పాటదారు దక్కించుకోవడం విశేషం. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురంలోని శ్రీకృష్ణప్రసాద్ పశువుల సంత రికార్డు స్థాయి ధర పలికింది.
పండితాపురంలో సోమవారం నిర్వహించిన పశువుల సంతలో తైబజారు పన్ను వసూలు చేసుకునే హక్కు కోసం ప్రభుత్వ మద్దతు ధరను కోటి 93 లక్షల 25 వేల 900 రూపాయలుగా నిర్ణయించి వేలం పాటను ప్రారంభించారు. గడచిన మూడేళ్ల వేలం పాటలకు దక్కిన మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వ మద్ధతు ధరను నిర్ణయిస్తారు.
పశువుల సంతను దక్కించుకునేందుకు భూక్యా వీరన్న, ధరావత్ నాగేశ్వర్ రావు అనే కాంట్రాక్టర్లు తీవ్రంగా పోటీ పడ్డారు చివరికి 2 కోట్ల 16 లక్షల ఆరు వేల రూపాయల మొత్తానికి వీరన్న సంతలో తైబజారు పన్ను వసూళ్ల హక్కును దక్కించుకున్నారు. పోటీదారులు ఇరువురి మధ్య రూ. 10 వేల మొత్తం తేడాతోనే వీరన్న సంతను వేలంలో దక్కించుకోవడం విశేషం.
సంతను దక్కించుకున్న వీరన్న వేలంపాట మొత్తంలో మూడో వంతు నగదును తక్షణం చెల్లించి ఒప్పందం చేసుకున్నారు. హైదరాబాద్ వంటి ముఖ్య నగరాల నుంచి పశువులను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పండితాపురం సంతకు వస్తుంటారు.ఈ సంత వేలంపాటలో పండితాపురం గ్రామ పంచాయతీ పరిధిలో నివాసముండే గిరిజనులు మాత్రమే పాల్గొనాలనే నిబంధన ఉండడం కొసమెరుపు.
ఫొటో: సంతకు వేలం పాట నిర్వహిస్తున్న పంచాయతీ అధికారులు