తెలంగాణాలో ఒమిక్రాన్ వైరస్ విజృంభిస్తోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరిగిపోతుండడంతో ప్రభుత్వం ఆంక్షలను మరింత కఠినతరం చేస్తోంది. ఇందులో భాగంగానే ఈనెల 10వ తేదీ వరకు కరోనా ఆంక్షలను సవరిస్తూ ప్రభుత్వం ఈనెల 1వ తేదీన ఉత్తర్వు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఓవైపు కరోనా, ఇంకోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరిగిపోతుండడంతో అనేక భారీ కార్యక్రమాలపైనా దీని ప్రభావం పడుతోంది. ఈమేరకు నాంపల్లిలో ప్రారంభమైన నుమాయిష్ (ఎగ్జిబిషన్)ను నిలిపేశారు. శనివారం ప్రారంభించిన నుమాయిష్ ను ఆదివారం రాత్రికి నిలిపివేయడం గమనార్హం.
ప్రభుత్వ ఆదేశాల మేరకు అనేక ఈవెంట్లు, సభలు, సమావేశాలు కూడా రద్దవుతుండగా, మరికొన్ని తాత్కాలికంగా వాయిదా పడుతున్నాయి. ఈనెల 4వ తేదీన జరగాల్సిన మంత్రి కేటీఆర్ ఖమ్మం పర్యటన కూడా వాయిదా పడింది. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లలో నిర్వహించే ‘గ్రీవెన్స్ డే’ కార్యక్రమాలను కూడా రద్దు చేశారు.