చదివారుగా…? నేటి సాక్షి పత్రికలోని ఎడిటోరియల్ పేజీలో ‘రాజకీయ కుట్ర’ శీర్షికన ఆ పత్రిక ఎడిటర్ రాసిన వ్యాసంలోని చివరి పేరా ఇది. ప్రతి ఆదివారం ‘జనతంత్రం’ కాలమ్ కింద సాక్షి పత్రిక ఎడిటర్ వర్ధెల్లి మురళి ఓ సుదీర్ఘ వ్యాసం రాస్తుంటారు. ఈ వ్యాసంపై సంస్థాగతంగా ఏర్పాటు చేసుకున్న ‘సాక్షి కుటుంబం’ వాట్సాప్ గ్రూపులో ‘జయహో’ అంటూ కొందరు సిబ్బంది కీర్తన కూడా ప్రారంభమవుతుంది. ఎడిటర్ రాసే వ్యాసాన్ని కీర్తించేవారిలో ఎంత మంది దాన్ని పూర్తిగా చదువుతారో లేదో తెలియదుగాని, ఉదయం వేళే ‘సాక్షి కుటుంబం’ వాట్సాప్ గ్రూపులో ప్రశంసల వర్షం మాత్రం మొదలు కావడం గమనార్హం.
ఇక అసలు విషయంలోకి వస్తే… జనతంత్రం కాలమ్ కింద రాసిన వ్యాసపు చివరి పేరాను నిశితంగా పరిశీలిస్తే… ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ పై నలు వైపులా కుట్ర జరుగుతోందని, అందుకు సంబంధించిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని మురళి పేర్కొన్నారు. లక్ష్మణుడి ప్రాణాలను సంజీవని మూలికతో రక్షించినట్లుగానే ప్రజా చైతన్యమనే సంజీవని మూలిక ఉన్నంతకాలం ఏ ‘జిత్తు’లైనా చిత్తుకాక తప్పదని మురళి తన వ్యాసాన్ని ముగించారు.
ఈ ఆదివారం రాసిన వ్యాసంలో మురళి ప్రత్యేకంగా న్యాయ పరిభాషలోని పదాలను వాడడం విశేషం. ముఖ్యంగా ‘ఎగ్జిబిట్’ అనే పదం. సాధారణంగా ఈ పదాన్ని న్యాయపరిభాషగానే ఎక్కువగా వ్యవహరిస్తుంటారు. ఏదేని కేసు దాఖలు సందర్భంగా న్యాయస్థానంలో సంబంధిత కక్షిదారు తరపు న్యాయవాది సమర్పించే ‘డాక్యుమెంటరీ ఎవిడెన్స్’ను ఎగ్జిబిట్ నెంబర్లుగా ఉటంకిస్తుంటారు. కేసుకు సంబంధించిన సాక్ష్యాన్ని న్యాయస్థానంలో సమర్పించిన సమయంలో వీటి సంఖ్యకు అనుగుణంగా న్యాయవాదులు వాటిని ప్రస్తావిస్తారు. అది డాక్యుమెంట్ కావచ్చు, సీడీ కావచ్చు, ఓ పెన్ను కూాడా కావచ్చు. కేసుకు సాక్ష్యంగా ఉపకరించే ప్రతి వస్తువును ‘ఎగ్జిబిట్’గానే పేర్కొంటారు.
అయితే ‘ఎగ్జిబిట్’గా పేర్కొన్న ప్రతి ఆధారాన్ని ‘మార్క్’ చేసినంత మాత్రాన దానికి విలువ ఉన్నట్లు కాదని న్యాయవాద వర్గాలు చెబుతుంటాయి. ‘మార్క్’ చేసిన డాక్యుమెంట్లు కరెక్టుగానే ఉన్నాయని, తాను వాటిని నమ్ముతున్నానని న్యాయమూర్తి ప్రకటించినపుడు మాత్రమే కేసుకు ఆధారంగా సమర్పించిన ‘ఎగ్జిబిట్’లకు విలువ ఉంటుంది. న్యాయమూర్తి వాటిని పరిగణనలోకి తీసుకోని సందర్భంలో ఎన్ని ఎగ్జిబిట్లను ‘మార్క్’ చేసినా ఫలితం ఉండదనేది న్యాయపరిభాషలోనే ప్రధానాంశం.
