వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకు ఖమ్మం ప్రయివేట్ స్కూళ్ల యజమానులు కొందరు ‘బంపర్’ ఆఫర్ ఇచ్చారు. ఏదేని ఒకరోజు తాము లంచ్ గాని, డిన్నర్ గాని ఏర్పాట్లు చేస్తామని, తమరు తప్పకుండా హాజరు కావాలని వారు మంత్రిని అభ్యర్థించారు. ఇందులో విశేషం ఏముందీ అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు మతలబు అంటున్నాయి ఖమ్మం నగర వరద బాధిత వర్గాలు.
మున్నేరు నది ముంచెత్తిన కారణంగా, భారీ వర్షాల వల్ల ఇరవై రోజుల క్రితం ఖమ్మం నగరం విలవిలలాడిన సంగతి తెలిసిందే. వరదల ధాటికి నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలేగాక, ఎప్పుడూ వరద ముప్పును చూడని ప్రాంతాలవాసులు కూడా చివురుటాకుల్లా వణికపోయారు. దీంతో ఖమ్మం నగరానికేమైంది? అనే ప్రశ్నలు కూడా ఉద్భవించాయి. వేలాది కుటుంబాలు వరద బాధితులుగా మిగిలి ఇప్పటికీ ఇంకా ఆ వరద విలయాన్ని ఇంకా మర్చిపోలేదు. ప్రభుత్వపరంగా జరగాల్సిన స్వాంతన చర్యలు క్రమ పద్ధతిలో జరుగుతున్నాయనేది వేరే విషయం.
వర్షాల, వరదల విలయం ధాటికి ఖమ్మం నగరంలోని చైతన్యనగర్ దాని పరసర ప్రాంతాలు తొలిసారి ముంపునకు గురయ్యాయి. ఫంక్షన్ హాళ్లు, భారీ అపార్టుమెంట్లు కూడా వరద నీటిలో మునిగాయి. నీటి ఉధ్రుతిని నిలువరించేందుకు కోర్టు సమీపాన భారీ డివైడర్లను కూల్చాల్సిన పరిస్థితులు అనివార్యమయ్యాయి. చైతన్య నగర్, పరిసర ప్రాంతాలు వరదల్లో చిక్కుకోవడానికి, ప్రజలు పెద్ద ఎత్తున నష్టపోవడానికి ఈ ప్రాంతంలోని కబ్జాలే కారణమనే విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలోని ఓ కార్పొరేట్ స్కూల్ భవనాన్ని అలుగువాగును, అక్కడే గల రోడ్డును ఆక్రమించి నిర్మించారనే సారాంశంతో వార్తలు వచ్చాయి.
ఈ పరిణామాలపై ఆ ప్రాంతవాసులు భగ్గుమంటున్నారు. కాలువను, రోడ్డును కబ్జా చేసి నిర్మించిన కార్పొరేట్ స్కూల్ భవనాన్ని కూల్చాల్సిందేనని వరద బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ పరిణామాల్లోనే ఆయా స్కూల్ యజమాని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావును కలిసేందుకు వారం క్రితం విఫలయత్నం చేసినట్లు వార్తలు వచ్చాయి. అతని ముఖం కూడా చూడడానికి తుమ్మల సుముఖతను వ్యక్తం చేయలేదని కూడా ఆయా వార్తల సారాంశం.
ఈ నేపథ్యంలోనే కొందరు ప్రయివేట్ స్కూళ్ల యజమానులు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావును మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో కలిశారు. వీరిని చూడగానే మంత్రి తుమ్మల ‘ప్రయివేట్’గా మాట్లాడాలా? పబ్లిక్ గా మాట్లాడాలా? అని తనదైన శైలిలో ప్రశ్నించారట. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో విషయాన్ని ప్రయివేట్ స్కూళ్ల యజమానులు తుమ్మలకు నివేదించారట. ఫలానా స్కూలు భవనం, కబ్జా ఆరోపణల అంశంలో ఫేవర్ కోసం వచ్చినట్లు చెప్పి ఓసారి లంచ్ కుగాని, డిన్నర్ కుగాని రావాలని తుమ్మలను అభ్యర్థించినట్లు సమాచారం.
అయితే ఈ అంశంపై తనను కలిసిన ప్రయివేట్ స్కూళ్ల యజమానులకు మంత్రి ఫుల్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మర్యాదపూర్వకంగా ఏర్పాటు చేసే లంచ్ కుగాని, డిన్నర్ కు గాని రావడానికి తనకు అభ్యంతరం లేదని, కానీ.. కబ్జా అంశంలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పినట్లు సమాచారం. నగరంలో జరిగిన కబ్జాలపై కలెక్టర్ ను సర్వేకు ఆదేశించామని, సర్వే జరుగుతోందని, నివేదికను బట్టి చర్యలు తప్పవని స్పష్టం చేశారట. తనను కలిసిన వీరికి ఐదు నిమిషాలకు మించి తుమ్మల సమయం ఇవ్వకపోవడం విశేషం. కాగా గతంలో తుమ్మలను కలిసేందుకు విఫలయత్నం చేసి, కబ్జా ఆరోపణలు ఎదుర్కుంటున్న కార్పొరేట్ స్కూల్ యజమాని కూడా నిన్న మంత్రిని కలిసిన వారిలో ఉండడం కొసమెరుపు.