తెలంగాణా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పేరున నిన్న విడుదలైన ఉత్తర్వు ఒకటి రాత్రి బాగా పొద్దుపోయాక వెలుగులోకి వచ్చింది. ఈ ఉత్తర్వు సారాంశమేమిటంటే… ఏపూరి భాస్కర్ రావు అనే డిప్యూటీ కలెక్టర్ పై పెండింగ్ లో గల ఆరోపణలపై విచారణకు ఆదేశించడం. ఈమేరకు జీవో ఆర్టీ నెం. 67 ద్వారా ఉత్తర్వును జారీ చేశారు. దుష్ప్రవర్తన, దుర్వినియోగం వంటి ఆరోపణలపై సంజాయిషీని కోరుతూ విచారణకు ఆదేశించారు. ఉత్తర్వు అందిన పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కూడా నిర్దేశించారు.
అయితే ఈ ఉత్తర్వుపై రెవెన్యూ శాఖలో చర్చ జరుగుతోంది. ఏపూరి భాస్కర్ రావు అనే పేరుపై ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ఎవరూ డిప్యూటీ కలెక్టర్ గా విధులు నిర్వహించడం లేదు. ఇంటి పేరు సహా ఒకే విధమైన పేర్లు గల ‘భాస్కర్’లు ఇద్దరూ ఖమ్మం జిల్లాకు చెందినవారే కావడం గమనార్హం. వీరిద్దరిలో ఎవరూ ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో విధులు నిర్వహించడం లేదు. వేర్వేరు జిల్లాల్లో, వేర్వేరు ప్రాంతాల్లో ఒకే పేరు గల ఆయా ఇద్దరు రెవెన్యూ అధికారులు పనిచేస్తున్నారు. ఇందులో ఒక భాస్కర్ రావుపై గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. నేలకొండపల్లి మండలంలో జరిగిన ఓ ఘటనకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన కేసును కోర్టు కొట్టివేసినట్లు సమాచారం. అయితే అదే ఘటనకు సంబంధించిన ఫిర్యాదు రెవెన్యూ శాఖలో పెండింగులో ఉందని, ప్రస్తుతం దానిపైనే శాఖాపరమైన విచారణకు ఆదేశించి ఉంటారని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.
కానీ సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పేరున వెలువడిన ఈ ఉత్తర్వులో స్పష్టత లేదని రెవెన్యూ వర్గాలు అంటున్నాయి. ఖమ్మం జిల్లా ‘ఎస్టాబ్లిష్ మెంట్’ అనే పదం ఉన్నా కొంత క్లారిటీ ఉండేదని అంటున్నారు. ఆయా ఉత్తర్వు ప్రతిని దిగువన చూడవచ్చు.