శ్వాస…సమస్త జీవుల ప్రాణానికి సురక్ష. అదే శ్వాస ప్రాణాంతకమైతే జీవి ప్రాణం గోవిందా. ఇది మనుషులకే కాదు…ఊపిరి తీసుకునే ఏ ప్రాణికైనా వర్తిస్తుంది. ఇప్పడు ఢిల్లీలో బతకడం కన్నా గల్లీలో ఉండడమే మిన్న అనిపిస్తోంది మరి. నీరు, తిండి మాత్రమే కాదు…గాలి కూడా అక్కడ ఇప్పడు అంగట్లో సరుకే. గాలి, నీరు, నిప్పు ఎవరి సొంతమూ కాదనే వాదన ఇప్పడు వీగిపోయే పరిస్థితి అనివార్యమైంది. నీరు, నిప్పుతోపాటు గాలికీ మానవ జీవి బడ్జెట్ కేటాయించుకోవలసిన ప్రమాదం ముంచుకొచ్చింది.

దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో స్వచ్ఛమైన ఆక్సిజన్ క్లబ్బులు ఏర్పాటయ్యాయట. ఇక్కడ వాయుకాలుష్యం పెరిగిపోతుండటంతో ప్రజలు నానా పాట్లు పడుతున్న సంగతి తెలిసిందే కదా? వాయుకాలుష్యం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నప్పటికీ అవి ఏమాత్రం సత్ఫలితాలను ఇవ్వటంలేదట. దీంతో స్వచ్చమైన గాలి కోసం అక్కడి ప్రజలు ‘ముక్కులు’ చాస్తున్నారుట. దీన్ని వ్యాపార కోణంలో చూసిన కొందరు ఢిల్లీ సాకేత్‌ ప్రాంతంలో ‘ఆక్సిప్యూర్‌’ పేరుతో బార్‌ ఏర్పాటు చేసి స్వచ్చమైన గాలిని అమ్మకానికి ఉంచారు. పదిహేను నిమిషాల ఆక్సిజన్‌ను రూ. 299లకు అమ్ముతున్నట్లు బార్‌ నిర్వాహకులు వెల్లడించారు. లెమన్‌గ్రాస్‌, ఆరెంజ్‌, సిన్నామన్‌ (దాల్చినచెక్క), స్పియర్‌మింట్ (పుదీనా), పెప్పర్‌మింట్‌, యూకలిప్టస్‌, లావెండర్‌, వెనీలా, చెర్రీ, బాదం, వింటర్‌గ్రీన్‌, గార్డెనియాస్‌ వంటి ఏడు రకాల పరిమళాలలో ఆక్సిజన్‌ను అందిస్తున్నట్లు వారు చెబుతున్నారు. తాము వివిధ రకాల పరిమళాలలో పదిహేను నిమిషాల పాటు పీడనాన్ని అదుపుచేస్తూ గాలిని అందిస్తామంటున్నారు. వినియోగదారులు ట్యూబ్‌ ద్వారా ఈ గాలిని పీల్చుకోవచ్చని, దీన్ని ఒక వ్యక్తి రోజులో ఒకసారి మాత్రమే పీల్చుకోగలరంటున్నారు. దీని వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని’’ ఆక్సిప్యూర్‌ ప్రతినిధి బోన్ని ఐరెన్‌బామ్‌ ఓ వార్తా సంస్థకు తెలిపారు. దీనిని రోజులో ఒక సారి పీల్చడం వల్ల శరీరాన్ని ఉత్తేజపరుస్తుందని,  మనసు ప్రశాంతంగా ఉంటుందని, మంచి నిద్ర పడుతుందని, ఒత్తిడిని దరిచేరనీయదని, జీర్ణశక్తి పెరుగుతుందని బోన్ని ఐరెన్‌బామ్‌ స్పష్టం చేసినట్లు సదరు వార్తా సంస్థ కథనం సారాంశం.

దేశంలోని అనేక ఉత్తరాది ప్రాంతాలు స్వచ్ఛమైన గాలి విషయంలో డేంజర్ జోన్ లో ఉన్నాయని మరోవైపు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (సీపీసీబీ) నివేదికలు చెబుతున్నాయి. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్, భివాని, బహదుర్ ఘర్, భటిండా, హాపూర్, భీవండి, బులంద్ షహార్, అంబాలా, అమురత్ సర్, రోహతక్, పటౌడి, కాన్పూర్ వంటి ప్రదేశాలే గాక ఉత్తరాదిలోని అనేక నగరాలు స్వచ్ఛమైన గాలికి సంబంధించి రెడ్ జోన్లో ఉన్నాయి. దక్షిణాదిలోని హైదరాబాద్, విశాఖపట్నం, కాకినాడ, నెల్లూరు, బెంగళూరు, చెన్నయ్, విజయవాడ, మైసూర్, కొచ్చి తదితర దక్షిణాది రాష్ట్రాలు ప్రస్తుతానికైతే గ్రీన్ జోన్ లో ఉన్నట్లు సీపీసీబీ స్పష్టం చేసింది. పచ్చని అడవుల్లో వాగులు, వంకల్లో నీటి చెలమల నీరు తాగిన, ఇప్పటికీ తాగుతున్న అరణ్యవాసులు హాయిగా శ్వాస పీల్చుకుంటున్నారు. వెచ్చని నగరాల్లో సకల సౌకర్యాలు అనుభవిస్తున్న ఆధునిక మానవుని ఊపిరి మాత్రం ఇప్పడు ప్రమాదంలో పడింది. గాలిని కూడా కొనుక్కుని బతకాల్సిన దుస్థితి. ఇందుకు కారణాలు మనకు తెలియనివి కావు కదా?

Comments are closed.

Exit mobile version