ఇప్పుడీ న్యాయ పరిభాష పదాల ప్రస్తావన దేనికంటే… సాక్షి పత్రిక ఎడిటర్ వర్దెల్లి మురళి నేటి ఎడిటోరియల్ పేజీలో రాసిన వ్యాసంలో మొత్తం ఆరు ఎగ్జిబిట్ నెంబర్లను ప్రస్తావించారు. వ్యాసంలో ఎక్కడా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేరును నేరుగా ప్రస్తావించకుండానే కుట్ర కోణాలంటూ అనేక అంశాలను మురళి సృశించడం గమనార్హం. వేర్వేరు సందర్భాల్లో చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు కొందరు చేసినట్లు ప్రాచుర్యంలోకి వచ్చిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. అంతిమంగా అంతర్వేది రథం దగ్ధం ఘటనను తీసుకువచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడులోని వేణుగోపాలస్వామి దేవుని రథం ఇదే తరహాలో దగ్ధమైందని, పుష్కరాల పేరుతో విజయవాడలో 40 గుళ్లను కూల్చివేస్తే ఇప్పుడు మాట్లాడుతున్న నేతలు అప్పట్లో నోరెత్తలేదని పేర్కొన్నారు. ఇలా చంద్రబాబాబు హయాంలో జరిగిన ఇంకా అనేక ఉదంతాలను ప్రస్తావించారు.
అంతిమంగా ఆయన ఏమంటారంటే… జగన్ సర్కారుపై నలు వైపులా జరుగుతున్న కుట్రలను జన చైతన్య సంజీవని రక్షిస్తుందని మురళి స్పష్టీకరించారు. వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైనా, ఆయన రాజకీయ భవితపైనా కుట్రలు, అందుకు ప్రత్యర్థులు అనుసరిస్తున్న జిత్తులు కొత్తవేమీ కాదనేది అందరికీ తెలిసిందే. వైఎస్ మరణానంతరం జగన్ పై జరిగిన కుట్రలకన్నా తాజా ఘటనలు పెద్దవేమీ కాకపోవచ్చు. గత ఎన్నికల్లో జగన్ ప్రజల ముందు అనేక ‘ఎగ్జిబిట్’ నెంబర్లను ఉంచిన ఫలితంగానే ఏపీ ప్రజలు ఆయనకు చరిత్రాత్మక రీతిలో పట్టాభిషేకం చేశారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు సాగిన కుట్ర సిద్ధాంతాలన్నింటినీ చేధించి జగన్ సీఎం సీట్లో కూర్చున్న దృశ్యాలు తెలుగు ప్రజలకు తెలియనివేమీ కాదు. రాజకీయ ఎత్తులకు పైఎత్తులు వేయడంలో జగన్ ఎన్నో అనుభవాలను నేర్చుకున్నారు కూడా.
కానీ వర్థెల్లి మురళి తన ‘జనతంత్రం’ కాలమ్ ద్వారా రాసిన వ్యాసంలో కుట్ర కోణాల్లో కొత్తగా సమర్పించిన ‘ఎగ్జిబిట్’ అంశాలేమిటనేదే బోధపడని అసలు ప్రశ్నగా జర్నలిస్టుల సర్కిళ్లు చర్చించుకుంటున్నాయి. జర్నలిజంలో తనకంటూ ప్రత్యేక ఒరవడి కలిగి ఉన్నట్లు ప్రాచుర్యంలో గల మురళి గడచిన నాలుగేళ్లుగా ‘పదవీ కాల పొడిగింపు’ ప్రాతిపదికన సాక్షి ఎడిటర్ గా కొనసాగుతున్నట్లు ఆ సంస్థ వర్గాలే చెబుతున్నాయి. మరో ఏడాదిలో ఈ ‘పొడిగింపు’ ముగుస్తుందంటున్నారు. మార్క్సిస్టు రాజకీయ కుటుంబ నేపథ్యం గల వర్ధెల్లి మురళి పదవీ విరమణ పొడిగింపు అనే అంశానికి, ఈ వ్యాసంలోని పాత చింతకాయ పచ్చడి తరహా అంశాల ప్రస్తావనకు లంకె పెడుతూ ‘ఎగ్జిబిట్’గా భావించాల్సిన అవసరం లేదేమో? అని కూడా జర్నలిస్టు వర్గాలు భావిస్తున్నాయి.
ఎందుకంటే చంద్రబాబును ప్రధానిగా చూడాలని పరితపించి, ఇతర పత్రికల్లో ఉన్నపుడు పుంఖాను పుంఖాలుగా ఎడిటోరియల్స్, వ్యాసాలు రాసినవారే కాలక్రమంలో జగన్ మీడియాలో, ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవించిన దాఖలాలు కూడా ఉన్నాయని ఆ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.