తెలంగాణా వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ సరిగ్గా 48 గంటల ముందు ఏం చెప్పారు? ‘రైతులపైనే మీ బతుకు.వెర్రి వేషాలేయొద్దు’ అంటూ హుజూరాబాద్ పర్యటనలో రైస్ మిల్లర్లకు మంగళవారం గట్టి వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రైతులను చిన్న చూపు చూసినా, సతాయించినా, దౌర్జన్యం చేసినా సర్కార్ సహించదు. పనిష్మెంట్ ఉంటది’ అని కూడా మంత్రి హెచ్చరించారు.
కానీ మంత్రి హెచ్చరికలను రైస్ మిల్లర్లు ఖాతర్ చేస్తున్నట్లు కనిపించడం లేదు. రైతన్నలను వేపుకు తింటూనే ఉన్నారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులను నిండా ముంచుతున్నారు. తాలు, తేమ పేరుతో ప్రతి క్వింటాలుకు 5 నుంచి 10 కిలోల వరకు తరుగు తీస్తున్నారట. ఇందుకు అంగీరిస్తేనే ధాన్యం కొనుగోలు చేస్తామని తకరారు చేస్తున్నారట. సర్కార్ నిబంధనలు తమ ముందు చెల్లవని దబాయిస్తున్నారట.
దీంతో దిక్కు తోచని రైతన్నలు ఆగ్రహిస్తున్నారు. మిల్లర్ల దోపిడీకి నిరసనగా ఏకంగా పండించిన ధాన్యానికే నిప్పు పెడుతున్నారు. రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల రామారావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలోనే గురువారం ఈ ఘటన జరగడం గమనార్హం. తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన రైతులు మిల్లర్ల వేధింపులను తాళలేక వరి ధాన్యానికి పెట్రోల్ పోసి నిప్పంటించారు. మిల్లర్ల దౌర్జన్యం నశించాలంటూ నినదించారు. సారూ… ఈటెల వారూ వినిపిస్తోంది కదా…? సిరిసిల్లలో రైతుల ఆక్రందన.