మన నగరాలు గ్రామీణ ప్రజల ఆశలకు, ప్రత్యేకించి గ్రామీణ యువత ఆశలకు భిన్నంగా తయారవుతున్నాయి. దేశ జనాభాలో ఇప్పటికీ 65 శాతం ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడినప్పటికీ, గ్రామాల్లో వ్యవసాయం దెబ్బతినడంతో యువతరం వ్యవసాయం వైపు చూడడం లేదు. వ్యవసాయం ఒక ప్రధాన ఉపాధి రంగంగా నిలబడలేక పోతోంది. అందుకే గ్రామీణ యువత పట్టణాలు, నగరాలవైపు చూస్తున్నారు. కానీ, దురదృష్టవశాత్తు నగరాలు కూడా ఈ యువతకు ఉపాధి కల్పించే కేంద్రాలుగా అభివృద్ధి చెందడం లేదు. నగరీకరణలోనే లోపం ఉంది. నగరాలను ప్రణాళికాబద్ధంగా తయారు చేస్తున్నాం కానీ, వాటిని ఉపాధి కల్పించే ఉత్పాదక శక్తులుగా మార్చలేకపోతున్నాం.
నగరం అంటే అత్యధిక జనాభా ఉండే రద్దీ అయిన పెద్ద నివాస ప్రాంతం కాదు. అది భావితరాల జీవన కేంద్రం. మన పట్టణ ప్రణాళికా విధానంలోనే ఈ దోషం కనిపిస్తోంది. ఇళ్ళు, రోడ్లు, విద్యుత్తు, విద్య, వైద్యం, మంచి నీరు, డ్రైనేజీ, రవాణా వంటి అంశాలనే పట్టణ ప్రణాళికల్లో మనం ప్రధానంగా చూస్తున్నాం. ఈ మధ్యనే పర్యావరణం కూడా పట్టణ ప్రణాళికలో చేర్చాం. కానీ ఉపాధి అవకాశాలు కూడా పట్టణ ప్రణాళికలో భాగం అయితే తప్ప మన నగరాలు గ్రామీణ యువత భవితకు నిలయాలుగా మారవు. విద్యా, విజ్ఞాన వేత్తలతో పాటు పాలకులు కూడా ఈ అంశంపై దృష్టి పెట్టాలి. నగర ప్రణాళికలో ఉపాధి కేంద్రాల ఏర్పాటు, నైపుణ్య శిక్షణా కేంద్రాలు అంతర్భాగం కావాలి. ఉపాధి కల్పించలేని నగరాలు ‘సజీవ స్మశానాలు’గా మాత్రమే మిగిలిపోతాయి. పాలకులు దృష్టి పెట్టాల్సింది సంక్షేమంపై మాత్రమే కాదు. ఉపాధి కల్పించడం ప్రధాన, ప్రథమ కర్తవ్యంగా ఉండాలి.
-దారా గోపి