వరంగల్-ఖమ్మం-నల్గగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి విషయంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఓ నిర్ణయానికి వచ్చేసిందా? ఔననే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఆ పార్టీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వరరెడ్డినే మళ్లీ బరిలోకి దింపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు ఈ ప్రచారపు సారాంశం. ఇందుకు సంబంధించి పల్లా రాజేశ్వరరెడ్డికి సీఎం నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చినట్లు కూడా అధికార పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
వచ్చే మార్చిలో జరగనున్న ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార పార్టీ నేతలు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాలు జిల్లాల వారీగా నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ఇంచార్జిలను కూడా నియమించారు. మరోవైపు గ్రాడ్యుయేట్లను ఓటర్లుగా నమోదు చేయించే ప్రక్రియలో పాలు పంచుకుంటున్నారు. గత ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వరరెడ్డి విజయం సాధించారు. అయితే ఈసారి ఎన్నికల్లో పోటీకి రాజేశ్వరరెడ్డి విముఖంగా ఉన్నారనే ప్రచారం అధికార పార్టీ వర్గీయుల్లోనే సాగింది.
దీంతో పలువురు ఎమ్మెల్సీ టికెట్ పై సహజంగానే ఆశలు పెంచుకున్నారు. టీ న్యూస్ ఇన్ పుట్ ఎడిటర్ పీవీ శ్రీనివాస్ తదితరులు ఈమేరకు టికెట్ వేటలో తమ వంతు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ తాజా రాజకీయ పరిణామాలు తదితర అంశాలను బేరీజు వేసి మళ్లీ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని పల్లా రాజేశ్వరరెడ్డికి సీఎం కేసీఆర్ నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చాయనే ప్రచారం జరుగుతోంది. ఏ కోణంలో చూసినా రాజేశ్వరరెడ్డి సరైన అభ్యర్థిగా పార్టీ భావిస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాల్లో సాగుతున్న తాజా ప్రచారపు సారాంశం.