ఈ ధాన్యపు రాశిని చూడండి. రైతు శ్రమకు నిలువెత్తు నిదర్శనం. ఎంతో సంతోషవదనంతో ఓ మహిళా రైతు చాట నిండా ధాన్యాన్ని తీసుకుని ఎత్తిపోస్తున్న దృశ్యం నయనానందం. తెలంగాణా పంట పండినట్లు పత్రికల్లో ప్రముఖంగా వార్తా కథనాలు. యాసంగి, వానాకాలం సీజన్ల పంటలకు కలిపి 1.10 కోట్ల ఎకరాల్లో పంటలు సాగైనట్లు వార్తా కథనాల సారాంశం. ప్రత్యేక తెలంగాణా ఏర్పడిన తర్వాత తొలిసారి ఈ వ్యవసాయ సంవత్సరంలో రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల దిగుబడి పెరిగిందట. మొత్తంగా 85 శాతం ఆహార ధాన్యాల దిగుబడి పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నట్లు వార్తలు వచ్చాయి.
ఇపుడు దిగువన గల ఈ ఫొటోను చూడండి. ధాన్యం కొనుగోళ్లలో విపరీత జాప్యం, తూకం వేసిన ధాన్యాన్ని మిల్లుల్లో దిగుబడి చేసుకోవడం లేదనే ఆక్రోశంతో రైతులు ధాన్యానికి నిప్పు పెట్టి దహనం చేస్తున్న దృశ్యమిది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో శనివారం జరిగిన సంఘటన ఇది. అంతకు ముందు ఈనెల 23న తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన కొందరు రైతులు కూడా తమ ధాన్యానికి నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే. మిల్లర్ల వేధింపులను తాళలేక, వారి దౌర్జన్యం నశించాలంటూ రైతులు నినదించారు.
కాకతాళీయమో, యాధృచ్చికమోగాని ధాన్యపు దహనాల ఘటనలు చోటు చేసుకున్న తంగళ్లపల్లి, బోయినపల్లి మండలాలు సిరిసిల్ల జిల్లాలోనే ఉండడం. కాబోయే ముఖ్యమంత్రిగా ప్రాచుర్యంలో గల కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో ఇటువంటి ఉదంతాలు చోటు చేసుకోవడం సహజంగానే చర్చకు దారి తీస్తున్నది. మిల్లర్ల తాట తీస్తామనే సారాంశంతో మంత్రి ఈటెల రాజేందర్ హెచ్చరించినా తాలు, తేమ పేరుతో దోపిడీ పర్వం నిరాటంకంగా సాగుతున్నట్లు ధాన్యపు రాశుల దహనపు ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. కళ్ల ముందు కదలాడే ధాన్యపు రాశులను చూసి సంతోషించడమే కాదు… ఆ రాశుల విక్రయంలో కర్షకుల కష్టం మిల్లర్ల పాలు కాకుండా చర్యలు తీసుకున్నపుడే సర్కారు ‘రైతుబంధు’ కల సాకారమవుతుందన్నది నిర్వివాదాంశం.
Photo credit: Eenadu telugu daily