హెడ్డింగ్ వింతగా ఉంది కదూ! ఆ హెడ్డింగ్ తాలూకు అసలు సంగతేమిటో తెలుసుకునే ముందు ఫొటోను ఓసారి నిశితంగా చూడండి. ప్రమాదంలో కుడిచేతిని కోల్పోయిన ఓ వ్యక్తి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగాడు. అయితే అతను పర్మినెంట్ ఉద్యోగం కోసం ఉద్ధేశపూర్వకంగానే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లు భావిస్తోందట పాల్వంచలోని నవ భారత్ వెంచర్స్ లిమిటెట్ సంస్థ.
విషయం ఏమిటంటే… నవభారత్ వెంచర్స్ ఫ్యాక్టరీలో ఉపేందర్ అనే కార్మికుడు మూడు నెలల క్రితం ప్రమాదం బారిన పడ్డాడు. ఈ ఘటనలో అతను తన కుడి చేయిని కోల్పోయాడు. తనకు న్యాయం చేయాలని బాధితుడైన ఉపేందర్ సహా, అతని కుటుంబీకులు టెంట్ వేసుకుని రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఆ ఆందోళన కార్యక్రమంపై నవభారత్ వెంచర్స్ యాజమాన్యం స్పందించింది. ఈ సందర్భంగా సంస్థ వైస్ ప్రెసిడెంట్ వై. శ్రీనివాసమూర్తి పేరున విడుదల చేసిన పత్రికా ప్రకటన సర్వత్రా చర్చకు దారి తీసింది.
ఇంతకీ సంస్థ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసమూర్తి ఏమంటారంటే… నవభారత్ కంపెనీలో ఆరేళ్లుగా ఎటువంటి ప్రమాదాలు జరగలేదని, ఉపేందర్ అనే కార్మికుడు ఎవరి ఉత్తర్వులు లేకుండా, అనుమతి లేకుండా తనంతట తానుగా రన్నింగ్ లో గల కన్వేయర్ వద్దకు వెళ్లి అనవసరమైన పని చేస్తూ ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాడట. అయినాసరే… ప్రమాదం జరగడం, ఉపేందర్ చేయి కోల్పోవడంతో యాజమాన్యం మానవతా ధృక్పథంతో ఆలోచించిందట. భవిష్యత్తులో ఉపేందర్ పూర్తి స్థాయిలో పనిచేయలేడని తెలిసినా కూడా అదే కాంట్రాక్టర్ వద్దగాని, వేరే కాంట్రాక్టర్ వద్ద గాని పని చేసుకోవడానికి అనుమతిస్తామని చెప్పిందట.
అంతే కాదండోయ్…! ఇన్సూరెన్స్ ద్వారా దాదాపు రూ. 9-10 లక్షలు, ఎక్స్ గ్రేషియాగా రూ.2 రెండు లక్షలు ఇవ్వడానికి సమ్మతి తెలియజేశారట. అయినప్పటికీ పర్మినెంట్ ఉద్యోగం కావాలని ఉపేందర్ డిమాండ్ చేస్తున్నాడని, ఇది యాజమాన్యానికి ఎట్టిపరిస్థితుల్లోనూ సమ్మతం కాదని నవభారత్ వెంచర్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసమూర్తి పేర్కొన్నారు. ఈ విషయం స్పష్టంగా తెలిపినప్పటికీ, పర్మినెంట్ ఉద్యోగం కోసం ఉపేందర్ మొండిగా ఆందోళన చేయడంలో అర్థం లేదంటున్నారు.
ఇదంతా చూస్తుంటే… సాధ్యం కాని పర్మినెంట్ ఉద్యోగం కోసం ఉపేందర్ అంతగా ఆందోళన చేస్తుండడం చూస్తుంటే, ఉద్ధేశపూర్వకంగానే ప్రమాదం కొనితెచ్చుకున్నట్లుగా యాజమాన్యం భావించవలసి వస్తోందని ఆయన పేర్కొన్నారు. అందుకే ‘ఇక్కడ ఉద్యోగం కోసం చేయి నరుక్కోబడును’ అని హెడ్డింగ్ పెట్టింది. విషయం అర్థమైనట్లేగా…? డౌటుంటే శ్రీనివాసమూర్తి విడుదల చేసిన పత్రికా ప్రకటన కూడా వార్తా కథనంలోనే ఉంది… ఓసారి చదవండి మరి!