రాజకీయ పార్టీల నేతలు పరస్పరం దుమ్మెత్తిపోసుకోవడం మామూలే. కేంద్రంలో, రాష్ట్రంలో వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నపుడు, వాటి మధ్య సఖ్యత లేనపుడు ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శల సంగతి అందరికీ తెలిసిందే. నిధులకేటాయింపు, విడుదల అంశంలో ఇటువంటి విమర్శలు, ఆరోపణల దాడి అధికారంలోగల రాజకీయ పార్టీల మధ్య మరీ తీవ్రంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంపై, ముఖ్యంగా అక్కడ అధికారంలోగల బీజేపీ నేతలపై తెలంగాణాకు చెందిన అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు ఇటీవలి కాలంలో విరుచుకుపడుతున్నారు. సీఎం కేసీఆర్ నుంచి ఎమ్మెల్యేల వరకు కేంద్రం తీరుపై భగ్గుమంటున్నారు. రాజీనామాలు, సవాళ్లు, ప్రతి సవాళ్ల వరకు వెడుతోంది. తాను చెప్పేవి అబద్ధాలైతే ఒక్కటే నిమిషంలో పదవికి రాజీనామా చేస్తానని సీఎం కేసీఆర్ కొడకండ్ల రైతువేదిక ప్రారంభ సభలో సవాల్ విసిరారు. ఇందుకు బీజేపీ నేతలు కూడా ధీటుగానే ప్రతి సవాల్ చేశారనేది వేరే విషయం. కానీ ప్రభుత్వాధికారులు సైతం కేసీఆర్ వాదనకు బలం చేకూరుస్తూ నివేదించడం విశేషం. ఏదేని డౌటుంటే దిగువన గల ‘అధికారిక ప్రకటన’ వార్తా కథనాన్ని ఓసారి పరిశీలనగా చదివేయండి.
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్రానికి ఎంతో నష్టం జరిగినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క నయాపైసా కూడా సాయం అందలేదని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో శనివారం సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వ వరద సాయంపై ప్రస్తావన వచ్చింది.
‘‘ఇటీవల కురిసిన వర్షాల వల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వరదలు ముంచెత్తాయి. దీనివల్ల అనేక రంగాలకు తీవ్ర నష్టం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టం కూడా జరిగింది. దాదాపు 5వేల కోట్ల వరకు నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేసి, రూ. 1350 కోట్లను తక్షణ సాయంగా అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అక్టోబర్ 15న లేఖ రాశారు. వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాన మంత్రి దిగ్భాంతి కూడా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో వారు స్వయంగా మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు. కేంద్ర బృందం కూడా రాష్ట్రంలో పర్యటించి, పరిస్థితిని స్వయంగా చూసింది. ఇంత జరిగిన తర్వాత కేంద్రం నుంచి ఎంతో కొంత సాయం అందుతుందని ఆశించాం. కానీ కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా సాయం అందలేదు’’ అని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వానివి శుష్క ప్రియాలు, శూన్య హస్తాలే అనే విషయంలో మరోసారి నిరూపణ అయిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వర్షాలు, వరదల వల్ల భారీగా పంట నష్టం, ఆస్తి నష్టం జరిగినా ఒక్క రూపాయి కూడా సాయం అందించకపోవడం కేంద్ర ప్రభుత్వ వైఖరిని తేటతెల్లం చేస్తుందని విమర్శించారు. దేశంలోని అతి పెద్ద నగరాల్లో ఒకటైన హైదరాబాద్ నగరానికి నష్టం జరిగితే కూడా స్పందించి సాయం చేయకపోవడం దారుణమన్నారు.