- మంత్రి పొంగులేటి చొరవతో తాత్కాలిక మరమ్మత్తులు పూర్తి
- 2.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు
- క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి వెల్లడి
- హర్షం వ్యక్తం చేస్తున్న ఆయకట్టు రైతులు
గండి పడిన పదిహేను రోజుల్లోపే పాలేరు పాత కాలువ మరమ్మత్తులను పూర్తి చేశారు. దీంతో నీళ్లు లేక నెర్రెలు బారుతున్న పొలాలకు ప్రాణం పోసినట్లయింది. రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని యుద్ధప్రాతిపదికన కాలువ గండిని పూడ్పించారు. కాలువ మరమ్మతులు పూర్తి కావడంతో రైతులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.
ఈనెల 1వ తేదీన కురిసిన భారీ వర్షాలకు పాలేరు పాత కాలువ గండి పడిన సంగతి తెలిసిందే. దీంతో మంత్రి పొంగులేటి వెంటనే స్పందించి ఇంజనీరింగ్ అధికారులను అప్రమత్తం చేశారు. కాలువ తాత్కాలిక మరమ్మత్తులకు ఆదేశించడమే కాకుండా ఎప్పటికప్పుడు పనులను స్వయంగా పర్యవేక్షించారు. త్వరితగతిన పనులను పూర్తి చేయించి నాగార్జున ప్రాజెక్టు పరిధిలోని 2.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందేలా మంత్రి చర్యలు చేపట్టారు. రెండు వారాల్లోపే గండిని పూడ్పించి పంటలకు సాగునీటిని విడుదల చేయటం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకున్న మంత్రి పొంగులేటికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.