‘‘భక్తరామదాసు ప్రాజెక్ట్ తో పాలేరు నియోజకవర్గ రైతుల కలను సాకారం చేసిన తుమ్మల అని చెప్పుకునే ఓ భజన సంఘం ఆ రైతులే అక్కడ ఆయనని ఓ అనామకుడి చేతిలో ఓడించారన్న విషయం మర్చి పోయారా?’’
చదివారు కదా? మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రస్తుత రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అనుచరుల మధ్య సాగుతున్న ‘సోషల్ మీడియా వార్’ పోస్టుల్లోని ఓ పేరాగ్రాఫ్ ఇది. ఇక్కడ విషయమేమిటంటే ఈ ‘సోషల్ వార్’లో పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిని మరీ ‘అనామకుడు’గా ప్రస్తావించడం పట్ల ఆయన అనుచరగణం తీవ్ర స్థాయిలో మనస్తాపం చెందుతున్నదట.
వాస్తవానికి తన రాజకీయ జీవితంలో తుమ్మల నాగేశ్వరరావు ప్రతిసారీ ‘ఫ్రెషర్స్’ చేతిలో ఓటమి పాలు కావడం గమనార్హం. సత్తుపల్లి నియోజకవర్గంలో తుమ్మల నాగేశ్వరరావు తొలిసారి ఓటమిని చవి చూసినపుడు ఆయనను పరాజయం బాట పట్టించిన జలగం ప్రసాదరావు ఎమ్మెల్యేగా తొలిసారే పోటీ చేశారు.
ఆ తర్వాత జలగం వెంకట్రావు చేతిలో తుమ్మల మరోసారి ఓటమి పాలయ్యారు. ఈ సమయంలోనూ జలగం వెంకట్రావు సత్తుపల్లి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. జలగం ప్రసాదరావు, జలగం వెంకట్రావులు మాజీ సీఎం జలగం వెంగళరావు కుమారులైనప్పటికీ మొదటి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా గెలుపొంది తుమ్మలను ఓడించారు.
ఈ నేపథ్యంలోనే నియోజకవర్గాల పునర్విభజన కారణంగా ఖమ్మం జిల్లా కేంద్రానికి రాజకీయ మకాం మార్చిన తుమ్మల నాగేశ్వరరావును 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ ఓడించారు. ఈ సందర్భంగానూ అజయ్ తొలిసారి ఎమ్మెల్యేకు పోటీ చేసి విజయం సాధించడం గమనార్హం.
ఇక ఏడాదిన్నర క్రితం జరిగిన ఎన్నికల్లో పాలేరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన కందాళ ఉపేందర్ రెడ్డి కూడా తుమ్మల నాగేశ్వరరావును ఓడించారు. వాస్తవానికి 2009 నుంచే కందాళ ఉపేందర్ రెడ్డి పాలేరు కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. దివంగత సీనియర్ కాంగ్రెస్ నేత రాంరెడ్డి వెంకటరెడ్డి అప్పట్లో సుజాతనగర్ నుంచి పాలేరుకు షిఫ్ట్ కావడం వల్ల కందాళ టికెట్ ప్రయత్నాలు సఫలం కాలేదు.
కందాళ ఉపేందర్ రెడ్డి రాజకీయంగా మరీ అనామకుడు కాకపోవడమే ఇక్కడ గమనించాల్సిన అంశమని పరిశీలకులు అంటున్నారు. జలగం బ్రదర్స్, పువ్వాడ అజయ్ కుమార్ స్థాయిలో కాకపోయినా కందాళ కూడా దశాబ్ధాల రాజకీయ నేపథ్యం గల కుటుంబం నుంచి వచ్చినవారేనని ఆయన అనుచరగణం చెబుతోంది. ఉపేందర్ రెడ్డి తండ్రి కందాళ నరసింహారెడ్డి ఈశ్వరమాదారం సర్పంచ్ గా పనిచేశారు.
అంతేగాక కాంగ్రెస్ లోని పలువురు ఉద్దండ రాజకీయ నాయకులతో ఉపేందర్ రెడ్డికి సత్సంబంధాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఆయనకు టికెట్ రావడానికి ఆయా సన్నిహిత సంబంధాలే కారణమని పరిశీలకులు చెబుతుంటారు. మరోవైపు బడా కాంట్రాక్టర్ గానూ ఉపేందర్ రెడ్డి ప్రాచుర్యం పొందారు.
తుమ్మల నాగేశ్వరరావు ప్రతి సందర్భంలోనూ ‘ఫ్రెషర్స్’ చేతిలోనే పరాజయాన్ని చవి చూసినట్లు చరిత్ర చెబుతుండగా, ఆయనను ఓటమి బాట పట్టించిన నాయకులందరూ రాజకీయ నేపథ్యం గల కుటుంబాల నుంచే రావడం, తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించడం ప్రత్యేక విశేషంగా పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు.
అయితే తుమ్మల, అజయ్ వర్గీయుల ‘సోషల్ మీడియా’ పోస్టుల యుద్దంలో కందాళ ఉపేందర్ రెడ్డిని మరీ ‘అనామకుడు’గా ప్రస్తావించడాన్ని మాత్రం ఆయన అనురగణం జీర్ణించుకోలేకపోతోందట. అదీ విషయం.