పంచతంత్ర కథల్లో ఒక కథ ఇప్పుడు చెప్పాలి. ఒక పేద బ్రాహ్మణుడు తనకు బహుమతిగా వచ్చిన ఒక మేకపిల్లను తీసుకొని వెళుతున్నాడు. అది గమనించిన నలుగురు దొంగలు కుట్ర పన్ని ఎలాగైనా ఆ మేకపిల్లను దక్కించుకోవాలనుకున్నారు. నలుగురూ ఒక్కొక్కరుగా విడిపోయారు. మొదటి దొంగ మేకపిల్లను మోసుకెళ్తున్న పేద బ్రాహ్మణుడికి ఎదురుగా వచ్చి ‘అదేంటి, పండితులు మీరు. నల్లకుక్కను మోస్తున్నారు’ అన్నాడు. మొదటి దొంగ మేకపిల్లను నల్ల కుక్కపిల్ల అన్నప్పుడు పండితుడు నమ్మలేదు. కొంతదూరం తర్వాత రెండో దొంగ ఎదురొచ్చి అదే మాట అనడంతో పండితుడికి కొద్దిగా అనుమానం వచ్చింది. అయినా మేకపిల్లను వదల్లేదు.
ఇంకొంత దూరం ప్రయాణించిన తర్వాత మూడో దొంగ ఎదురుగా వచ్చి మేకపిల్లను చూపి నల్ల కుక్కపిల్ల అన్నాడు. పండితుడిలో నిజంగానే అనుమానం కలిగింది. ఇక నాలుగో దొంగ ఇంకొంత దూరంలో ఎదురొచ్చి నల్ల కుక్కపిల్లను మోస్తున్నారేంటి? అని అడిగాడు. పండితుడికి కలిగిన అనుమానం బలపడింది. భుజం మీద ఉన్న మేకపిల్లను అక్కడే వదిలి వెళ్ళిపోయాడు. పండితుడు వెళ్ళిపోగానే నలుగురు దొంగలు మేకపిల్లను పట్టుకెళ్ళిపోయారు. ఒక అబద్దాన్ని నిజం చేయడం ఎలాగో ఈ కథ తెలియజేస్తుంది.
ఇప్పటి కాలంలోనైతే ఆ పండితుడు మేకపిల్లను వదలడు. ఎందుకంటే.. నిజం తెలుసుకోవడానికి ఇప్పుడు ఆ నలుగురు దొంగలు చెప్పేది మాత్రమే కాదు..ఇంకో మార్గం కూడా ఉంది. అదే సోషల్ మీడియా. పండితుడు నలుగురు దొంగలు చెప్పినంత మాత్రానే మేకపిల్లను కుక్కపిల్లగా సంశయించి, నమ్మి వదిలేయడు. సోషల్ మీడియాలో చూసుకుని మరీ నిర్ధారణ చేసుకుంటాడు. నలుగురు దొంగలు చెప్పింది నిజమో, అబద్దమో నిర్ధారణ చేసుకోగలుగుతాడు.
ఈ చిన్న లాజిక్ మిస్సవుతున్న కొన్ని మీడియా సంస్థలు ఇప్పుడు ఇంకా పంచతంత్రం నాటి పద్ధతులే అనుసరించడం ఏంటో? తమ మీడియాతో పాటు సోషల్ మీడియా కూడా ఉందని నమ్మకపోవడం ఏంటో? మేక పిల్లను నల్ల కుక్కపిల్ల అని నమ్మించే ప్రయత్నం చేయడం ఏంటో? ఇంకా పంచతంత్ర కథల కాలంలోనే ఉంటే ఎలా సామీ? మీ మేథస్సు OUT DATED అయినట్టు అనిపించడం లేదా మీకు? కాస్త UP DATE చేయండి సామీ…!
-దారా గోపి